- నల్లా కనెక్షన్ కోసం డబ్బులు అడుగుతున్నరు
- పనులు పూర్తికాకుండానే ఇండ్లు కేటాయించిన్రు
- ఇల్లు వచ్చిందన్న సంతోషం లేకుండా పోయిందని ఆవేదన
- 86 కంప్లయింట్లు వస్తే.. అందులో 62 ఫిర్యాదులు ఇండ్లపైనే
హైదరాబాద్, వెలుగు : జీహెచ్ఎంసీలో మూడున్నరేండ్ల తర్వాత సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. మొత్తం 86 ఫిర్యాదులు వస్తే.. అందులో 62 కంప్లయింట్లు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లపైనే ఉన్నాయి. ఇండ్లల్లో సౌలత్లు లేవని, కరెంట్ కనెక్షన్ ఇవ్వాలని, తాగునీళ్లు రావడం లేదంటూ ప్రజావాణిలో లబ్ధిదారులు ఫిర్యాదు చేశారు. సౌకర్యాలు ఏర్పాటు చేయకపోయినా.. డబ్బులు చెల్లించాలంటూ జీహెచ్ఎంసీ అధికారుల నుంచి ఫోన్లు వస్తున్నాయని వాళ్లు పేర్కొన్నారు.
ఎన్నో ఏండ్ల నుంచి ఆశగా ఎదురు చూస్తే.. డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరైందని, కానీ.. ఆ ఇంట్లో ఉండలేకపోతున్నామంటూ మరికొందరు ఫిర్యాదు చేశారు. డబుల్ బెడ్ రూమ్ వచ్చిందన్న సంతోషమే లేదంటూ జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ముందు లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇండ్లకు కరెంట్ కనెక్షన్ ఎందుకు లేదని అధికారులను ప్రశ్నిస్తే.. డబ్బులు చెల్లిస్తే కనెక్షన్ ఇస్తామంటున్నారని మేయర్‌కు వివరించారు.
సుమారు మూడున్నరేండ్ల తర్వాత ప్రజావాణి నిర్వహిస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న ప్రజలు.. పెద్ద సంఖ్యలో జీహెచ్ఎంసీకి తరలివచ్చారు. దీంతో మేయర్ ఆదేశాల మేరకు అధికారులు వాళ్లకు టోకెన్లు అందజేశారు. ఫిర్యాదులు అందుకున్న మేయర్.. వాటిని వారం రోజుల్లో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
డబ్బులిస్తేనే కనెక్షన్ ఇస్తామంటున్నరు
‘మాకిచ్చిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లల్లో నల్లా కనెక్షన్లు లేవు. ఇంట్లో పనులు కూడా కంప్లీట్ కాలేవు. చాలా ఇండ్లు అసంపూర్తిగానే ఉన్నయ్. వర్క్స్ పూర్తి చేయాలని అధికారుల దగ్గరకుపోతే.. స్పందించడం లేదు. కరెంట్, నీటి సౌలత్ కల్పించాలంటూ కొన్ని నెలల నుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్నం. డబ్బులు కడితేనే కనెక్షన్ ఇస్తామంటున్నరు’ అని డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు మేయర్‌కు ఫిర్యాదు చేశారు.
పనులు పూర్తి కాకుండానే గత ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించింది. కొందరు బ్రోకర్లు మాకాడికి వస్తున్నారు. డబ్బులిస్తే కరెంట్, నల్లా కనెక్షన్లు ఇప్పిస్తామంటున్నరు. అన్ని సౌలత్లు కల్పించాల్సిన బాధ్యత బీఆర్ఎస్ సర్కాదే అయినా.. అప్పుడు పట్టించుకోలేదు. డబ్బులు డిమాండ్ చేస్తున్నారని అధికారులకు ఫిర్యాదు చేస్తే వాళ్లూ స్పందించడం లేదు’ అని పలువురు లబ్ధిదారులు మేయర్ దృష్టికి తీసుకెళ్లారు.
మేం డబ్బులు అడగలేదు : మేయర్
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతి సోమవారం జోన్, సర్కిల్ ఆఫీసుల్లో ప్రజావాణి నిర్వహిస్తామని మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట దాకా ఫిర్యాదులు స్వీకరిస్తామన్నారు. ఫిర్యాదులను పరిష్కరించి నివేదికను ప్రతి శనివారం అందజేయాల్సిందిగా అధికారులను ఆదేశించామన్నారు. ఎన్ని రోజుల్లో సమస్య పరిష్కరిస్తామో కూడా తెలియజేయాలని, ప్రతి ఫిర్యాదుకు రశీదు ఇవ్వాలని తెలిపారు. ‘కరెంట్, నల్లా కనెక్షన్ల కోసం డబ్బులు ఇవ్వాలని మేము ఎవరికీ ఫోన్ చేయలేదు. సైబర్ నేరగాళ్లే ఫోన్లు చేస్తున్నట్టు మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. గూగుల్ పే, ఫోన్ పే ద్వారా డబ్బులు చెల్లించాలని అంటున్నరు. వాళ్ల మాటలు నమ్మి మోసపోవద్దు. కరోనా కారణంగానే ఇన్ని రోజులు ప్రజావాణి నిర్వహించలేదు’ అని మేయర్ విజయలక్ష్మి చెప్పారు.