- కరెంట్, డ్రైనేజీలు, సీసీ రోడ్లు లేవని లబ్ధిదారుల ఆందోళన
- నూకపల్లిలో 3722 డబుల్ ఇండ్ల నిర్మాణం
- ఎన్నికల ముందు హడావుడిగా పట్టాలు
- పెండింగ్ పనులు పూర్తికి మరో ఆర్నెళ్లు
జగిత్యాల, వెలుగు: బీఆర్ఎస్సర్కార్ హయాంలో జగిత్యాల అర్బన్ పేదల కోసం నూకపల్లిలో 3722 డబుల్బెడ్రూం ఇండ్లు నిర్మించారు. అయితే ఇండ్లు నిర్మించి సౌలత్‌లు కల్పించడంలో గత సర్కార్ ఘోరంగా ఫెయిలైంది. ఎన్నికలకు ముందు హడావుడిగా లబ్ధిదారులకు పట్టాలు అందజేసి అధికారులు చేతులు దులుపుకున్నారు. ఇది జరిగి 4 నెలలవుతున్నా ఇప్పటిదాకా ఆ ఇండ్లను హ్యాండోవర్ చేయలేదు. పెండింగ్ పనులు పూర్తికాకపోవడంతోనే లబ్ధిదారులకు హ్యాండోవర్ చేయనట్లు తెలుస్తోంది. ఈ పనులు పూర్తయ్యేందుకు మరో ఆర్నెళ్లు పట్టే అవకాశముంది. మరోవైపు గృహ ప్రవేశాలు చేసిన లబ్ధిదారులు సౌకర్యాలు కల్పించాలని సోమవారం జగిత్యాల కలెక్టరేట్ఎదుట ధర్నాకు దిగారు. కరెంట్, డ్రైనేజీలు, సీసీ రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పనులన్నీ పెండింగ్‌లోనే...
బీఆర్ఎస్ సర్కార్ హయాంలో జగిత్యాల అర్బన్ పేదల కోసం నూకపెల్లి లో 4520 డబుల్ బెడ్రూం ఇండ్లను మంజూరు చేశారు. 4 నెలల కింద 3722 ఇండ్లు కంప్లీట్ కావడంతో అక్టోబర్‌లో లబ్ధిదారులను ఎంపిక చేసి పట్టాలు అందజేశారు. వీటిలో 3200కు పైగా ఇండ్లలో మౌలిక వసతులు కల్పన పూర్తికాలేదు. సీసీ రోడ్డు, కరెంట్ పోల్స్ కోసం రూ.25 కోట్లు మంజూరు చేసినప్పటికీ పనులు నత్తనడకన సాగుతున్నాయి.
కేవలం 520 ఇండ్లకు మాత్రమే కరెంట్పోల్స్ ఏర్పాటు చేశారు. పోల్స్ నుంచి ప్యానల్ బోర్డులకు వైరింగ్ చేయాల్సి ఉంది. మరో 360 ఇండ్లకు డ్రైనేజీ, సీసీ రోడ్లు లేవు. దీంతోపాటు నీటి సరఫరా కోసం వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులు కూడా స్లోగానే సాగుతున్నాయి. పనులు పూర్తయ్యేందుకు 6 నెలలు పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
సౌలత్‌లు లేకుండా ఇండ్లలో ఎలా ఉండాలి
జగిత్యాల టౌన్, వెలుగు: బీఆర్ఎస్ సర్కార్ హయాంలో హడావుడిగా పట్టాలు అందజేసి డబుల్ బెడ్రూం ఇండ్లకు మౌలిక వసతులు కల్పించలేదని లబ్ధిదారులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు. పలువురు లబ్ధిదారులు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు పట్టాలు అందజేసిన ఇండ్లలో సీసీ రోడ్డు, డ్రైనేజీలు ఏర్పాటు చేయలేదని, కనీసం తాగునీరు, కరెంట్ కూడా లేక చీకట్లో ఉండాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. కరెంట్ సప్లై లేకపోవడంతో ఆఫీసర్లు ఇండ్లలోకి రానివ్వడం లేదని వాపోయారు. ఇప్పటికైనా మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు.
పనులు పూర్తయ్యాక అప్పగిస్తాం
డబుల్ బెడ్రూం ఇండ్లకు సంబంధించిన డెవల్మెంట్ వర్క్స్ ఆయా శాఖలకు అప్పగించాం. వర్క్స్ కంప్లీట్ కాగానే లబ్ధిదారులకు అప్పగిస్తాం.
డీఈ రాజేశ్వర్, జగిత్యాల