
సిద్దిపేట: మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఫామ్ హౌస్ దగ్గర డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల నిరసన చేపట్టారు. డబుల్ బెడ్ రూమ్ లకు తమను ఎంపిక చేసినా ఇప్పటివరకు ఇవ్వకపోవడంతో ఏప్రిల్ 12వ తేదీ శుక్రవారం ఉదయం కొంతమంది లబ్ధిదారులు కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గరకు చేరుకుని నిరసన తెలిపుతున్నారు. గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ ను మూడుసార్లు గెలిపించినా మా సమస్య తీర లేదని నిరసన వ్యక్తం చేస్తున్నారు.దీంతో ఫామ్ హౌస్ దగ్గర ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై మండిపడుతూ.. కేసీఆర్ ను కలిసే వరకు ఇక్కడి నుండి వెళ్లమంటూ లబ్ధిదారులు తేల్చి చెప్పారు.
10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వ.. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల స్కీమ్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. పేదల అందరికీ డబుల్ ఇండ్లు ఇస్తామని చెప్పిన కేసీఆర్.. పూర్తిస్థాయిలో ఈ స్కామ్ ను అమలు చేయలేకపోయారని విమర్శలు వచ్చాయి. చాలా ప్రాంతాల్లో ఇండ్లు పూర్తి అయినా.. పేదలకు ఇవ్వడంలో బీఆర్ఎస్ సర్కార్ విఫలమైందని ఆరోపణలు రావడంతో గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొంతమంది లబ్ధిదారులను ఎంపిక చేసి ఇండ్లు కేటాయించిది. అయితే, అంతలోనే ఎన్నికల కోడ్ రావడంతో ఇండ్ల పంపిణీ ఆగిపోయింది. దీంతో ఇండ్లు వచ్చినా.. అందులోకి వెళ్ళలేని పరిస్థతి నెలకొంది.