లక్కీ డ్రాలో పేరు వచ్చినా ..లక్కు దక్కలేదు

  •     డబుల్​బెడ్రూం ఇండ్లపై అయోమయం
  •     సర్కార్ మారడంతో సన్నగిల్లుతున్న లబ్ధిదారుల ఆశలు
  •     కొత్తగా అప్లికేషన్ పెట్టాలో లేదో తెలియక తికమక

ఆసిఫాబాద్/కాగజ్ నగర్, వెలుగు : లక్కీ డ్రాలో తమకు డబుల్​బెడ్రూం ఇల్లు దక్కిందని సంబురపడ్డ లబ్ధిదారుల ఆశలు అడియాశలుగా మారుతున్నాయి. అప్పటి బీఆర్ఎస్ సర్కారు ఆరు నెలల ముందు కాగజ్ నగర్ మున్సిపాలిటీలో 288 మంది లబ్ధిదారులకు ఇండ్ల కేటాయింపు కోసం లక్కీ డ్రా నిర్వహించింది. ఒక్కో వార్డుకు సగటున 9 నుంచి 10 మంది లబ్ధిదారులను ఎంపిక చేసే విధంగా రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ఆయా వార్డు కౌన్సిలర్లతో కలిసి డ్రా తీశారు.

అప్పట్లో దీనిపై విమర్శలు వచ్చాయి. లబ్ధిదారులు పెద్దఎత్తున ఆందోళనలకు దిగారు. నిబంధనల ప్రకారమే లక్కీ డ్రా తీశామని అప్పట్లో జిల్లా అధికారులు, మున్సిపల్ ఆఫీసర్లు పేర్కొన్నారు. లక్కీ డ్రా తర్వాత ప్రభుత్వం, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు ఇండ్ల పంపిణీపై కనీసం దృష్టి పెట్టలేదు.

కథ మళ్లీ మొదటికి వచ్చినట్టేనా..?

కాగజ్ నగర్ మున్సిపాలిటీలోని 30 వార్డుల్లో రిజర్వేషన్ల ప్రాతిపదికన ఇండ్ల కేటాయింపు కోసం డ్రా తీసిన అధికారులు గ్రౌండింగ్ చేయడంలో శ్రద్ధపెట్టలేదు. లబ్ధిదారులను కేటగిరీల వారీగా విభజించి మరీ దరఖాస్తులు తీసుకున్న అధికారులు.. గతేడాది మార్చి రెండో వారంలో ఆగమేఘాల మీద ఒకే రోజులో లక్కీ డ్రా తీసి పేరు వచ్చిన 288 మందికి విషయం తెలియజేశారు. కానీ వారికి ఎటువంటి పత్రం ఇవ్వలేదు. ప్రభుత్వం చేపట్టిన ప్రక్రియ కాబట్టి లబ్ధిదారులు కూడా అధికారులను గట్టిగా అడగలేకపోయారు. తమ పేరు వచ్చిందని, ఎలాగైనా డబుల్ బెడ్రూం ఇల్లు దక్కుతుందని వారు గంపెడు ఆశలు పెట్టుకున్నారు.

కానీ వారి కోరిక నెరవేరలేదు. ఎన్నికలకు ముందు అప్పటి బీఆర్​ఎస్​ప్రభుత్వం ఇండ్లు పంపిణీ చేస్తుందని ఆశించినా అలా జరగలేదు. ఇప్పుడు సర్కారు మారడంతో ఆ ఇల్లు తమకు దక్కుతుందో, లేదోనని లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారు. కొత్త ప్రభుత్వం ప్రారంభించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఇంటి కోసం మళ్లీ దరఖాస్తులు చేయడమా లేదా అన్నది ఇప్పటికీ క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో నోటికాడికి వచ్చిన ముద్ద అందకుండా పోతోందా అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇల్లు దక్కిందని ఆశ పడ్డా.. ఇప్పుడేం తోచడంలేదు

నేను, నా కుటుంబం ఉండేందుకు సొంత ఇల్లు లేదు. కిరాయి ఇంట్లో ఉంటున్నం. డబుల్ బెడ్రూం ఇల్లు కోసం దరఖాస్తు చేస్తే లక్కీ డ్రాలో పేరు వచ్చింది. దీంతో ఎంతో సంతోషపడ్డం. కానీ 6 నెలలు గడిచినా ఇల్లు మాత్రం కేటాయించలేదు. ఎవరిని అడిగినా ఇస్తామని చెప్తున్నరే కానీ ఇవ్వడంలేదు. కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత లబ్ధిదారుల గురించి మాట్లాడే వాళ్లేలేరు. ప్రజాపాలన కార్యక్రమంలో అందరూ దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇందులో దరఖాస్తు చేస్తే మళ్లీ మా పేరు వస్తుందో రాదో తెలియని పరిస్థితి. మా లాంటి గరీబుల గురించి సర్కార్ ఆలోచించాలి.

ఓ లబ్ధిదారుడు