వనపర్తి, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని చెప్పినప్పటికీ, ఇప్పటికీ అర్హులందరికీ ఇండ్లు రాకపోవడంతో గ్రామాల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వం గృహలక్ష్మి కింద స్థలం ఉన్న నిరుపేదలకు ఇల్లు కట్టుకునేందుకు రూ.3లక్షలు ఇస్తామని ప్రకటించడంతో దరఖాస్తు చేసుకునేందుకు పోటీ పడుతున్నారు. నియోజకవర్గానికి 3 వేల మందిని ఈ పథకం కింద ఎంపిక చేయనున్నారు. వనపర్తి జిల్లాలో 6 వేల మందికి ఈ పథకం కింద ప్రయోజనం చేకూరనుండగా, 20 రోజుల్లోనే 20 వేల మంది అప్లై చేసుకున్నారు. గడువు లేకపోవడంతో మరిన్ని దరఖాస్తులు వస్తాయని అంటున్నారు. .
పేదలకు న్యాయం జరగలే..
వనపర్తి నియోజకవర్గంలో 2,907 ఇండ్లు మంజూరు కాగా, ఇటీవల మంత్రి నిరంజన్ రెడ్డి 543 ఇండ్లను పంపిణీ చేశారు. రెండో విడతలో మరో 300 ఇండ్లు పంపిణీ చేసే అవకాశం ఉంది. దీంతో డబుల్ ఇండ్ల కోసం ఎదురుచూస్తున్న పేదలు ఆశలు వదులుకున్నారు. ఇండ్లు రాని పేదలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా, సొంత జాగ ఉన్నవారు గృహలక్ష్మి కింద దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యేలు, అధికార పార్టీ లీడర్లు బుజ్జగిస్తున్నారు. అయితే 100 గజాల స్థలంలో ఇల్లు కట్టాలంటే కనీసం రూ.10 లక్షలు ఖర్చవుతుంది. ప్రభుత్వం ఇచ్చే రూ.3 లక్షలు పోను రూ.7 లక్షలు ఎక్కడి నుంచి తేవాలన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది.
ఇండ్ల కేటాయింపులో అవకతవకలు..
వనపర్తి , దేవరకద్ర, మక్తల్, కొల్లాపూర్ నియోజకవర్గాల పరిధిలో 700 మందికి డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించారు. 7 మండలాలు ఉన్న వనపర్తి నియోజకవర్గానికి 2,907 ఇండ్లు మంజూరు కాగా, అందులో 600 ఇండ్లనే ఇప్పటి వరకు పంపిణీ చేశారు. దేవరకద్ర నియోజకవర్గంలోని కొత్తకోట మండలంలో ఇప్పటి వరకు ఒక్క ఇల్లు కూడా పంపిణీకి నోచుకోలేదు. మదనాపురం మండలం తిరుమలాయపల్లెలో మాత్రం 46 ఇండ్ల ఇటీవల లబ్ధిదారులకు అందజేశారు. పామాపురంలో ఇండ్ల కేటాయింపు వివాదాస్పదమైంది. మక్తల్ నియోజకవర్గంలోని ఆత్మకూరు, అమరచింత, కొల్లాపూర్ నియోజకవర్గంలోని పాన్ గల్, వీపనగండ్ల, చిన్నంబావి మండలాల్లో ఇండ్ల నిర్మాణం పూర్తి కాలేదు. లబ్ధిదారుల ఎంపికలోనూ అవకతవకలు చోటు చేసుకున్నాయని అర్హులైన లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు.అసంతృప్తితో ఉన్న పేదలకు ఇంటి స్థలాలు ఇచ్చే విషయాన్ని మంత్రి నిరంజన్‌రెడ్డి పరిశీలిస్తున్నారు. పట్టణంలోని పీర్లగుట్టతో పాటు శ్రీనివాసపూర్ గ్రామ శివారులో ఇంటి స్థలాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
ఎన్నికల ముందు హడావుడి..
తొమ్మిదేండ్లుగా పేదలకు ఎక్కడా ఇంటి స్థలాలు ఇవ్వకపోవడం, డబుల్ ఇండ్లు పూర్తి చేయకపోవడంతో పేదలతో పాటు ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు తప్పు పడుతున్నాయి. అయితే ఎన్నికలు సమీపిస్తుండడంతో అధికార పార్టీ లీడర్లు హడావుడి చేస్తున్నారు. పట్టణాలు, మండలకేంద్రాల్లో ప్రభుత్వ స్థలాల్లో పేదలకు పట్టాలు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.