
మరిపెడ, వెలుగు : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం చింతలగడ్డ తండాకు చెందిన భూక్య సంజన అలియాస్ రాజేశ్ (26) అనే ట్రాన్స్ జండర్ మరిపెడ తహసీల్దార్ఆఫీస్ ముందు శనివారం పెట్రోల్ బాటిల్‌తో హల్‌చల్ చేశారు. సమాచారం అందుకున్న మరిపెడ సెకండ్ ఎస్సై మొగిలి అక్కడకు చేరుకోగానే సంజన పెట్రోల్ మీద చల్లుకున్నారు. ఎస్సై మొగిలి అగ్గిపెట్టె గుంజుకోవడంతో ప్రమాదం తప్పింది.
విషయం ఏంటని ఎస్సై ప్రశ్నిస్తే తనకు డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేయాలని, రేషన్ కార్డు ఇవ్వాలని, రూ. 10 లక్షల లోను ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తహసీల్దార్‌తో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని ఎస్సై హామీ ఇవ్వడంతో వెళ్లిపోయారు.