భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: జిల్లాలో డబుల్ బెడ్రూం ఇండ్ల స్కీం అమలుకు నోచుకోవడంలేదు. నిర్మాణాలు నత్తతో పోటీపడుతున్నాయా అన్న అనుమానం కలుగుతోంది. ఏండ్లు గడుస్తున్నా డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలు కొనసాగుతూ మొండిగోడలే కనిపిస్తున్నాయి. పలుచోట్ల డబుల్ బెడ్ రూం ఇండ్లకు లబ్ధిదారులను సెలెక్ట్ చేసినా వారికి అలాట్ చేయకపోవడంతో అవి శిథిలావస్థకు చేరుతున్నాయి.
శాంక్షన్ అయినా సగం కూడా కాలే...
జిల్లాకు కేటాయించిన డబుల్ బెడ్ రూం ఇండ్లలో సగం ఇంకా నిర్మాణంలోనే ఉన్నాయి. అవి ఎప్పుడు పూర్తి అవుతాయో ఆఫీసర్లే చెప్పలేకపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు ఐదేండ్ల కింద 6443 డబుల్ బెడ్ రూం ఇండ్లను కేటాయించింది. వీటిలో 6168 ఇండ్లకు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్వచ్చింది. వాటిలో 2,973 ఇండ్లు మాత్రం ఇప్పటి వరకు కంప్లీట్అయ్యాయి. మరో 2311ఇండ్లు నిర్మాణ దశలోనే ఉన్నాయి. శాంక్షన్ అయినవాటిలో మరో 884 ఇండ్లకు నిర్మాణాలే ప్రారంభంకాలేదు. కంప్లీట్అయినవాటిలో 2,821 మందిని సెలెక్ట్ చేశారు. వీరిలో 2,245 మందికి డబుల్ బెడ్ రూం ఇండ్లను అప్పగించారు.
ఒక్కోచోట ఒక్కో తీరు...
చుంచుపల్లి మండలంలోని త్రీ ఇంక్లైన్లో నాలుగేండ్ల కింద నిర్మించిన 15 ఇండ్లను ఇప్పటికీ ఎవరికీ అలాట్ చేయలేదు. అర్హులకు ఇండ్లను అలాట్ చేయాలని గ్రీవెన్స్‌లో కలెక్టర్‌కు వినతిపత్రాలు ఇచ్చి ఆఫీసర్లను కోరుతున్నా ఫలితం లేకుండా పోతోంది.
జిల్లా కేంద్రంలో ఆరేండ్ల కింద 887 డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలు చేపట్టిన ఆఫీసర్లు ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్కటీ పూర్తి చేయలేదు. కానీ ఇండ్లు కట్టకుండానే ఎమ్మెల్యే వనమా లబ్ధిదారులను సెలెక్ట్ చేసి, ఇండ్లను కేటాయించారు.
దుమ్ముగూడెం మండలంలోని గౌరారంలో దాదాపు 90 శాతం ఇండ్ల నిర్మాణాలు పూర్తి అయినా మిగిలిన పనులు పూర్తి చేయించడంలో ఆఫీసర్లు నిర్లక్ష్యం చేస్తున్నారు. రామవరం ప్రాంతంలోని 2 ఇంక్లైన్లో ఇండ్ల నిర్మాణాలు మొండి గోడలకే పరిమితమయ్యాయి.
కలెక్టర్ హెచ్చరించినా...
డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని పలుమార్లు జరిగిన మీటింగ్‌లలో ఇంజినీరింగ్ ఆఫీసర్లపై కలెక్టర్అనుదీప్ హెచ్చరించారు. కొత్తగూడెంలోని డబుల్‌బెడ్ రూం ఇండ్లు గతేడాది అక్టోబర్ లోనే పూర్తి చేయాలని ఎమ్మెల్యేతోపాటు కలెక్టర్ ఇంజినీరింగ్ ఆఫీసర్లను, కాంట్రాక్టర్‌ను ఆదేశించినా ఫలితం లేకుండాపోయింది. కాగా మరోవైపు డబ్బులివ్వకుండా ఇండ్లను ఎలా నిర్మించాలని కాంట్రాక్టర్లు పేర్కొంటున్నారు. గతంలో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసిన రేట్లకు ప్రస్తుత రేట్లకు పొంతన లేదని, ధరలు రెట్టింపు అయ్యాయని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. పాత రేట్లతోనే పనులు చేయాలనడం దారుణమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అలాట్ చేయాలని తిరుగుతున్నం..
కట్టిన ఇండ్లను అర్హులకు ఇవ్వాలని రెండేండ్లుగా ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నం. వారిలో మార్పు లేదు. నిర్మించిన ఇండ్లలో ఎవరూ లేక అవి శిథిలావస్థకు చేరుతున్నాయి. డబుల్ బెడ్ రూం ఇండ్లను అలాట్చేయాలని గ్రీవెన్స్ లోనూ కలెక్టర్‌కు విన్నవించాం.
- హరిలాల్, త్రీ ఇంక్లైన్జీపీ, చుంచుపల్లి మండలం
పూర్తి కాకుండానే అలాట్చేసిన్రు..
కొత్తగూడెంలో ఇండ్ల నిర్మాణాలు పూర్తి కాలేదు. అయినా ఎమ్మెల్యే వనమా, ఆఫీసర్లు ఇండ్లను లబ్దిదారులకు అలాట్చేసిన్రు. వారి ఇచ్చిన ఇల్లు ఎక్కడుందో వారికే తెలియని దుస్థితి. అసంపూర్తి నిర్మాణాల స్థాయిలోనే ఉంచిన్రు. ఆఫీసర్లు మాత్రం చేతులు దులుపుకున్నరు. ఇండ్ల నిర్మాణమే పూర్తి కాకుండా అలాట్ చేయడంలో మతలబు ఏంటో ఆఫీసర్లకే తెలియాలి.
–యెర్రా కామేష్, బీఎస్పీ స్టేట్జనరల్ సెక్రెటరీ