ఖానాపూర్, వెలుగు : ఖానాపూర్ పట్టణ శివారు కుమ్రం భీం చౌరస్తా వద్ద ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్లలోని బి2 బ్లాక్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ఇంటిలో బుధవారం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. బాధితుడు సయ్యద్ అఫ్సర్ తెలిపిన వివరాల ప్రకారం.. తమ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ జరిగి ఒక్కసారిగా మంటలు చెలరేగాయని.. దీంతో భార్య, కూతురిని తీసుకొని బయటకు పరుగులు ప్రాణాలు కాపాడుకున్నామని పేర్కొన్నాడు.
అగ్ని ప్రమాదంతో ఆ ఇంట్లోని అన్ని వస్తువులు కాలిపోయాయని, దాదాపు రూ.2 లక్షల మేర నష్టం జరిగిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అందించిన డబుల్బెడ్రూం ఇంట్లో షార్ట్సర్క్యూట్విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ రాజేందర్, కమిషనర్ శ్రీనివాస్, కౌన్సిలర్లు షబ్బీర్ పాషా, పరిమి సురేశ్ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందజేశారు.
నాసిరకం పరికరాల వల్లే ప్రమాదం
నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా బీఆర్ఎస్సర్కారు డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ప్రజలకు అంటగట్టిందని కాంగ్రెస్ మండల, పట్టణ అధ్యక్షులు దయానంద్, నిమ్మల రమేశ్ ఆరోపించారు. మీడియాతో మాట్లాడుతూ నాసిరకం విద్యుత్ పరికరాలు వాడడం వల్లనే ప్రమాదం జరిగిందన్నారు. అధికారులు, స్థానిక బీఆర్ఎస్ నేతలు కమీషన్ల కోసం కక్కుర్తి పడి నాణ్యతలేని ఇండ్లు కట్టారని మండిపడ్డారు. నాయకులు యూసుఫ్ ఖాన్, షబ్బీర్ పాషా, సలీం ఖాన్, నారాయణ, అసిఫ్ అలీ, షౌకత్ తదితరులు ఉన్నారు.