గద్వాలలో ‘డబుల్’ ఇండ్ల లొల్లి

గద్వాల, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో డబుల్ బెడ్రూమ్  ఇండ్ల లొల్లి రాజుకుంది. శనివారం గద్వాల పట్టణంలోని పలు వార్డుల్లో డబుల్  ఇండ్ల అర్హులు, అనర్హుల లిస్టులను డిస్ ప్లే చేయడంతో లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. కుంట వీధి, గంటగేరి, తెలుగుపేట, సోమనాద్రి నగర్  వార్డుల్లో ఆఫీసర్లు వేసుకున్న టెంట్లను కూల్చేశారు. టేబుళ్లు, కుర్చీలను విసిరేశారు. తమకు ఇండ్లు ఎందుకు రాలేదని ఆఫీసర్లతో వాగ్వాదానికి దిగారు. తమ కాలనీలో ఉండొద్దంటూ అక్కడి నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేశారు. తెలుగుపేటలో ఆఫీసర్లను కాలనీ నుంచి పంపించేశారు. గోడలకు అతికించిన డబుల్   బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారుల లిస్టులను చించేశారు. ఎన్నో ఏండ్ల నుంచి ఇండ్లు వస్తాయని ఆశతో ఎదురు చూస్తున్నామని, ఇప్పుడు లిస్టులో పేరు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని అర్హతలు ఉన్నా తమకు ఇండ్లు రాలేదని, రెండు, మూడు ఇండ్లు, భూములు, కార్లు ఉన్న వారి పేర్లు లిస్టులో రావడమేమిటని ప్రశ్నించారు. గతంలో ఇచ్చిన ఇంటి స్థలాలను లాక్కున్నారని, ఇప్పుడేమో డబుల్  బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వడం లేదని నిలదీశారు. ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి సాయం తీసుకోలేదని, గూడు లేక కిరాయి ఇండ్లలో ఉంటున్న తమపై కనికరం చూపించడం లేదంటూ మండిపడ్డారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

8 ఏండ్ల తరువాత.. 

జోగులాంబ గద్వాల జిల్లాతో పాటు నియోజకవర్గంలో మొదటిసారి డబుల్  బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ చేపట్టారు. గద్వాల పట్టణంలోని 33 వార్డులకు సంబంధించి దరఖాస్తులను స్వీకరించగా, 4200 పైగా అప్లికేషన్లు వచ్చాయి. ఫీల్డ్  వెరిఫికేషన్  చేసి పెద్ద సంఖ్యలో అప్లికేషన్లను తిరస్కరించారు. 2000 మంది వరకు అర్హులు ఉన్నట్లు గుర్తించారు. 560 ఇండ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలో ఎలిజబుల్, నాన్ ఎలిజబుల్ లిస్టులపై అభ్యంతరాలు తీసుకొనేందుకు ప్రతీ వార్డుకి ఒక జిల్లా ఆఫీసర్ ను నియమించి శనివారం వార్డు సభలను నిర్వహించారు. ఈ సభలన్నీ గందరగోళంగా మారాయి. అర్హుల పేర్లు లేకపోవడం, అనర్హుల పేర్లు ఉండడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. 

పట్టాదారులకు న్యాయం చేయాలి

పేదల పట్టాలు గుంజుకొని నర్సింగ్ కాలేజీ, డబుల్ బెడ్రూమ్  ఇండ్లు కట్టారని బీజేపీ నాయకులు అడిషనల్​ కలెక్టర్​ అపూర్వ్​ చౌహాన్​కు వినతిపత్రం అందజేశారు. పట్టాదారులు కోర్టుకెళ్లారని వారికి ఎలాంటి షరతులు లేకుండా ఇండ్లు కేటాయించాలని డిమాండ్  చేశారు. డబుల్  ఇండ్లు ఇవ్వాలని కోర్టు ఆదేశాలు ఇచ్చిందని గుర్తు చేశారు. అసెంబ్లీ కన్వీనర్ రామాంజనేయులు, లీడర్లు కుమ్మరి శీను, త్యాగరాజు, పులిపాటి వెంకటేశ్, డీటీడీసీ నరసింహ, రజక జయశ్రీ, గుర్రం నరసింహులు ఉన్నారు.

అభ్యంతరాలు ఉంటే చెప్పండి..

ప్రస్తుతం ప్రకటించిన లిస్ట్​ ఫైనల్ కాదని, ఈ లిస్టుపై అభ్యంతరాలు ఉంటే చెప్పాలని తహసీల్దార్​ వెంకటేశ్వర్లు, కమిషనర్​ నరసింహ లబ్ధిదారులకు సూచించినా వినలేదు. అర్హతలు ఉన్నా నాన్ ఎలిజబుల్  కింద పేరు వస్తే రీ ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. అర్హులు కాని వారి పేర్లు ఎలిజబుల్  కింద వస్తే తొలగిస్తామని వారు పేర్కొన్నారు.