రాష్ట్రంలో పలు చోట్ల నిర్మించిన డబుల్బెడ్రూం ఇళ్ల పనుల్లో డొల్లతనం ఒక్కొక్కటిగా బయటకి వస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం ఆలేరు నియోజకవర్గం ఎమ్మెల్యే గొంగిడి సునీత స్వగ్రామమైన వంగపల్లిలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు లోతట్టు ప్రాంతాల్లో నిర్మించారు.
ఇంకేముంది ఏడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఊళ్లోని వరద మొత్తం ఇళ్ల చుట్టూ చేరింది. ఎంతలా అంటే నిలబడితే మన పీకల్లోతు నీళ్లు ఇళ్ల చుట్టూ నిలబడ్డాయి. దీనికి తోడు విష సర్పాలు, కీటకాలు నిత్యం ఇళ్లల్లోకి వస్తుండటంతో స్థానికుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు.
నిత్యవసరాలు తెచ్చుకోవడానికి కూడా ఇబ్బందికరంగా మారింది. గ్రామానికి చెందిన కొందరు యువకులు చుట్టూ ఉన్న నీళ్లలో ఈత కొడుతూ నిరసనలు తెలిపారు. చెరువు ఉన్న ప్రాంతంలో డబల్బెడ్రూంలు నిర్మించి డబ్బులు వృథా చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీత పనితనం కట్టిన ప్రదేశం ఇళ్ల నాణ్యతలో కనిపిస్తోందని వారు విమర్శిస్తున్నారు. ఇళ్లు ముంపునకు గురి కాకుండా కాపాడాలని వేడుకుంటున్నారు.