ఓపెనింగ్​కు ముందే కూలుతున్నయ్ .. అధ్వాన్నంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పరిస్థితి

ఓపెనింగ్​కు ముందే కూలుతున్నయ్ .. అధ్వాన్నంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పరిస్థితి
  • గత సర్కార్ నిర్లక్ష్యంతో ఒక్కటీ పేదలకు అందలే
  • లక్కీ డిప్పు వరించినా ఇండ్లు ఇయ్యలే
  • ఇప్పటికీ కాళ్లరిగేలా తిరుగుతున్న లబ్ధిదారులు

గద్వాల, వెలుగు: గత సర్కార్ నిర్లక్ష్యం కారణంగా జోగులాంబ గద్వాల జిల్లాలో ఒక్కటంటే ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా పేదలకు అందలేదు. గృహప్రవేశాలు చేయకముందే కూలిపోయే స్థితిలో ఉన్నాయి. ఇప్పటికే గద్వాల మండలం గోన్పాడు విలేజ్ లో  కట్టిన 25 ఇండ్లు అధ్వాన్నంగా తయారై అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారాయి. చుట్టూ కంప చెట్లు, విరిగిన డోర్లు, పగిలిన కిటికీల అద్దాలు, అస్తవ్యస్తంగా డ్రైనేజీ వ్యవస్థ.. ఇలా ఎటుచూసినా నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కానస్తోంది. ఇండ్లపై ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంకులను దుండగులు ఎత్తుకెళ్లారు. ప్లంబింగ్, కరెంట్ వైరింగ్ అంతా కరాబ్ అయింది. ప్రస్తుతం వీటిని నిరుపేదలకు ఇచ్చిన అక్కడ ఉండలేని పరిస్థితి నెలకొంది.

అదృష్టం వరించినా.. 

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకొని కొన్నేళ్లుగా ఎదురు చూసిన నిరుపేదలకు చివరికి అడియాశలే మిగిలాయి. దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని చందంగా లబ్ధిదారుల పరిస్థితి తయారైంది. 2019 ఎన్నికలప్పుడు అప్పటి సీఎం కేసీఆర్ గద్వాల నియోజకవర్గానికి 2,500 ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు దరఖాస్తులు స్వీకరించి, 4 వేలకు పైగా అర్హులు ఉన్నారని తేల్చారు. కానీ, పలువురు పేదలకు చెందిన పట్టాలను తీసుకొని కేవలం 1,275 ఇండ్లు మాత్రమే కట్టారు. వీరంతా కోర్టుకు వెళ్లడంతో 505 ఇండ్లు పక్కకి తీసి, మిగతా వాటిని గత ఎన్నికలకు ముందు గద్వాల మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో ఆఫీసర్లు డిప్పు చేశారు. అయినా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించలేదు. 

ఎన్నికల కోడ్ దగ్గర పడుతుందని అసెంబ్లీ ఎన్నికల ముందు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హడావిడిగా ఇండ్లను ఓపెన్ చేశారు. డిప్పు తగిలిన వారికి ఏ ఇల్లు కేటాయించారో తెలియకపోవడంతో లబ్ధిదారులు ఆఫీసర్ల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పటికీ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ లీడర్ల ఇండ్ల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. డిప్పు తీసిన వెంటనే ఇళ్లు కేటాయించి ఉంటే తమకు ఈ తిప్పలు తప్పేవని వాపోతున్నారు.

కోడ్ ముగిశాక పరిశీలన

లక్కీ డిప్పులో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వచ్చిన లబ్ధిదారులకు సంబంధించి ఎన్నికల కోడ్ ముగిశాక ఏం చేయాలనే దానిపై ఆలోచన చేస్తాం. అప్పటివరకు లబ్ధిదారులు ఆగాల్సిందే. 

రామ్ చందర్ ఆర్డీఓ గద్వాల