సూర్యాపేట వెలుగు: అసలే అరకొర డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం, వాటిని లబ్ధిదారులకు ఇవ్వడంలో ప్రభుత్వం చేస్తున్న జాప్యంతో అవి పనికి రాకుండా పోతున్నాయి. ఎన్నో రోజుల నుంచి పంపిణీకి సిద్దంగా ఉండగా ఇప్పుడు పగిలిన అద్దాలు, విరిగిన తలుపులు, దొంగలించిన ట్యాంకులతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిస్థితి దారుణంగా తయారైంది. వాటి పంపిణీ ఇప్పుడు ట్రబుల్ గా మారింది. చాలా రోజుల కిందట నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇప్పుడు పంపిణీ చేస్తే రిపేర్ల భారం ఎవరిపై పడుతుందో అన్న ఆందోళన ఇప్పుడు అటు లబ్ధిదారులకు, అధికారులకు పట్టుకోవడంతో అసలు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీ చేస్తారా లేదా అప్లికేషన్ల వరకే పరిమితం చేస్తారా అన్న సందేహాలు నెలకొన్నాయి.
5424 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు
సూర్యాపేట జిల్లాలో 5424 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు శాంక్షన్ కాగా వాటిలో 4264 పరిపాలన అనుమతులు లభించాయి. వీటిలో సూర్యాపేట నియోజకవర్గంలో 1900 ఇండ్లు శాంక్షన్ అవ్వగా1492 ఇండ్లు పూర్తి చేశారు. వీటిలో 375 ఇండ్లు లబ్ధిదారులకు అందించారు. మిగిలిన 1117 ఇండ్లు పూర్తి చేసి రెండేళ్లు గడుస్తున్నా లబ్ధిదారులకు అందించలేదు. కోదాడ నియోజకవర్గంలో 1400 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు కాగా వాటిలో 1214 కంప్లీట్ అవ్వగా 320 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు లబ్ధిదారులకు అందించారు. తుంగతుర్తి నియోజకవర్గంలో 724 ఇండ్లు శాంక్షన్ కాగా 448 టెండర్ ఫైనల్ చేశారు. వీటిలో 230 ఇండ్లు పూర్తి చేయగా ఒక్కటి పంపిణీ చేయలేదు. ఇక హుజూర్ నగర్ నియోజకవర్గంలో 1400 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు 175 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు టెండర్ ఫైనల్ చేయగా వీటిలో 150 ఇండ్ల నిర్మాణం పూర్తి చేశారు. ఈ నియోజకవర్గంలో ఒక్కరికీ కూడా పంపిణీ చేయలేదు.
కేటాయింపుకు సిద్ధంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు
ఇటీవల జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో డబు ల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసి ఏండ్లు గడుస్తున్న లబ్దిదారులకు పంపిణీ చేయలేదు. ఇండ్లలో తలుపులు, కిటికీలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఫ్లోరింగ్ చెడిపోవడంతో పాటు కిటికీల ఊచలను దొంగలు ఎత్తుకెళ్లారు. సూర్యాపేటలోని కేసారం వద్ద నిర్మించిన 384 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పూర్తి చేసి రెండేళ్లు గడుస్తున్న పట్టించుకోకపోవడంతో ఆ ప్రాంతమంతా పిచ్చి మొక్కలు పెరిగి అస్తవ్యస్తంగా మారింది. కొన్ని ఇండ్లు పూర్తి చేసి పంపిణీ చేయకపోవడంతో కొందరు డబుల్ బెడ్ ఇండ్ల తాళాలు పగలగొట్టి అందులో రోజుల తరబడి ఉంటుండడంతో వారికి అధికారులు నచ్చజెప్పి పంపించేస్తున్నారు. మరో పక్క విరిగిన తలుపులను వదిలి వేయడంతో గదులను మందుబాబులు అడ్డాగా మార్చుకున్నారు. త్వర లో లబ్ధిదారులకు పంపిణీ చేయనున్న నేపథ్యంలో అస్తవ్యస్తంగా ఉన్న ఇళ్లకు రిపేర్లు చేసి ఇస్తారో లేదో తెలియని పరిస్థితి. ప్రస్తుతం నిర్మాణాలు పూర్తయిన ఇళ్ల వద్ద అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, పైప్ లైన్, కరెంట్ సరఫరా పనులు బ్యాలెన్స్ ఉన్నా యి. అయితే ఇళ్లను నిర్మించిన కాంట్రాక్టర్లకే రిపేర్ల పనులు అప్పగించేందుకు ప్రయత్నాలు చేస్తుండగా చేసేందుకు కాంట్రాక్టర్లు ససేమిరా అంటున్నారు. ఎన్నికల టైమ్లో ప్రతిపక్షాలు విమర్శలు చేయకుండా అప్లికేషన్ల పేరుతో కాలయాపన చేస్తారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.