గ్రేటర్ పరిధిలోని నిర్మాణాలపై కలెక్టర్లు, అధికారులతో మంత్రి కేటీఆర్ రివ్యూ మీటింగ్
హైదరాబాద్ ,వెలుగు: గ్రేటర్ లో డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల నిర్మాణం కొనసాగుతోందని, డిసెంబర్ లో సుమారు 85 వేల మందికిపైగా లబ్ధిదారులకు అందజేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇండ్ల నిర్మాణ పథకంపై బుధవారం అధికారులతో మంత్రి రివ్యూ మీటింగ్ నిర్వహించి మాట్లాడారు. సుమారు రూ.9,700 కోట్లతో దేశంలో ఏ మెట్రో సిటీలోనూ లేనివిధంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం గ్రేటర్ లో చేపట్టామని చెప్పారు. చాలా ఏరియాల్లో నిర్మాణాలు పూర్తి కావస్తున్నాయని, తాగునీరు, విద్యుత్, మౌలిక వసతుల పనులను స్పీడప్ చేయాలని అధికారులను ఆదేశించారు. డబుల్ ఇండ్లను పేదలకు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు మంత్రికి తెలియజేశారు. మేయర్ బొంతు రామ్మెహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, హైదరాబాద్ ,రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లా కలెక్టర్లు, జీహెచ్‌ఎంసీ హౌసింగ్ వింగ్ అధికారులు, మున్సి పల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.