కరీంనగర్ సిటీ, వెలుగు: ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లు నిరుపయోగంగా, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయని సీపీఎం నగర కార్యదర్శి సత్యం అన్నారు. మంగళవారం నుంచి 5వ తేదీ వరకు సీపీఎం నగర కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా సమస్యల అధ్యయన యాత్ర స్థానిక కిసాన్ నగర్ వద్ద ప్రారంభమై విద్యారణ్యపురి, తీగలగుట్టపల్లి, చంద్రపురి కాలనీ, ఆర్టీసీకాలనీ మీదుగా సుభాష్ నగర్ చేరుకుంది. ఈ సందర్భంగా సత్యం మాట్లాడుతూ ఆర్టీసీ కాలనీ, ఆరేపల్లిలో నిర్మించిన 60 ఇండ్లు అర్హులకు ఇవ్వకపోడంతో మందు బాబులకు నిలయంగా మారాయన్నారు. అసంపూర్తి గా ఉన్న ఇండ్లను పూర్తి చేయకపోతే సీపీఎం ఆధ్వర్యంలో అర్హులను తీసుకెళ్లి ఆక్రమిస్తామని హెచ్చరించారు. కరీంనగర్ లో 12 ఏండ్ల నుంచి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పేరిట తవ్విన రోడ్లనే మళ్లీ తవ్వుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగర కమిటీ సభ్యులు మురళి, సాగర్, రవి, నాయకులు పాల్గొన్నారు.
స్వచ్ఛ జగిత్యాలగా తీర్చిదిద్దాలి
జగిత్యాల, వెలుగు : పట్టణాన్ని స్వచ్ఛ జగిత్యాలగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలని మున్సిపల్ చైర్ పర్సన్ బి.శ్రావణి అన్నారు. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 21వ వార్డులో తడి, పొడి చెత్త వేరు చేయడంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శ్రావణి గృహిణులకు తడి, పొడి చెత్త సేకరణ, తడి చెత్తతో ఎరువును తయారు చేసే విధానాన్ని వివరించారు. కార్యక్రమంలో కమిషనర్ గంగాధర్, కౌన్సిలర్ సాగర్, హరీశ్, మెప్మా ఏఓ శ్రీనివాస్ గౌడ్, సిబ్బంది పాల్గొన్నారు.
మద్యం మత్తులో కానిస్టేబుల్ పై దాడి
జగిత్యాల రూరల్, వెలుగు : పెట్రోలింగ్ చేస్తున్న పోలీస్ కానిస్టేబుల్ పై ఓ యువకుడు మంగళవారం రాత్రి దాడి చేశాడు. జగిత్యాల రూరల్ మండలం ధరూర్ గ్రామ శివారులో కొందరు బహిరంగంగా మద్యం తాగుతూ కనిపించడంతో పెట్రోలింగ్ చేస్తున్న జగిత్యాల రూరల్ పోలీసులు అక్కడికి వెళ్లారు. ఈక్రమంలో మద్యం మత్తులో ఉన్న ధరూర్ గ్రామానికి చెందిన మామిడి మహేశ్కానిస్టేబుల్భాస్కర్పై దాడి చేశారు. డ్యూటీలో తనపై దాడి చేసి గాయపరిచాడని భాస్కర్ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు జగిత్యాల రూరల్ ఎస్ఐ అనిల్ తెపారు.
ఎమ్మెల్యే ఆస్తులు జప్తు చేయాలి
గోదావరిఖని, వెలుగు: రామగుండం ఎరువుల ప్లాంట్‌లో ఉద్యోగాల పేరిట అమాయకులను మోసం చేశారని, ఆర్‌ఎఫ్‌సీఎల్ దళారులు మోహన్ గౌడ్, గుండు రాజుతో సహా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆస్తులు జఫ్తు చేసి బాధితులకు ఇవ్వాలని పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి నారాయణరావు డిమాండ్ చేశారు. మంగళవారం గోదావరిఖని ప్రెస్ క్లబ్‌లో వారు మాట్లాడారు. ఎమ్మెల్యే చందర్ ప్రమేయంతోనే దళారులు ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో ఉద్యోగాల కుంభకోణానికి పాల్పడ్డారన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షులు రాజగోపాల్, దళిత లిబరేషన్ ఫ్రంట్ నాయకులు సుదర్శన్, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
ఎన్‌క్వాస్ గుర్తింపునకు కృషి చేయాలి
రాజన్న సిరిసిల్ల, వెలుగు-: జిల్లాలోని సీహెచ్‌సీలకు ఎన్‌క్వాస్(నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్) గుర్తింపు వచ్చేలా కృషి చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. మంగళవారం సిరిసిల్ల సుందరయ్య నగర్ అర్బన్ ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఎన్‌క్వాస్ గుర్తింపు కోసం తీసుకోవాల్సిన చర్యలపై వైద్యాధికారులతో చర్చించారు. మొదటి విడతలో కొదురుపాక, కోనారావుపేట పీఎస్ నగర్ తంగళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సంబంధించి ఫీల్డ్ వర్క్, సివిల్ వర్క్, రికార్డ్ వర్క్ పూర్తి చేయాలన్నారు. బోయినపల్లి, విలాసాగర్, నేరెళ్ల చీర్లవంచ, అంబేద్కర్ నగర్ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సైతం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోగా ఎంక్వస్ గుర్తింపు దక్కేలా కృషి చేయాలన్నారు. పీహెచ్‌సీలకు గుర్తింపు దక్కితే సర్టిఫికెట్ తో పాటు ప్రభుత్వం నుంచి ఏటా రూ.3 లక్షలు మూడేళ్లపాటు ఆర్థిక సహకారం అందుతుందన్నారు. సమావేశంలో డీఎంహెచ్ఓ సుమన్ మోహన్ రావు తదితరులు ఉన్నారు.
‘బొగ్గు ఉత్పత్తిలో ఆర్జీ 1 మొదటి స్థానం’
గోదావరిఖని, వెలుగు : సింగరేణి సంస్థ పరిధి బొగ్గు ఉత్పత్తిలో రామగుండం 1వ డివిజన్ నంబర్ 1గా నిలిచిందని జనరల్ మేనేజర్ కె.నారాయణ తెలిపారు. మంగళవారం జీఎం ఆఫీస్‌లో జరిగిన మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. ఆరు నెలల్లో ఆర్జీ 1 ఏరియాకు 20.78 లక్షల టన్నుల టార్గెట్ నిర్ణయించగా, 23.32 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించి 112 శాతంతో సింగరేణిలోనే ముందంజలో ఉందన్నారు. బొగ్గు ఉత్పత్తిలో 5వ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ 130 శాతం, జీడీకే 11వ గని 101 శాతం బొగ్గు ఉత్పత్తి చేయడంతో ఆర్జీ 1 ఏరియాకు ఈ అవకాశం దక్కిందన్నారు. సమావేశంలో ఆఫీసర్లు రామ్మోహన్, లక్ష్మీనారాయణ, నవీన్, డాక్టర్ కిరణ్‌రాజ్ కుమార్, చంద్రశేఖర్ పాల్గొన్నారు.
11,400 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు
కరీంనగర్ సిటీ, వెలుగు: జిల్లాలో ఈ ఏడాది 11,400 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు లక్ష్యంగా నిర్దేశించినట్లు కలెక్టర్ కర్ణన్ అన్నారు. మంగళవారం చిగురు మామిడి మండలం కేంద్రంలోని ఆయిల్ పామ్ నర్సరీలో నిర్వహించిన శిక్షణలో కలెక్టర్ మాట్లాడారు. వ్యవసాయ విస్తరణ అధికారులు తమ క్లస్టర్లలో రైతులను గుర్తించి మొక్కలకు సంబంధించిన డీడీలను కట్టించాలని సూచించారు. ఆయిల్ పామ్ ఖర్చు చాలా తక్కువని, నాలుగేళ్ల తర్వాత ఆయిల్ పామ్ లో అంతర పంటలు పండించుకోవచ్చని తెలిపారు. ఇండోనేషియా, మలేషియా, దక్షణ అమెరికా దేశాలలో ఆయిల్ పామ్‌కు భారీ డిమాండ్ ఉందన్నారు. ఎంపిన చేసిన రైతులకు జనవరి నుంచి మొక్కలు పంపిణీ చేస్తామన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి, జడ్పీ సీఈఓ ప్రియాంక పాల్గొన్నారు.