కరెంటు లేదు.. నీళ్లు రావు డబుల్​ బెడ్రూం ఇండ్లలో కానరాని సౌకర్యాలు

కరెంటు లేదు.. నీళ్లు రావు డబుల్​ బెడ్రూం ఇండ్లలో కానరాని సౌకర్యాలు
  • వైరింగ్ ​చేయకుండా వదిలేసిన ఆఫీసర్లు 
  • పగులుతున్న గచ్చులు.. ఊడుతున్న పెచ్చులు
  • ఎన్నికల్లో లబ్ధి కోసం హడవిడిగా ఓపెన్​చేసిన గత బీఆర్​ఎస్​ పాలకులు
  • ఆ ఇండ్లలో ఉండలేమంటున్న లబ్ధిదారులు
  • సమస్యలు పరిష్కారించాలని ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామికి వేడుకోలు

కోల్​బెల్ట్, వెలుగు: డబుల్ ​బెడ్రూం ఇండ్ల కోసం ఏండ్లుగా ఎదురుచూసిన లబ్ధిదారులకు ఆ సంతోషం లేకుండా పోతోంది. కరెంటు, నీటి సౌలత్​లు లేవని.. కనీసం సౌకర్యాలు లేకుండానే ఆ ఇండ్లలో ఉండటం ఎలా అని వాపోతున్నారు. ఎన్నికల్లో లబ్ధిపొందాలని గత బీఆర్ఎస్​పాలకులు కనీస సౌలత్​లు కల్పించకుండానే ఇండ్లను ప్రారంభిస్తే.. సదుపాయాలు చక్కదిద్దకుండానే ఆఫీసర్లు వాటిని కేటాయించి చేతులు దులుపుకోవడంతో లబ్ధిదారులు నానా తిప్పలు పడుతున్నారు. 

పనులు పూర్తికాకున్నా హడావిడిగా ప్రారంభం

మందమర్రి పట్టణంలోని పాలచెట్టు ఏరియా సర్వే నంబర్​148లో రూ.29.68 కోట్లతో 560 డబుల్​బెడ్రూం ​ఇండ్ల నిర్మాణ పనులను 2019 ఫిబ్రవరిలో చేపట్టారు. జీ ప్లస్​2 విధానంలో 2022 ఫిబ్రవరి నాటికి పూర్తిచేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. అయితే కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, ఆర్​అండ్​బీ ఆఫీసర్ల అలసత్వం, అప్పటి ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో నిర్మాణ పనులు ఏండ్లపాటు సాగాయి. కానీ లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరగడంతో ఆఫీసర్లు మరోసారి సర్వే చేశారు. 

అయితే 560 ఇండ్లలో 400 మాత్రమే పూర్తియ్యి మరో 160 ఇండ్ల పనులు పూర్తికాలేదు. కానీ శాసనసభ ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రజల ఓట్లు కూడగట్టుకునేందుకు అప్పటి బీఆర్​ఎస్​పాలకులు మంత్రి కేటీఆర్​ చేతుల మీదుగా 2023 అక్టోబర్​1 ఆ ఇండ్లను హడావుడిగా ప్రారంభిం చారు. ఆ ఇండ్లలో ఉండేందుకు సౌలత్​లు లేనప్పటికీ ఆర్అండ్​బీ, రెవెన్యూ శాఖ ఆఫీసర్లు ఈ ఏడాది జనవరి 8న లక్కీడ్రా నిర్వహించి అర్హులైన 243 మందికి ఇండ్లు కేటాయించారు.   

అన్నీ సమస్యలే..

కేటాయించిన డబుల్​ బెడ్రూం ఇండ్లలో కనీస సదుపాయాలు లేకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ సౌకర్యం, ఫ్యాన్, బల్బులను ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ ఆఫీసర్లు పట్టించుకోలేదు.  కరంట్ సప్లై కోసం ట్రాన్స్​ఫార్మర్లు, స్తంభాలు, లైన్లు ఏర్పాటుచేసినప్పటికీ ఇండ్లకు మీటర్లు లేకపోవడంతో పవర్ కనెక్షన్లు ఇవ్వలేదు. సుమారు 70 శాతం ఇండ్లలో వైరింగ్​ చేయలేదు. కేవలం స్విచ్ ​బాక్సులు బిగించి చేతులు దులుపుకున్నారు. 

 10,11, 12 బ్లాక్​కు సంబంధించిన గోడలు, బాల్కనీలను ఆనుకొని కరెంట్​ స్తంభాలు,​ లైన్లు ఉండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని వారు భయపడుతున్నారు. పలు ఇండ్ల పునాదులు కుంగిపోగా, పలు చోట్ల భారీ పగుళ్లు తేలాయి. పలు గదుల్లో ఫ్లోరింగ్​ఊడిపోగా ఇంటి పైభాగం స్లాబ్ పెచ్చులూడాయి. కిటికీల అద్దాలు పగిపోయాయి. ఇంటర్నల్​రోడ్లు, డ్రైనేజీలు నిర్మించలేదు. భగీరథ నీటి కోసం పైపులైన్ వేసి ఇంటర్నల్ ​పైపులు బిగించలేదు.

డబుల్​ బెడ్రూం ఇండ్లలో కానరాని సౌకర్యాలు

సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే వివేక్ ​వెంకటస్వామికి వినతి

మందమర్రిలో డబుల్​ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి గతనెల 30న ఆ ఇండ్లను పరిశీలించారు. ఇండ్లలో కరెంటు, వాటర్​ సప్లై తదితర సదుపాయాలు కల్పించలేదని, నాసిరకంగా నిర్మించడంతో పలు ఇండ్లు కూలిపోతున్నాయని, లబ్ధిదారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. కొన్ని బ్లాక్​ల బాల్కనీలను ఆనుకొని విద్యుత్తు వైర్లు ఉండడం, ఇతర సమస్యలను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు. కరెంట్, వాటర్ ​సప్లై చేసేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆర్​అండ్​బీ డీఈ రమేశ్, మున్సిపల్​ కమిషనర్ ​రాజలింగును ఎమ్మెల్యే వివేక్ ఆదేశించారు.