
- భూపాలపల్లిలో గత నెల 23న డబుల్ ఇండ్లను ఓపెన్ చేసిన కేటీఆర్
- మొదటి విడతలో 350 మందితో లిస్ట్ రెడీ చేసిన ఆఫీసర్లు
- రీ ఎంక్వైరీ చేయాలని ఆదేశించిన కలెక్టర్
- 544 ఇండ్ల కోసం 3,088 మంది ఎదురుచూపులు
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు :మంత్రి కేటీఆరే స్వయంగా వచ్చి ఇండ్లను ప్రారంభించారు.. ఇక మాకు డబుల్ ఇండ్లు రావడం గ్యారంటీ అని ఆశ పడుతున్న లబ్ధిదారులకు ఎదురుచూపులే మిగులుతున్నాయి. మొదటి విడతలో పూర్తైన ఇండ్లకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ఇప్పటికే పూర్తైంది. కానీ మరోసారి సర్వే చేయాలని కలెక్టర్ ఆదేశించడంతో ఇండ్ల పంపిణీకి బ్రేక్ పడింది.
544 ఇండ్లకు 3,088 మంది భూపాలపల్లి పట్టణంలో సుమారు 60 వేలకు పై గా జనాభా ఉన్నారు. 2016 – 17లో రూ.33 కో ట్లతో 544 డబుల్ ఇండ్లు నిర్మించేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా వేశాలపల్లి దగ్గర జీ ప్లస్ త్రీ పద్ధతిలో ఇండ్లు కట్టారు. 2019 నాటికే ఇంజినీరింగ్, సివిల్ వర్క్స్ కంప్లీట్ అయ్యాయి. ఆ తర్వాత అంతర్గత సీసీ రోడ్లు, వాటర్ పైప్‌లైన్లు, కరెంట్ పనుల పేరుతో ఇండ్లు పంపిణీ చేయకుండా ఆలస్యం చేశారు. ఆ తర్వాత మళ్లీ 2019 ఆగస్టులో రూ.22 కోట్లతో మరో 416 డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాలు స్టార్ట్ చేశారు. వీటి పనులు చివరి దశలోఉన్నాయి.
ఇండ్లను ప్రారంభించిన కేటీఆర్
మొదటి దశలో కట్టిన 544 ఇండ్ల కోసం 3,088 మంది అప్లై చేసుకున్నారు. పూర్తైన ఇండ్లను మూడేళ్లుగా పంపిణీ చేయకపోవడంతో అవి ఖాళీగానే ఉంటున్నాయి. దీంతో తమకు డబుల్ ఇండ్లు కేటాయించాలంటూ మహిళలు పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించారు. దీంతో స్పందించిన ఆఫీసర్లు ఇండ్లను ఓపెన్ చేసేందుకు చర్యలు చేపట్టారు. ఫిబ్రవరి 23న మంత్రి కేటీఆర్ స్వయంగా భూపాలపల్లికి వచ్చి డబుల్ బెడ్‌రూం ఇండ్లను ప్రారంభించారు. లబ్ధిదారులను గుర్తించి వెంటనే ఇండ్లు కేటాయించాలని ఆదేశించారు.
రీ ఎంక్వైరీకి కలెక్టర్ ఆదేశాలు
డబుల్ బెడ్‌రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం జిల్లా స్థాయి ఆఫీసర్లు మున్సిపాలిటీలోని అన్నీ వార్డుల్లో ఎంక్వైరీ చేశారు. ఇంటింటికీ తిరుగుతూ లబ్ధిదారుల వివరాలు సేకరించారు. జీపీఎస్ ఆధారంగా ఫొటోలు కూడా తీసి కలెక్టర్‌కు రిపోర్ట్ చేశారు. దీని ఆధారంగా 544 ఇండ్లకు మొదటి విడతలో 350 మంది లబ్ధిదారులను ఎంపిక చేసిన మున్సిపల్ ఆఫీసర్లు లిస్ట్‌ను కలెక్టర్‌కు పంపించారు. అయితే ఈ లిస్ట్‌పై కూడా మరోసారి ఎంక్వైరీ చేయాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. జిల్లా స్థాయి ఆఫీసర్లను 7 టీమ్‌లుగా విభజించి ఒక్కో టీమ్ 50 మంది లబ్దిదారుల పేర్లు, వివరాలను సర్వే చేయాలని సూచించారు.
అనర్హులే ఎక్కువ
మున్సిపల్ శాఖ ఆఫీసర్లు రెడీ చేసిన 350 మంది లబ్ధిదారుల్లో అనర్హుల పేర్లే ఎక్కువగా ఉన్నట్లు భూపాలపల్లిలో ప్రచారం జరుగుతోంది. కొందరు కౌన్సిలర్లు రూ.లక్ష చొప్పున వసూలు చేసి 70 మందికిపైగా అనర్హుల పేర్లను లిస్ట్‌లో చేర్చినట్లు తెలుస్తోంది. ఈ కారణంతోనే రీ ఎంక్వైరీకి ఆదేశించారని పలువురు అంటున్నారు.