ఏడున్నరేళ్లుగా ఎదురు చూపులే!

పెద్దపల్లి, వెలుగు: జిల్లాలో డబుల్ బెడ్​రూం ఇండ్ల నిర్మాణం ప్రారంభించి ఏడున్నరేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఒక్కరికి కూడా ఇల్లు పంపిణీ చేయలేదు. దీంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. పెద్దపల్లి జిల్లాకు మొత్తం 3,394 డబుల్ ఇండ్లు శాంక్షన్ అయితే.. ఇప్పటి వరకు కేవలం 562 ఇండ్ల నిర్మాణం మాత్రమే పూర్తయ్యింది. వాటిలో కూడా అధికారులు మౌలిక సదుపాయాలు కల్పించలేదు. ఎన్నికలు సమీపిస్తుండగా డబుల్ ఇండ్లకు అర్హులు దరఖాస్తు చేసుకోవాలని ఇటీవల ప్రభుత్వం చెప్పడంతో వేల సంఖ్యలో లబ్ధిదారుల అప్లై చేసుకున్నారు. దీంతో జిల్లావ్యాప్తంగా పాతవి, కొత్తవి కలిపి మొత్తం 23,726 అప్లికేషన్లు వచ్చాయి. పూర్తయిన ఇండ్లు వందల సంఖ్యలో ఉంటే వేల అప్లికేషన్లకు స్క్రూటినీ చేసేదెలా? అని అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

ఫస్ట్​టర్మ్ లోనివే పూర్తి కాలే..

బీఆర్ఎస్ ప్రభుత్వం మొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దపల్లి జిల్లాలో 3,394 డబుల్ ఇండ్ల నిర్మాణానికి అనుమతిచ్చింది. ఏడేళ్ల క్రితం నిర్మాణాలు ప్రారంభించగా ఇప్పటికి 562 ఇండ్లు మాత్రమే కట్టారు. కడుతున్నవి 1,369 కాగా పునాదులు కూడా తీయని ఇండ్లు 1,463. పెద్దపల్లి నియోజకవర్గానికి 1,454 ఇండ్లు కేటాయించగా కాల్వ శ్రీరాంపూర్​లో 170 ఇండ్లు పూర్తయ్యాయి. రామగుండానికి 1,260 ఇండ్లు కేటాయించగా, 300 ఇండ్లు, మంథని నియోజకవర్గానికి 650 కేటాయించగా 92 డబుల్​ఇండ్లు పూర్తయ్యాయి. పెద్దపల్లి, సుల్తానాబాద్, రామగుండం మండలాల్లో నిర్మాణాలు స్లోగా జరుగుతున్నాయి. 

నిర్మాణాలకు కాంట్రాక్టర్లు దూరం..

నిర్మాణ వ్యయం పెరగడం, జీఎస్టీతో చాలా ప్రాంతాల్లో డబుల్ ఇండ్లు కట్టడానికి కాంట్రాక్టర్లు ఆసక్తి చూపించడం లేదు. ఒక్కో ఇంటికి ప్రభుత్వం రూ.5.30 లక్షలు కేటాయించింది. ఇంటికి 6 శాతం చొప్పున జీఎస్టీ కట్టాలి. దీంతో ఒక ఇంటికి రూ.30 వేల చొప్పున జీఎస్టీ కిందికే పోతుంది. ఈ విధంగా 1000 ఇండ్లు కట్టాలంటే కాంట్రాక్టర్ జీఎస్టీ కింది రూ.3 కోట్లు చెల్లించాల్సి వస్తుంది. దీంతో కాంట్రాక్టర్లు​ ఇళ్ల నిర్మాణానికి ధైర్యం చేయడం లేదు. ఇటీవలి రాష్ట్ర బడ్జెట్​లో డబుల్ ఇండ్ల స్కీంకు భారీగా నిధుల కేటాయింపులు ఉంటాయని లబ్ధిదారులు ఆశ పెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. మరోవైపు ఇంటి జాగా ఉన్నోళ్లకు రూ.5 లక్షలు ఇస్తామని సీఎం కేసీఆర్ గతంలో చెప్పారు. కానీ 2023–24 బడ్జెట్​లో ఫైనాన్స్ మినిస్టర్ హరీశ్ రావు ఆ స్కీంకు మార్పులు చేసి రూ.5లక్షలు ఉన్నదాన్ని రూ.3 లక్షలు చేశారు. దీంతో డబుల్ బెడ్​రూం ఇండ్లపై ఆశ పెట్టుకున్న వారికి నిరాశే మిగిలింది.