
హనుమకొండ, వెలుగు: రాష్ట్రం ఏర్పడిన కొత్తలో వరంగల్ నగరానికి వచ్చిన సీఎం కేసీఆర్.. సిటీలో నాలుగు వేల డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఏడేండ్లు దాటినా ఇచ్చిన హామీ నెరవేర్చ లేదు. మూడేండ్ల కింద మంత్రి కేటీఆర్ కూడా డబుల్ బెడ్ రూం ఇండ్ల విషయంలో వరంగల్ జిల్లా లీడర్లు, ఆఫీసర్లకు డెడ్‌లైన్ పెట్టారు. 2020 దసరా నాటికి ఇండ్ల పనులు కంప్లీట్ చేయాలని ఆదేశించారు. కానీ డెడ్ లైన్ పెట్టి మూడో దసరా దాటినా ఇంతవరకు ఇండ్ల నిర్మాణం కంప్లీట్ కాకపోగా.. కట్టిన ఇండ్లు కూడా ఇవ్వకుండా లీడర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
ఇదీ సంగతి..
సీఎం కేసీఆర్ 2015 జనవరిలో వరంగల్ నగరానికి వచ్చి స్లమ్ ఏరియాల్లో కలియతిరిగారు. ఇక్కడి పరిస్థితులను చూసి వెంటనే 3,900 డబుల్ ఇండ్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత వరంగల్ తూర్పు, పశ్చిమతో పాటు వర్ధన్నపేట నియోజకవర్గానికి కలిపి మొత్తంగా 4 వేల ఇండ్లకు అడ్మినిస్ట్రేషన్ సాంక్షన్ ఇచ్చారు. ఈ మేరకు నగరంలోని వివిధ చోట్ల ఇండ్ల నిర్మాణ పనులు చేపట్టారు. కానీ కాంట్రాక్టర్లకు సకాలంలో నిధులు చెల్లించకపోవడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. పెరుగుతున్న సిమెంట్, ఐరన్, ట్రాన్స్ పోర్ట్ ధరలకు అనుగుణంగా ప్రభుత్వం బడ్జెట్ కేటాయించకపోవడంతో కాంట్రాక్టర్లు ముందుకు రాలేని పరిస్థితి నెలకొంది. మూడేండ్ల కింద మంత్రి కేటీఆర్ కుడా మాస్టర్ ప్లాన్ ఆమోదం సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన రివ్యూలో కూడా డబుల్ బెడ్ రూం ఇండ్లకు డెడ్ లైన్ పెట్టారు. 2020 దసరా నాటికే ఇండ్ల పనులన్నీ కంప్లీట్ చేయాలని ఆదేశించారు. అయినా పనులు సాగడం లేదు.
కట్టిన ఇండ్లు ఇస్తలేరు..
గ్రేటర్ వరంగల్ కు సాంక్షన్ అయిన నాలుగు వేల ఇండ్లలో ఇప్పటివరకు 1,600 మాత్రమే కంప్లీట్ అయ్యాయి. వరంగల్ ఎస్ఆర్ నగరంలో 208 ఇండ్ల నిర్మాణ పనులు రెండున్నరేండ్ల కిందటే పూర్తికాగా.. వాటిని కేటాయించడంలో లీడర్లు, ఆఫీసర్లు జాప్యం చేశారు. దీంతో కొంతమంది లబ్ధిదారులు వాటిని స్వాధీనం చేసుకోగా.. ఏడాది కిందట వారికి అలాట్మెంట్ పేపర్లు అందజేశారు. ఇవి కాకుండా హనుమకొండ బాలసముద్రం అంబేద్కర్ నగర్లో నిరుపేదల గుడిసెలు ఖాళీ చేయించి కట్టిన 592 ఇండ్లు పూర్తయి మూడేండ్లవుతోంది. ఇప్పటికీ వాటిని సదరు లబ్ధిదారులకు కేటాయించకపోవడంతో వారంతా ఆ పక్కనే గుడిసెల్లో బతుకు ఈడిస్తున్నారు. ఇండ్లు కేటాయించాలని పలుమార్లు ఆందోళనకు కూడా దిగారు. ఫలితంగా ఈ ఏడాది ఏప్రిల్ లో వరంగల్‌కు వచ్చిన మంత్రి కేటీఆర్.. అందులో ఆరుగురు లబ్ధిదారులకు మాత్రమే అలాట్మెంట్ పేపర్లు అందించారు. కానీ ఇంతవరకు వారిని ఆయా ఇండ్లలో కాలు కూడా పెట్టనివ్వలేదు. ఇకపోతే శాయంపేట 520, దూపకుంటలో మరో 300 ఇండ్ల పనులు కూడా వందశాతం పూర్తయ్యాయి. అవి కూడా పంపిణీకి నోచుకోకపోవడంతో నిరుపేదలు ఇండ్ల కోసం పడిగాపులు కాస్తున్నారు.
ఇండ్ల మీద తలో ముచ్చట..
డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీ విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు తలో ముచ్చట చెబుతూ కాలం గడిపేస్తున్నారు. 2020 దసరా నాటికే పనులు, పంపిణీ కంప్లీట్ కావాలని మంత్రి కేటీఆర్ హామీ ఇవ్వగా.. ఇంతవరకు అతీగతీ లేదు. ఇదిలా ఉంటే గ్రేటర్ వరంగల్ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న సమయంలో 2020 డిసెంబర్ 13న మంత్రి దయాకర్‌రావు ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. 2021 ఫిబ్రవరిలోగా పనులు కంప్లీట్ చేసి, ఓపెనింగ్‌కు సిద్ధం చేయాలని ఆదేశించారు. కానీ గ్రేటర్ వరంగల్ లో తమ పార్టీ గెలిచిన తరువాత ఇండ్ల విషయాన్ని ప్రస్తావించిన దాఖలాలు లేవు. ఇక లోకల్ ఎమ్మెల్యేలు కూడా అడపాదడపా హామీలు ఇస్తూనే ఉన్నా ఇంతవరకు నిరుపేదలకు సొంతింటి కల నెరవేరడం లేదు. ఇకనైనా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీల మేరకు లోకల్ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు డబుల్ ఇండ్ల నిర్మాణం స్పీడప్ చేయడంతో పాటు కట్టిన ఇండ్ల పంపిణీపై దృష్టి పెట్టాలని ఓరుగల్లు ప్రజలు కోరుతున్నారు.