డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించలేదని వ్యక్తి ఆత్మహత్యాయత్నం

డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించలేదని ఒ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని ఇల్చీపూర్ గ్రామానికి చెందిన కొంపల్లి సంతోష్ డబుల్ బెడ్ రూమ్ పథకంలో ఇల్లు కేటాయించలేదని నిరసనగా గ్రామంలో వాటర్ ట్యాంకు ఎక్కి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

సుమారు గంటన్నర పాటు వాటర్ ట్యాంక్ పై అతడు హల్ చల్ చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. ఆ వ్యక్తిని సముదాయించి కిందికి దించారు. మార్చి 13వ తేదీ వరకు దరఖాస్తులో పేరు ఉండి 14న పేరు తొలగించినందుకు నిరసనగా ఆత్మహత్యకు పాల్పడినట్టు భాధితుడు పేర్కొన్నాడు. 

మరోవైపు కామారెడ్డి జిల్లా కేంద్రంలో అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ లబ్ధిదారుల ఆందోళన దిగారు. దీంతో అధికారులకు, లబ్ధిదారులకు మధ్య వాగ్వాదం జరిగింది. పలు చోట్ల ఇళ్ల కేటాయింపులో గందరగోళం నెలకొనడంతో.. జిల్లా కేంద్రంలో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ అన్యోన్య.