రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నిర్మించి ఇస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. పేదల దగ్గరి నుంచి దళారులు, అధికార పార్టీ నేతలు డబుల్ ఇండ్ల ఆశ చూపి డబ్బులు దండుకుంటున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో వెలుగులోకి వచ్చింది. 21వ వార్డు చెందిన బీఆర్ఎస్ కౌన్సిలర్ భర్త మాదా శ్రీరాములు డబుల్ బెడ్రూం ఇంటి కోసం డబ్బులు డిమాండ్ చేశాడని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారని ఠాకూర్ వాణి అనే మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. తాను చాలా పేదరాలినని, ఇంట్లో ఉన్న వస్తువులను, బంగారాన్ని తాకట్టుపెట్టి రూ. లక్ష అప్పు తెచ్చానని చెప్పింది. అయితే తనకు డబుల్ బెడ్రూం ఇల్లు ఇవ్వకుండా అన్యాయం చేశారని విపించింది. తాను ఇప్పుడు ఏం చేయాలో పాలు పోవడం లేదని ఆందోళకు గరైంది. తమకు ఆత్మహత్య శరణ్యమని ఆవేదన వ్యక్తం చేసింది. అన్యాయం చేసిన ఎమ్మెల్యే, కౌన్సిలర్లు చర్యలు తీసుకొని..తనకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
రూ.లక్ష కడితే డబుల్ బెడ్రూం ఇల్లు ఇస్తానని వార్డ్ కౌన్సిలర్ భర్త తమకు హామీ ఇచ్చాడని బాధితురాలి కుమారుడు ఠాకూర్ తరుణ్ తెలిపాడు. తన అమ్మ ఇంట్లో వస్తువులను బంగారాన్ని తాకట్టు పెట్టి లక్ష రూపాయలు అప్పు తెచ్చిన తర్వాత డబుల్ బెడ్రూ ఇల్లు మాకు కేటాయించలేదని వాపోయాడు. బేరసారాల ఆడియో వైరల్ చేసినందుకు తమ పైకి మాదా శ్రీరాములు తన మనుషులను పంపి బెదిరింపులకు పాల్పడుతున్నాడని, ఇంటి మీదకి మనుషులను పంపుతూ మమ్మల్ని చంపుతామని బెదిరిస్తున్నారని తెలిపాడు. తమకు కౌన్సిలర్ భర్తతో ప్రాణహాని ఉందని.. రక్షణ కల్పించాలని కోరారు.కాగా, తమకు న్యాయం చేయకుంటే ఆత్మహత్యలు తప్పవని బస్తీ నిరుపేదలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.