- పంపిణీకి సిద్ధంగా ఉన్న 8, 340 ఇండ్లు
- 60 వేల మందికి పైగా అప్లై చేసుకున్న పేదలు
- బీఆర్ఎస్ లీడర్ల జోక్యం వల్లే ఎంపికలో ఆలస్యమంటూ విమర్శలు
- శిథిలావస్థకు చేరుతున్న ఇండ్లు
నిజామాబాద్,వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం పేదల ఆత్మగౌరవ చిహ్నంగా చెప్పుకుంటున్న డబుల్‌బెడ్ రూం ఇండ్ల పంపిణీ హౌసింగ్‌శాఖ మంత్రి ఇలాకాలో అభాసుపాలవుతోంది. కట్టుడు పూర్తయి ఇండ్లు సిద్ధంగా ఉన్నా లబ్ధిదారుల ఎంపిక చేయడంలో ఆలస్యం చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. సంక్రాంతికి ‘డబుల్’ ఇండ్లు తప్పక పంచుతామని ప్రకటించిన ప్రభుత్వం.. పండుగ పోయి పదిరోజులాయే.. ఇండ్లు రాకపాయే.. అని అప్లై చేసుకున్న నిరుపేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో మొత్తం 24,142 ‘డబుల్’ ఇండ్లు మంజూరు చేశారు. నిజామాబాద్ జిల్లాలో 11, 956, కామారెడ్డి లో 13,186 ‘డబుల్’ ఇండ్లు శాంక్షన్ అయ్యాయి. నిజామాబాద్జిల్లాలో ప్రస్తుతం 8,340 ఇండ్లు పూర్తయ్యాయి. మరో 2,400 ఇండ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. నిజామాబాద్ అర్బన్ పరిధి నాగారంలో 396 ఇండ్లు, న్యూ కలెక్టరేట్ పక్కన 1200 ఇండ్లు పూర్తయ్యాయి. నిర్మాణాలు పూర్తయినా ఇండ్ల పంపిణీ ఆలస్యమవుతోంది.
బీఆర్ఎస్ లీడర్లతోనే కాంట్రవర్సీ..
గతంలో స్థానిక బీఆర్ఎస్లీడర్లు తమ అనుచరులకు ‘డబుల్’ ఇండ్లు కేటాయించడంతో వివాదం తలెత్తింది. మంత్రి ప్రశాంత్ రెడ్డి సొంతూరు వేల్పూర్ లో , స్పీకర్ అసెంబ్లీ సెగ్మెంట్ కోటగిరి మండలంలో ఇండ్ల పంపిణీలో అర్హులకు అన్యాయం చేశారని ఆరోపణలు వచ్చాయి. పోతంగల్ గ్రామంలో నిర్మించిన ‘డబుల్’ ఇండ్లను 2022 మార్చి 4న స్పీకర్ శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. అర్హుల జాబితా తయారు చేసినా కొన్ని నెలల పాటు వారికి ఇండ్లు కేటాయించ లేదు. తర్వాత బీఆర్ఎస్ లీడర్లు తమ ఇష్టం ఉన్న వారికి డబుల్ ఇండ్లు కేటాయించారనే ఆరోపణలు ఉన్నాయి. కోటగిరి బస్వాపూర్ గ్రామంలో పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను రెండేళ్లుగా పంపిణీ చేయలేదు. ఆగ్రహించిన లబ్ధిదారులు రాత్రికి రాత్రే ఇండ్లను స్వాధీనం చేసుకుని గృహప్రవేశాలు చేయడం అప్పట్లో చర్చనీయాంశమైంది. కానీ ఆఫీసర్లు లేకుండా బీఆర్ఎస్ లీడర్లు ఇండ్లు పంపిణీ చేశారని వార్తలు వచ్చాయి.
పంపిణీలో డిలే..
ఉమ్మడి జిల్లాలో ‘డబుల్’ ఇండ్ల కోసం 80 వేల మంది వరకు దరఖాస్తు చేశారు. నిజామాబాద్ జిల్లాలో 60 వేల దరఖాస్తులు రాగా కామారెడ్డి జిల్లాలో 20 వేల మంది అప్లై చేసుకున్నారు. కానీ నిజామాబాద్ అర్బన్ పరిధిలో ఇప్పటివరకు ఒక్క ఇల్లు కూడా పంపిణీ చేయలేదు. 1,596 ఇండ్ల నిర్మాణం పూర్తయినా పంపిణీలో ఆలస్యం జరుగుతోంది. దరఖాస్తు దారులు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకుండా పోతోంది. ఇండ్లు శిథిలావస్థకు చేరుతుండడంతో కూలిపోయినంక పంచుతరా అంటూ లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇల్లు వస్తదో.. రాదో..
డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాం. వేలాది అప్లికేషన్లు వచ్చాయని ఆఫీసర్లు చెప్తున్నారు. నాకు ఇల్లు వస్తదో రాదో తెలుస్తలేదు. ఇండ్లు లేని వారికి మొదటి ప్రాధాన్యమివ్వాలి. కొందరు బీఆర్ఎస్లీడర్లను కలిస్తేనే ఇండ్లు వస్తయని చెప్తున్నరు. పేదోళ్లను గుర్తించి ఇండ్లు పంచాలి.–శోభ, నిజామాబాద్
వారంలో పంపిణీకి చర్యలు
8,340 ‘డబుల్’ ఇండ్ల నిర్మాణం పూర్తయింది. పూర్తయిన ఇండ్లను అర్హులకు పంచేందుకు ఏర్పాట్లు పూర్తి చేశాం. అప్లికేషన్ల వెరిఫికేషన్పూర్తి చేసి లబ్ధిదారులు ఫైనల్లిస్ట్రెడీ చేశాం. వారం రోజుల్లో ఎమ్మెల్యే ఇండ్లు పంపిణీ చేసేందుకు చర్యలు చేపడుతున్నం. –సింహాచలం, నోడల్ ఆఫీసర్
పంపిణీలో ప్రభుత్వం విఫలం
హౌసింగ్ మినిస్టర్ జిల్లాలోనే ‘డబుల్’ ఇండ్ల పంపిణీ ఆలస్యం కావడం సిగ్గుచేటు. 396 ఇండ్లు పంచేందుకే రెండేళ్లు దాటింది. బీఆర్ఎస్లీడర్ల జోక్యంతోనే పంపిణీ ప్రక్రియ లేటవుతోంది. కొన్ని ఇండ్లు కట్టి చాలా రోజులు అవుతుండడంతో శిథిలావస్థకు చేరుతున్నాయి. అర్బన్‌లో ఇండ్లు పంచేందుకు 20 ఏండ్లు దాటుతదో ఏమో..–ధన్ పాల్ సూర్యనారాయణ, బీజేపీ రాష్ట్ర కార్య వర్గ సభ్యుడు