అర్హులకే ఇండ్లివ్వాలని పేదల ఆందోళన

  • డబుల్ ​బెడ్​రూం ఇండ్ల  ఓపెనింగ్​ను అడ్డుకునే యత్నం 
  • ఎవరూ రాకుండా కంపలు, చెట్లు వేసి నిరసన 
  • పర్యటనను వాయిదా వేసుకున్న ఎమ్మెల్యే 
  • నల్గొండ జిల్లా విబలాపురంలో ఉద్రిక్తత

మునగాల (మోతె) వెలుగు : అర్హులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని సీపీఎం మోతె మండల కమిటీ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా విబలాపురంలో శుక్రవారం చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఈ సందర్భంగా ఓ సీపీఎం లీడర్​ను ఎస్​ఐ కొట్టడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. గ్రామంలో నిర్మించిన డబుల్​ బెడ్​రూం ఇండ్లకు సంబంధించి మొదటి లిస్టులో అర్హులను ఎంపిక చేసిన అధికారులు రెండో లిస్టులో మాత్రం అనర్హులకు, బీఆర్ఎస్​ కార్యకర్తలకు, లీడర్లకు కేటాయించారన్న ఆరోపణలు వచ్చాయి. 

శుక్రవారం ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య ఈ  ఇండ్లు ప్రారంభించడానికి ఏర్పాట్లు చేశారు. దీంతో సీపీఎం ఆధ్వర్యంలో సుమారు 70 మంది పేదలు అర్హులకే ఇండ్లు ఇవ్వాలంటూ శుక్రవారం గ్రామంలో ఆందోళనకు దిగారు. సాయంత్రం 4 గంటల వరకూ ఎమ్మెల్యే రాకపోవడంతో డబుల్ ​బెడ్​రూం ఇండ్ల దగ్గరకు వెళ్లి నిరసన తెలిపారు. బయటి నుంచి ఎవరు డబుల్​బెడ్​రూం ఇండ్ల ప్రాంగణానికి రాకుండా అడ్డంగా చెట్లు, కంపలు వేశారు. విషయం తెలుసుకున్న మోతె ఎస్​ఐ  మహేశ్, కానిస్టేబుల్ నాగయ్య అక్కడికి వచ్చారు. ఎస్ఐ కంప తీసే ప్రయత్నం చేయగా పేదలు, సీపీఎం నాయకులు అడ్డు తగిలారు.

దీంతో  ఎస్​ఐ మహేశ్...​సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపెల్లి సైదులు కండువా, షర్ట్​ పట్టి  ముందుకు లాగారు. ఆయనపై దాడి చేయడంతో  అక్కడున్న జనాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎస్​ఐ వెనక్కి తగ్గారు. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గసభ్యులు సైదులు మాట్లాడుతూ అర్హులకే  డబుల్​ బెడ్​రూం ఇండ్లు  ఇవ్వాలని ఆందోళన చేస్తున్న తనపై ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, స్థానిక బీఆర్ఎస్ నాయకులు పోలీసులతో దాడి చేయించారని ఆరోపించారు. ఇలాంటి వాటికి భయపడే ప్రసక్తే లేదన్నారు. వెంటనే ఎస్సైని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మండలంలోని విబలాపురం, రావిపహాడ్, మోతె గ్రామాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల నుంచి రూ. 7వేల చొప్పున వసూలు చేశారన్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు.

ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కూడా స్పందించలేదన్నారు. సీపీఎం మండల కార్యదర్శి ముల్కూరి గోపాల్ రెడ్డి, కమిటీ సభ్యులు నాగం మల్లయ్య, డీవైఎఫ్ఐ మండల అధ్యక్షుడు వెలుగు చేగువేరా, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు మైనంపాటి వీరారెడ్డి, ఉపాధ్యక్షుడు సామి రెడ్డి నవీన్ రెడ్డి ,యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పనస శ్రీనివాస్, ఉప్పుల ఉపేందర్ ,మండల కాంగ్రెస్ నాయకులు గుండ్ల లక్ష్మారెడ్డి ,ముక్క రామయ్య, టీడీపీ గ్రామ శాఖ అధ్యక్షులు బోర్రాజు ఎల్లయ్య పాల్గొన్నారు. కాగా, ఎస్​ఐ దాడిని నిరసిస్తూ శనివారం మోతె పీఎస్​ ముందు సీపీఎం ఆందోళనకు పిలుపునిచ్చింది.