గత 20 ఏండ్లలో డబులైన విపత్తులు

20 ఏండ్లలో బాగా పెరిగిన తుపాన్లు, వరదలు, కార్చిచ్చులు, కరువులు

కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో వాతావరణం మారిపోయింది. సరిగా వానలు పడని చోట్ల భారీ వర్షాలు, వరదలు, విపత్తులు వస్తున్నాయి. మంచి వానలతో, చల్లగా ఉండే ప్రాంతాల్లో కరువు పరిస్థితులు నెలకొంటున్నాయి. కొన్ని దేశాల్లో కార్చిచ్చులు చెలరేగుతుంటే.. మరికొన్ని దేశాల్లో ఎన్నడూ లేనట్టుగా విపరీతంగా మంచు కురుస్తోంది. తుఫానులు, సునామీలు విరుచుకుపడుతున్నాయి. ఇలా గత ఇరవై ఏండ్లలో ప్రకృతి విపత్తులు రెండింతలు పెరిగిపోయాయని యునైటెడ్​ నేషన్స్ (యూఎన్) తాజాగా ప్రకటించింది. 1980 నుంచి 1999 వరకు.. 2000 సంవత్సరం నుంచి 2019 వరకు వచ్చిన ప్రకృతి విపత్తులపై యూఎన్​ రీసెర్చర్లు స్టడీ చేసి ఓ రిపోర్టు రూపొందించారు. దీనిని ‘ది హ్యూమన్​ కాస్ట్​ ఆఫ్​ డిజాస్టర్స్​ 2000–2019’ పేరిట విడుదల చేశారు. ఇందులో కేవలం వాతావరణ ఆధారిత డిజాస్టర్లను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు. బయోలాజికల్  ప్రమాదాలను, కరోనా వంటి డిసీజ్​ రిలేటెడ్​ డిజాస్టర్లను పరిగణనలోకి తీసుకోలేదు.

ఆసియాలోనే ఎక్కువ..

యూఎన్​ రిపోర్టు రూపకల్పన కోసం ప్రపంచవ్యాప్తంగా నమోదైన ప్రకృతి విపత్తులను నమోదు చేసే ఎమర్జెన్సీ ఈవెంట్స్​ డేటాబేస్​ నుంచి వివరాలను తీసుకున్నారు. అందులో ఎమర్జెన్సీ డిక్లేర్​ చేసిన చోట.. కనీసం పది మందికిపైగా చనిపోయి, వంద మందికిపైగా జనం ఎఫెక్ట్​ అయిన ఘటనలను పరిగణనలోకి తీసుకున్నారు. ఈ విపత్తుల్లో సగానికిపైగా ఆసియా ఖండంలోని దేశాల్లోనే జరిగినట్టు రిపోర్టులో వెల్లడించారు. ఆసియాలో 3,068 విపత్తులు నమోదుకాగా.. అమెరికా ఖండాల్లో 1,756, ఆఫ్రికాలో 1,192 విపత్తులు వచ్చాయి. దేశాల వారీగా చూస్తే.. చైనాలో అత్యధికంగా 577 విపత్తులు వస్తే, అమెరికాలో 467 ఘటనలు జరిగాయి.

వాతావరణ మార్పులతోనే..

విపత్తులు ఒక్కసారిగా పెరిగిపోవడానికి వాతావరణంలో వస్తున్న మార్పులే ప్రధాన కారణమని యూఎన్​ తన నివేదికలో పేర్కొంది. టెంపరేచర్లు పెరిగిపోవడం, విపరీతమైన కాలుష్యం, కార్బన్​డయాక్సైడ్, క్లోరోఫ్లోరో కార్బన్​ ఉద్గారాలు, వనరులను విచ్చలవిడిగా వినియోగించడం వంటివి వాతావరణ మార్పులకు కారణమవుతున్నాయని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో తుఫాన్లు, వరదలు, విపరీతమైన ఎండలు, కరువు పెరిగిపోతున్నాయని పేర్కొంది. అభివృద్ధి చెందిన దేశాలు గ్రీన్​హౌస్​​ వాయువుల విడుదలను తగ్గించుకోవడంలో ఫెయిలవుతున్నాయని యూఎన్​ మండిపడింది.

20 ఏండ్లలో డబుల్

1980–99 మధ్య ప్రపంచవ్యాప్తంగా 4,212 మేజర్​ డిజాస్టర్లు జరిగాయని.. తర్వాతి ఇరవై ఏండ్లలో ఇవి 7,348కి పెరిగాయని యూఎన్​ నివేదికలో తెలిపింది. ఈ ఇరవై ఏండ్లలో డిజాస్టర్లకు 12 లక్షల మందికిపైగా బలైపోయారని.. ఏకంగా 420 కోట్ల మంది జనంపై ఎఫెక్ట్​ పడిందని వెల్లడించింది. మొత్తంగా ప్రపంచ ఎకానమీకి మూడు లక్షల కోట్ల డాలర్లు (2.17 కోట్ల కోట్ల రూపాయలు) నష్టం జరిగిందని అంచనా వేసింది. 1980–99 మధ్య 1,500 వరకు అత్యంత ప్రమాదకరమైన భారీ వరదలు నమోదుకాగా.. ఈ ఇరవై ఏండ్లలో 3,254కు పెరిగినట్టు తెలిపింది. అంతకుముందు ఇరవై ఏళ్లలో 1,457 పెద్ద తుపాన్లు రాగా.. ఈ ఇరవై ఏండ్లలో 2,034 భారీ తుపాన్లు వచ్చాయని వెల్లడించింది.

మరెన్నో విపత్తులు కూడా..

వాతావరణ మార్పులతో సంబంధం లేకుండా జరిగే విపత్తులు కూడా ఇటీవలి కాలంలో పెరిగిపోతున్నాయని యూఎన్​ రిపోర్టు పేర్కొంది. మనుషుల చర్యలతో సంబంధం లేని భూకంపాలు, సునామీలు వంటివి లక్షలాది మందిపై ఎఫెక్ట్​ చూపిస్తున్నాయని తెలిపింది. అంతకుముందుతో పోలిస్తే ఇరవై ఏండ్లలో భూకంపాలు, సునామీల యాక్టివిటీ ఎక్కువగా ఉందని వెల్లడించింది. ఇరవై ఏండ్లలో అత్యంత ప్రమాదకరమైన, ఎక్కువ మందిపై ఎఫెక్ట్​ చూపిన ఘటనలను రిపోర్టులో పేర్కొంది. ఇందులో 2004లో హిందూ మహా సముద్రంలో వచ్చిన సునామీతో ఏకంగా 2 లక్షల 26 వేల మంది చనిపోయారు. కోట్లాది మందిపై ఎఫెక్ట్​ పడింది. తర్వాత 2010లో హైతీలో వచ్చిన భయానక భూకంపంలో 2 లక్షల 22 వేల మందికిపైగా చనిపోయారు.

మనమే నష్టం చేసుకుంటున్నం

మానవ తప్పిదాలు, చర్యలతోనే ప్రకృతి విపత్తులు పెరుగుతున్నాయని యూఎన్​ డిజాస్టర్​ రెస్పాన్స్​ చీఫ్​ మామి మిజుటొరి స్పష్టం చేశారు. ‘‘మనమే నేచర్​ను ఉద్దేశపూర్వకంగా దెబ్బ తీసుకుంటున్నం. 20 ఏండ్లలో వచ్చిన విపత్తులు, వాటి కారణాలను లోతుగా పరిశీలిస్తే.. మనం తేల్చగలిగింది ఇదే. క్లైమేట్​ డిజాస్టర్లు రాకుండా ప్రభుత్వాలేవీ తగిన చర్యలు తీసుకోవడం లేదు. డిజాస్టర్లను సరిగా ఎదుర్కొనే ఏర్పాట్లూ చేయడం లేదు” అని ఆమె పేర్కొన్నారు. అయితే పెరిగిన టెక్నాలజీ, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు వంటివాటి సాయంతో డిజాస్టర్లలో మరణాల సంఖ్యను తగ్గించగలిగామని చెప్పారు. అయితే ముందు ముందు మరింతగా విపత్తులు పెరిగిపోయే ప్రమాదం ఉందని.. చాలామందిపై వాటి ప్రభావం ఉంటుందని వెల్లడించారు.

For More News..

ఆఫీసర్లపై దసరా ప్రెషర్​