నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : డబుల్ ఓట్లను తొలగించి తప్పులు లేకుండా ఓటర్ జాబితాను రూపొందించాలని కలెక్టర్ పి ఉదయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి ధరణి, ఓటర్ల జాబితా, మీసేవ దరఖాస్తులపై తహసీల్దార్లు, ఆర్డీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బీఎల్వోల వద్ద ఉన్న ఓటరు జాబితాను పరిశీలించి డబుల్ ఎంట్రీ, ఇతర పొరపాట్లు లేకుండా లిస్ట్‌ను సరి చేయాలని సూచించారు.
జిల్లాలో 9 వేలకు పైగా పెండింగ్ దరఖాస్తులు ఉన్నాయని, వాటిని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. తహసీల్దార్లు తమ పరిధిలో పరిష్కారమయ్యే ధరణి దరఖాస్తులపై దృష్టి పెట్టాలన్నారు. కల్వకుర్తి– నంద్యాల హైవే భూసేకరణను వెంటనే కంప్లీట్ చేయాలని ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్లు కుమార్ దీపక్, కె సీతారామారావు పాల్గొన్నారు.