
- దశలవారీగా విదేశాలకు మిల్లెట్ మార్వెల్స్
- గ్రూప్ సీఎండీ మునగాల మోహన్ శ్యామ్ ప్రసాద్
హైదరాబాద్, వెలుగు: పప్పులు, ధాన్యాలు అమ్మే తెనాలి డబుల్ హార్స్ గ్రూప్ తాజాగా చిరుధాన్యాల ఉత్పత్తుల విభాగంలోకి వచ్చింది. మిల్లెట్ మార్వెల్స్బ్రాండ్ కింద ధాన్యాలు, నూడుల్స్, కుకీస్, రెడీ టు కుక్ వంటి 18 రకాల ఉత్పత్తులను అమ్మనుంది. అపోలో హాస్పిటల్స్ గ్రూప్ జేఎండీ డాక్టర్ సంగీతా రెడ్డి చేతుల మీదుగా వీటిని మార్కెట్లోకి విడుదల చేసింది. హెల్త్ మిక్సెస్, డయాబెటిక్ ఫ్రెండ్లీ మిక్సెస్, సెమోలినా, పాస్తా, నట్స్ ఫ్రీజ్ డ్రైడ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ వంటివి దశలవారీగా మార్కెట్లోకి తేనున్నట్టు తెనాలి డబుల్ హార్స్ గ్రూప్ సీఎండీ మునగాల మోహన్ శ్యామ్ ప్రసాద్ ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు.
ఆర్గానిక్ ఉత్పత్తులను సైతం రానున్న రోజుల్లో విడుదల చేస్తామని, ఇందుకోసం రైతులతో ఒప్పందం చేసుకున్నామని వెల్లడించారు. తొలుత తెలుగు రాష్ట్రాల్లో మిల్లెట్ మార్వెల్స్ ఉత్పత్తులను ప్రవేశపెడతామని ప్రసాద్ తెలిపారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా విస్తరిస్తామని చెప్పారు. ‘రాబోయే 3 సంవత్సరాలలో గ్రూప్ ఆదాయంలో 5 శాతం మిల్లెట్ మార్వెల్స్ ద్వారా సమకూరుతుందని భావిస్తున్నాం. 2024–25లో సంస్థ సేల్స్ టర్నోవర్ రూ.535 కోట్లు దాటింది.
మూడేళ్లలో నాలుగు అంకెల స్థాయికి టర్నోవర్‌ను చేర్చాలన్నది లక్ష్యం. 2005లో కంపెనీ ప్రస్థానం మొదలైంది. మా ప్రొడక్టులను12 దేశాలకు ఎగుమతులు చేస్తున్నాం. భారత్‌లో 15 రాష్ట్రాలోని కస్టమర్లకు చేరువయ్యాం. తెలుగు రాష్ట్రాల్లో 25 స్టోర్లను ఏర్పాటు చేస్తాం’ అని వివరించారు.