గ్రామసభను బహిష్కరించిన సర్పంచ్, వార్డు మెంబర్లు
యాదగిరిగుట్ట, వెలుగు: తుర్కపల్లిలో ‘డబుల్’ ఇండ్ల లబ్ధిదారుల ఫైనల్ లిస్ట్ ఆమోదం కోసం మంగళవారం నిర్వహించిన గ్రామసభ రసాభాసగా మారింది. అసలైన వారికి కాకుండా అనర్హులకు ఇండ్లు కేటాయిస్తున్నారని బీజేపీ లీడర్లు గ్రామసభ ఎదుట ఆందోళనకు దిగారు. అదే సమయంలో లబ్ధిదారుల ఎంపికలో సర్పంచ్ అభిప్రాయం తీసుకోకుండా ఆఫీసర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారంటూ వార్డు మెంబర్లతో కలిసి సర్పంచ్ పడాల వనిత గ్రామసభను బహిష్కరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ వనిత , బీజేపీ మండల అధ్యక్షుడు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మండల కేంద్రంలో నిర్మించిన 40 డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం 176 మంది అప్లై చేసుకోగా, మొదటి గ్రామసభలో 37 మంది లబ్ధిదారుల లిస్ట్ ఫైనల్ చేయగా, మంగళవారం నిర్వహించిన గ్రామసభలో 27 మందికి కుదిస్తూ ఆఫీసర్లు లిస్ట్ ప్రకటించారు. ఏ లెక్కన పది మంది పేర్లను తొలగించారని అడిగితే ఆఫీసర్లు సమాధానం చెప్పడం లేదని తెలిపారు. ఆఫీసర్లు బీఆర్ఎస్ లీడర్లు చెప్పిన వారికి ఇండ్లు కేటాయిస్తూ.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వైఖరి మార్చుకోకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. వార్డు మెంబర్లు విజయ్, కరుణాకర్, భాను, వేణు, బీజేపీ లీడర్లు ఉన్నారు.
చిన్నారులకు పునరావాసం కల్పించాలి
యాదాద్రి, వెలుగు: ‘ఆపరేషన్ స్మైల్’ ప్రోగ్రాంలో భాగంగా నిరాదరణకు గురైన, తప్పిపోయిన, పారిపోయిన బాలలను గుర్తించి పునరావాసం కల్పించాలని యాదాద్రి కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. జనవరి 1 నుంచి నిర్వహిస్తున్న ‘ఆపరేషన్‌స్మైల్’ పై కలెక్టరేట్ లో మంగళవారం రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని భువనగిరి, యాదగిరిగుట్ట, చౌటుప్పల్ లోని ఇటుక బట్టీలు, హోటల్స్, డాబాలు, పరిశ్రమలలో బాల కార్మికులను, భిక్షాటన చేసే పిల్లలను గుర్తించి రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. తప్పిపోయిన బాలల వివరాలను దర్పణ్ పోర్టల్‌లో అప్లోడ్చేయాలన్నారు. పిల్లలను పనిలో పెట్టుకున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చైల్డ్ వెల్ఫేర్ జిల్లా కమిటీ చైర్మన్ జయశ్రీ, వెల్ఫేర్ఆఫీసర్ కృష్ణవేణి, డీపీవో సునంద, ఎస్సీ, బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్లు జయపాల్ రెడ్డి, యాదయ్య తదితరులు ఉన్నారు.
సీఐపై చర్యలు తీసుకోవాలి
హుజూర్ నగర్, వెలుగు: వరంగల్ పట్టణంలో ఇద్దరు అడ్వకేట్లపై సీఐ దాడి చేయడాన్ని నిరసిస్తూ హుజూర్ నగర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అడ్వకేట్లు మంగళవారం తమ విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. న్యాయవాదులకు రక్షణ కల్పించాలని సీనియర్ సివిల్ జడ్జి జిట్టా శ్యాం కుమార్, జూనియర్ సివిల్ జడ్జి సాకేత్ మిత్ర లకు వేర్వేరుగా వినతి పత్రాలు అందజేశారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సాముల రామిరెడ్డి, ప్రధాన కార్యదర్శి జక్కుల నాగేశ్వరరావు, అధికార ప్రతినిధి కాల్వ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
హుజూర్ నగర్ కోర్టును పరిశీలించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి
సూర్యాపేట జిల్లా జడ్జి గౌతమ్ ప్రసాద్ మంగళవారం హుజూర్ నగర్ లో నిర్మిస్తున్న అడిషనల్జిల్లా కోర్టు భవన నిర్మాణాలను పరిశీలించారు. జడ్జిలు జిట్టా శ్యాం కుమార్, సాకేత్ మిత్ర లను అడిగి పలు విషయాలు తెలుసుకున్నారు. ఆర్అండ్బీ ఆఫీసర్లకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోర్టును త్వరలోనే ప్రారంభించనున్నామని తెలిపారు. బార్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాంరెడ్డి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
పది రోజుల్లో పనులు పూర్తి చెయ్యాలి
మేళ్లచెరువు, వెలుగు: ‘మన ఊరు మన బడి’ పనులను పది రోజుల్లోగా పూర్తి చేయాలని డీఈవో అశోక్ ఆదేశించారు. మంగళవారం మేళ్లచెరువు, హరిజనవాడ, రామాపురం ప్రైమరీ స్కూళ్లలో జరుగుతున్న పనుల పురోగతిని పరిశీలించారు. బండలు పరువడం, డ్రింకింగ్ వాటర్ ట్యాంకుల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. అన్ని మండలాల్లో ఎంపిక చేసిన స్కూళ్లలో పనులు పూర్తి చేసి ఈ నెల 20 న ఓపెనింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నామని డీఈవో మీడియాకు వెల్లడించారు. సర్పంచ్ శంకర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
అంబేద్కర్ విగ్రహం తొలగింపులో నిర్లక్ష్యం
నల్లగొండ అర్బన్, వెలుగు: జిల్లా కేంద్రంలోని డీఈవో ఆఫీస్ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహం మూడు ముక్కలైంది. పట్టణంలో రోడ్డు విస్తరణతో పాటు నేషనల్హైవే నిర్మాణం కూడా జరుగుతోంది. అందులో భాగంగా అక్కడే ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించాల్సి వచ్చింది. విగ్రహం తొలగింపులో ఆఫీసర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారని అంబేద్కర్సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. విగ్రహం తొలగించే సమయంలో జాగ్రత్తలు పాటించకపోవడంతో ముక్కలైందని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆఫీసర్లు, కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
పీఆర్బీ అవకతవకలపై కాంగ్రెస్ ఆందోళన
నకిరేకల్, వెలుగు : పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అవకతవకలపై నకిరేకల్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుండా జలంధర్ రెడ్డి ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ లీడర్లు స్థానిక మెయిన్ సెంటర్లో మంగళవారం నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా జలంధర్ రెడ్డి మాట్లాడుతూ పోలీస్ కానిస్టేబుల్ ఎస్సై నోటిఫికేషన్లో జరిగిన అవకతవకలు సవరించాలని డిమాండ్ చేశారు. దీక్షలో కూర్చున్న వారికి డీసీసీ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ఆదిమల్ల శంకర్, ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పరమేశ్ నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు.
మెడికల్ కాలేజీ ఏర్పాటు అభినందనీయం
సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ పౌర స్పందన వేదిక సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సూర్యాపేట మెడికల్ కాలేజీ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇక్కడ కాలేజీ ఏర్పాటు చేయడం ద్వారా జనగాం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల విద్యార్థులు చదువుకోవడానికి అనువుగా ఉంటుందని, ఉచిత వైద్యాన్ని అందించే కేంద్రంగా ఉంటుందన్నారు. ప్రభుత్వమే ఉచిత విద్య, వైద్యం అందించాలని, దాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని సూచించారు. పౌర స్పందన వేదిక జిల్లా అధ్యక్షుడు ఆర్ ధనముర్తి, జిల్లా ఉపాధ్యక్షురాలు కేఏ మంగ తదితరులు పాల్గొన్నారు.
గంజాయి తరలిస్తున్న ఐదుగురి అరెస్ట్
22 కేజీల గంజాయి స్వాధీనం
సూర్యాపేట, వెలుగు: జిల్లాలో గంజాయి తరలిస్తున్న 3 ముఠాలను పోలీసులు వేర్వేరు చోట్ల పట్టుకుని ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. ఎస్పీ రాజేంద్ర ప్రసాద్మంగళవారం తన ఆఫీస్‌లో ప్రెస్‌మీట్ పెట్టి వివరాలు వెల్లడించారు. హైదరాబాద్ కు చెందిన ఠాకూర్ నిఖిల్ సింగ్, సారగండ్ల మహేశ్, రోహన్ రాజ్ పుత్, కాలు తివారి అనే నలుగురు కొంత కాలంగా ఏపీలోని అరకు పరిసర ప్రాంతాల్లో గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్ కు తరలించి అమ్ముతూ డబ్బులు సంపాదిస్తున్నారు. ఈ నెల 9న అరుకులో గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్ బయల్దేరారు. మొదట రోహన్ రాజ్ పుత్, కాలు తివారీ బస్సులో హైదరాబాద్ చేరుకోగా, కారులో గంజాయిని తీసుకుని హుజూర్నగర్మీదుగా హైదరాబాద్ వస్తున్న ఠాకూర్ నిఖిల్ సింగ్, సారగండ్ల మహేశ్‌ను పోలీసులు పట్టుకున్నారు. మరో కేసులో ఏపీకి చెందిన విజయ్ కుమార్, బంగారు రాజు హైదరాబాద్ లోని హాస్టల్లో ఉంటూ ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు. జీతాలు సరిపోకపోవడంతో వైజాగ్ లో గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్‌లో అమ్ముతూ జల్సాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో 1.50 కేజీల గంజాయిని కొనుగోలు చేసి హైదరాబాద్ వస్తుండగా నడిగూడెం వద్ద పోలీసులకు పట్టుబడ్డారు. మరో కేసులో నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం బొల్లారం గ్రామానికి చెందిన పురం గణేశ్ గంజాయికి అలవాటుపడి దాచేపల్లి వద్ద గుర్తు తెలియని వ్యక్తుల వద్ద 800 గ్రాముల గంజాయిని కొని గరిడేపల్లిలో అనుమానంగా తిరుగుతుండగా పోలీసులు పట్టుకున్నారు. మూడు చోట్ల నిందితుల నుంచి రూ.24 లక్షల విలువైన 22 కేజీల గంజాయితో పాటు కారు, 4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు. అనంతరం పోలీస్ సిబ్బందికి ఎస్పీ రివార్డులను అందించారు. కోదాడ డీఎస్పీ వెంకటేశ్వర్లు, మునగాల సీఐ ఆంజనేయులు, హుజుర్ నగర్ సీఐ రామలింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పోలీసులు సమష్టిగా పనిచేయాలి
లోపాలను అధిగమిస్తూ పోలీసులు సమష్టిగా పనిచేయాలని ఎస్పీ రాజేంద్రప్రసాద్ సూచించారు. మంగళవారం వార్షిక పోలీస్ స్టేషన్ తనిఖీల్లో భాగంగా ఎస్పీ ఆత్మకూరు(ఎస్) పీఎస్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసులు పెండింగ్ లేకుండా చూసుకోవాలని సూచించారు. అనంతరం పీఎస్పరిసరాలను, రికార్డులను ఎస్పీ పరిశీలించారు. డీఎస్పీ నాగభూషణం, సీఐలు సోమ్ నారాయణ్ సింగ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
మునుగోడులో పర్యటించిన రాజగోపాల్‌రెడ్డి
4 లక్షల ఆర్థిక సాయం చేస్తానని హామీ
చండూరు (నాంపల్లి), వెలుగు: మునుగోడు బైఎలక్షన్తర్వాత మొదటిసారిగా మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి, మర్రిగూడ మండలాల్లో మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పర్యటించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ వ్యవహరించిన తీరు, రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నాంపల్లిలోని రచ్చబండ వీధికి చెందిన కామిశెట్టి వెంకటయ్య ఇటీవల రంగారెడ్డి జిల్లా రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయారు. బాధిత కుటుంబాన్ని సందర్శించి వెంకటయ్య ఫొటోకు పూలమాల వేసి నివాళి అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఇద్దరు పిల్లల చదువు కోసం చెరో రూ. 2 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చారు. తర్వాత మర్రిగూడ మండలానికి చేరుకొని ఎరుగండ్లపల్లిలో బీజేపీ లీడర్లు శ్రీరామదాసు, శ్రీనివాసులు ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులతో పాటు పార్టీ కార్యకర్తలను బాగోగులు అడిగి తెలుసుకున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో నైతిక గెలిచింది బీజేపీయేనని, ఎవరూ అధైర్యపడొద్దని ధైర్యం చెప్పారు. మునుగోడు నియోజకవర్గ కన్వీనర్ దూడల భిక్షం గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసింది
నల్లగొండ అర్బన్, వెలుగు : కాంగ్రెస్ లీడర్లంతా విభేదాలు వీడి పార్టీ పటిష్టతకు పని చేయాలని రాష్ట్ర నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం నల్గొండలోని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి క్యాంప్ ఆఫీస్‌లో డీసీసీ ప్రెసిడెంట్శంకర్నాయక్ అధ్యక్షతన కాంగ్రెస్ హాత్‌సే హాత్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ రాహుల్ గాంధీ నాయకత్వంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నిర్వహిస్తున్న భారత్‌జోడో యాత్రను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. రాహుల్ యాత్ర ఈ నెల 26 న ముగుస్తోందని, అదే రోజు జిల్లా వ్యాప్తంగా గ్రామస్థాయి నుంచి ప్రతి ఒక్కరూ పార్టీ జెండాలను ఎగరేయాలన్నారు. మోడీ, కేసీఆర్పాలనా వైఫల్యాలను ప్రజలకు వివరించాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కులం, మతం ,వర్గంతో పాటు అన్ని విషయాల్లో మోసం చేసిందన్నారు. టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్, ప్రధాన కార్యదర్శులు కుందూరు రఘువీర్ రెడ్డి, కొండేటి మల్లయ్య, చలమల కృష్ణారెడ్డి, పున్న కైలాస్ నేత, రాష్ట్ర నాయకులు దుబ్బాక నర్సింహారెడ్డి, మునుగోడు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పాల్వాయి స్రవంతి తదితరులు పాల్గొన్నారు.