- అసెంబ్లీ ఎన్నికలకు ముందు 804 మందికి పట్టాలు
- పూర్తికాని ఇండ్లను ఎలా అలాట్చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్న అధికారులు
- కోపంతో రగిలిపోతున్న లబ్ధిదారులు
సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట జిల్లాలో డబుల్బెడ్రూమ్ఇండ్ల కోసం ఎదురు చూస్తున్న నిరుపేదలను బీఆర్ఎస్ప్రభుత్వం దగా చేసింది. పూర్తికాని ఇండ్ల కోసం లబ్ధిదారులను ఎంపిక చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు దండుకునేందుకు, హడావుడిగా లక్కీ డ్రా తీయించింది. 804 మందిని ఎంపిక చేసి పట్టాలు పంపిణీ చేసింది. లబ్ధిదారులు ఎంతో ఆనందంగా ఇండ్ల వద్దకు వెళ్లి చూస్తే సగంలో నిలిచిపోయిన పిల్లర్లు, మొండి గోడలు, తలుపులు, కిటికీలు లేని గదులు కనిపించాయి. ఈలోగా అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయి. బీఆర్ఎస్ దిగిపోయి, కాంగ్రెస్ప్రభుత్వం వచ్చింది. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి రాత్రికిరాత్రే డ్రా తీసి లబ్ధిదారులను ఎంపిక చేయించారు. అప్పటి మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా పట్టాలు పంపిణీ చేశారు. పూర్తికాని ఇండ్లను ఎలా అలాట్చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. పట్టాలు అందుకున్నవారికి ఇండ్లు కేటాయిస్తారో లేదోనని జనం ఆందోళన చెందుతున్నారు.
939 ఇండ్లకు శంకుస్థాపన
ఇండ్లు లేని పేదల కోసం సూర్యాపేట జిల్లా కేంద్రంలో 939 ఇండ్లు నిర్మించాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. 2017లో శంకుస్థాపన చేసి, పనులను ప్రారంభించింది. ఇందులో గాంధీ నగర్ లో 75, కేసారంలో 480, ఇందిరమ్మ కాలనీ ఫేజ్–3లో 384 డబుల్బెడ్రూమ్ఇండ్లు నిర్మించాల్సి ఉంది. గడిచిన ఆరేండ్లలో ఇందిరమ్మ కాలనీ తలపెట్టిన 384 ఇండ్లు మాత్రమే పూర్తయ్యాయి. మిగిలిన రెండు చోట్ల ఒక్క ఇల్లు కూడా పూర్తి కాలేదు. గాంధీనగర్‌లో 48 ఇండ్ల పనులు ప్రారంభించగా, 28 ఇండ్ల పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. 20 ఇండ్లు నేటికీ పిల్లర్ల స్టేజీలోనే ఉన్నాయి. 27 ఇండ్లను మొత్తానికే స్టార్ట్ చేయలేదు. కేసారం వద్ద నిర్మిస్తున్న 480 ఇండ్ల పనులు ఇప్పటివరకు 60 శాతమే పూర్తయ్యాయి. ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు ఏడాది కింద పనులను ఆపేశారు. కాగా సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం7 వేల మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు. ఇందులో 2,716 మంది అర్హులని రెవెన్యూ ఆఫీసర్లు గుర్తించారు. గతేడాది అక్టోబర్1న కలెక్టరేట్ లో అప్పటి మంత్రి, ప్రస్తుత సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి డ్రా తీసి 804 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. అక్టోబర్ 2న సూర్యాపేటలో మాజీ మంత్రి కేటీఆర్ తో కలిసి వారికి పట్టాలు పంచారు.
రాజకీయ ఒత్తిళ్లతోనే..
కేవలం రాజకీయ ఒత్తిళ్లతోనే అధికారులు పూర్తికాని ఇండ్లకు లబ్ధిదారులను ఎంపిక చేశారు. జగదీశ్‌రెడ్డి రెవెన్యూ ఆఫీసర్లను ఒత్తిడి చేసి పట్టాలను అందించారు. నిర్మాణం, ఇతర పనులు పూర్తయ్యాక ఆర్అండ్ బీ అధికారులు ఇండ్లను రెవెన్యూ అధికారులకు హ్యాండోవర్చేయాలి. తర్వాతే లబ్ధిదారుల ఎంపిక చేపడతారు. కానీ ఇక్కడ అంతా రివర్స్‌లో జరిగింది. అప్పటి జిల్లా మంత్రికి అనుకూలంగా అధికారులు పనిచేశారు. పట్టాలు ఇచ్చేశారు. మిగిలిన పనులు పూర్తి చేయాలంటే కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఆసక్తిగా మారింది. హుజూర్ నగర్ నియోజకవర్గంలోని రామసామి గుట్ట వద్ద అసంపూర్తిగా నిలిచిపోయిన ఇండ్లకు ఫండ్స్ ఇచ్చి మూడు నెలల్లో పూర్తి చేస్తామని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. సూర్యాపేటలో కూడా అలాగే చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
చెప్పినా వినలేదు.. పట్టాలు పంచేశారు
కేసారం, గాంధీనగర్‌లో డబుల్బెడ్రూమ్ఇండ్ల నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. బిల్లులు పెండింగ్ఉన్నాయి. కాంట్రాక్టర్లు పనులను మధ్యలోనే ఆపేశారు. పూర్తికానందునే ఇండ్లను రెవెన్యూ అధికారులకు హ్యాండ్ ఓవర్ చేయలేదు. పూర్తవలేదని చెప్పినా, రెవెన్యూ అధికారులు డ్రా తీసి పట్టాలు పంచేశారు.
- యాకూబ్, ఆర్అండ్ బీ, ఈఈ, సూర్యాపేట జిల్లా
సూర్యాపేటలోని గాంధీనగర్‌లో 75 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. 48 ఇండ్ల పనులు ప్రారంభించగా, 28 ఇండ్ల పనులు మధ్యలో నిలిచిపోయాయి. 20 ఇండ్లు నేటికీ పిల్లర్ల స్టేజీలోనే ఉన్నాయి. 27 ఇండ్లను మొత్తానికే స్టార్ట్ చేయలేదు.