భూముల లీజ్ తో యజమానులకు డబుల్​ ఇన్​కం

భూముల లీజ్ తో యజమానులకు డబుల్​ ఇన్​కం
  • పట్టించుకోని మైనింగ్, రెవెన్యూ​ అధికారులు 
  • పక్కదారి పడుతున్న  రైతుబంధు నిధులు

పెద్దపల్లి, వెలుగు: రైతులకు ప్రోత్సాహకంగా ఇస్తున్న పెట్టుబడి సొమ్మును కొందరు అడ్డదారిలో పొందుతున్నారు.ఎలాంటి నాలా కన్వర్షన్ లేకుండానే వ్యవసాయ భూముల్లో ఏర్పాటు చేస్తున్న ఇటుక బట్టీలు, వెంచర్లకు కూడా రైతుబంధు డబ్బులు వస్తున్నాయి. పంట ఎంత విస్తీర్ణంలో సాగవుతుందో వివరాలు సేకరించాల్సిన అగ్రికల్చర్ ఆఫీసర్ల నిర్లక్ష్యం, ఇటుక బట్టీల ఏర్పాటుపై మైనింగ్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, ధరణిలో ఉన్న భూములన్నీ సాగులో ఉన్నాయో లేదో రెవెన్యూ అధికారులు గమనించకపోవడంతో వేల ఎకరాల్లో అనర్హులకు రైతుబంధు అందుతోంది. ఫలితంగా సర్కార్ హుండీకి గండి పడుతోంది. 

ఇటుక బట్టీలతో రెట్టింపు ఆదాయం..

రైతుబంధు పథకంలో భాగంగా ఏడాదికిగాను ఎకరానికి రూ.10 వేలు అందుతుండటంతో రైతుల పంట సాగుకు ఊరట కలుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో వ్యవసాయ భూములను ఇటుక బట్టీల నిర్వహణకు ఇస్తున్నారు. ఇందుకోసం ఏడాదికి ఎకరానికి రూ.30 నుంచి రూ.40 వేలు తీసుకుంటున్నారు. స్థానికంగా లేనివారు, వ్యవసాయం ఇబ్బందిగా భావించిన వారు భూములను ఇటుక బట్టీలకు లీజుకిస్తున్నారు. ఇటుక బట్టీ యజమానులు పంట పండిస్తే వచ్చే డబ్బుకు రెట్టింపు ఇచ్చి భూములు లీజుకు తీసుకుంటున్నారు. దీంతో భూ యజమానులకు ఇటు లీజు పైసలు, అటు రైతుబంధు వస్తున్నాయి. మరోవైపు ఎలాంటి మైనింగ్ అనుమతులు లేకుండా వ్యవసాయ భూముల్లో ఇటుక బట్టీలు పెడుతున్నారు. వ్యవసాయ భూమిలో ఏ ఇండస్ట్రీ పెట్టాలన్నా నాలా పర్మిషన్ తీసుకోవాలి. ఎలాంటి సర్టిఫికెట్లు లేకుండా బట్టీలు పెట్టినా.. మైనింగ్, రెవెన్యూ అధికారులు  వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.   

వెంచర్లుగా వ్యవసాయ భూములు..

పట్టణాలను ఆనుకొని ఉన్న గ్రామాల వ్యవసాయ భూములన్నీ వెంచర్లుగా మారుస్తున్నారు. భూముల ధరలు భారీగా పెరగడంతో రైతులు తమ భూములను ప్లాట్లుగా మార్చి అమ్ముకుంటున్నారు. రైతులకు రెండింతల డబ్బులు ఇస్తామని ఆశ చూపి రియల్టర్లు భూములను చేజిక్కించుకుంటున్నారు. ఇప్పటికే వేల ఎకరాల భూమి వెంచర్లుగా మారిపోయాయి. మరోవైపు భూముల వివరాలు ధరణిలో అలాగే ఉండటంతో సదరు భూ యజమానులకు రైతుబంధు యథావిధిగా వస్తోంది. అగ్రికల్చర్​ఆఫీసర్లు ఏటా వ్యవసాయ భూమి, సాగైన భూమి వివరాలు చెబుతున్నారు. అలాగే సాగులో లేని భూమికి కూడా రైతు బంధు పడుతున్నా పట్టించుకోవడం లేదు.  

వందల ఎకరాల్లో ఇటుక బట్టీలు..

నాలా కన్వర్షన్ సర్టిఫికెట్​లేకుండా పెద్దపల్లి జిల్లాలో చాలాచోట్ల ఇటుక బట్టీలు వెలుస్తున్నాయి. బట్టీలు పెట్టిన భూములన్నీ లీజుకు తీసుకున్నవి కావడంతో,  ప్రభుత్వాన్ని పక్కదారి పట్టించే విధంగా నాలా కన్వర్షన్ కోసం చలానా కట్టి వాటిని సంబంధిత అధికారులకు ఇస్తున్నారు. పెద్దపల్లి జిల్లా రాఘవపూర్, గౌరెడ్డిపేట గ్రామ పరిధిలోని వందల ఎకరాల్లో ఇటుక బట్టీలు ఏర్పాటు చేశారు. ఈ భూములన్నీ ఒకప్పుడు పంటలు పండినవే. పదేళ్లుగా ఈ ప్రాంతంలో భూములన్నీ పెద్ద మొత్తంలో ఇటుక బట్టీలకు ఇస్తున్నారు. వీటికి నాలా కన్వర్షన్ లేదని ఎవరైనా ప్రశ్నిస్తే.. ‘నాలా కన్వర్షన్ కోసం చలాన్లు కట్టారు.. ప్రాసెస్​జరుగుతోంది’ అని చెబుతున్నారు.  సర్టిఫికెట్ రాకుండా ఇటుకల ఇండస్ట్రీ ఏర్పాటు ఎలా చేస్తారని అడిగితే అది మైనింగ్ డిపార్ట్​మెంట్ చూసుకుంటుందని పేర్కొంటున్నారు. ఈ విషయమై అగ్రికల్చర్ ఆఫీసర్లను అడిగితే నాలా కన్వర్షన్ సర్టిఫికెట్ వస్తేనే రైతుబంధు లిస్ట్ నుంచి డిలీట్ చేయడం వీలవుతుందని అంటున్నారు.