హైదరాబాద్ సిటీ సంక్రాంతి సంబరాల్లో ఉండగా.. షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. సిటీలోని నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు హత్యలు సంచలనంగా మారాయి. 2025, జనవరి 14వ తేదీ మధ్యాహ్నం ఈ ఘటన పోలీసుల దృష్టికి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మణికొండ మున్సిపాలిటీ పుప్పాల్ గూడ అనంత పద్మనాభ స్వామి దేవాలయం గుట్ట ఉంది. ఈ గుట్టపై ఓ అబ్బాయి, అమ్మాయి మృతదేహాలు ఉన్నాయి. బండ రాళ్లతో కొట్టిన ఆనవాళ్లు ఉన్నాయి. అమ్మాయి శరీరంపై దుస్తులు సైతం లేకపోవటం సంచలనంగా మారింది. అబ్బాయి ముఖం అంతా చిధ్రం అయిపోయింది. బండరాళ్లతో కొట్టి చంపినట్లు స్పాట్ చూస్తే తెలుస్తుంది అంటున్నారు పోలీసులు.
ALSO READ | కాలుతో తొక్కి చంపేశాడు.. ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య
గాలి పటాలు ఎగురవేసేందుకు గుట్టపైకి వెళ్లిన వాళ్లకు మృతదేహాలు కనిపించాయి. పోలీసులకు సమాచారం ఇవ్వటంతో వారు స్పాట్‌కు వచ్చారు. చనిపోయిన వాళ్లు ఎవరు అనేది ఇంకా వెల్లడి కాలేదు. అమ్మాయిని చంపి అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడా లేక ఇద్దరినీ ఎవరైనా చంపారా అనేది తెలియాల్సి ఉంది. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం స్పాట్‌కు చేరుకుని విచారణ చేస్తున్నారు. రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కేసు దర్యాప్తు జరుగుతుంది.
వీళ్లు ఎవరు.. ఎక్కడి వారు.. ఏ ప్రాంతం వారు.. ఏం చేస్తుంటారు.. వీరి కుటుంబ సభ్యులు ఎవరు అనే విషయాలను సేకరిస్తున్నారు పోలీసులు. ఆ గుట్టపైకి ఎందుకు వచ్చారు.. ఎలా చనిపోయారు అనేది ఇప్పటికైతే మిస్టరీగా మారింది. స్పాట్ సీన్ అత్యంత భయంకరంగా ఉందంటున్నారు స్థానికులు.