ప్లేట్ లెట్స్ కు డబుల్ రేట్

ప్లేట్ లెట్స్ కు డబుల్ రేట్

సిటీలోని ప్రైవేటు బ్లడ్ బ్యాంకుల్లో యూనిట్ 15 వేల నుంచి 20 వేలు

బ్లడ్ డోనర్లు ఉన్నా వేలల్లో వసూలు చేస్తున్న నిర్వాహకులు

ప్రభుత్వాస్పత్రుల్లో అందుబాటులో లేని సెల్ సపరేటర్ మెషీన్లు

కొన్ని​దవాఖానాల్లో ఉన్నా సిబ్బంది కొరత

ప్లేట్ లెట్స్ బయట తెచ్చుకోవాలంటున్న డాక్టర్లు

హైదరాబాద్, వెలుగు: ఒకవైపు కరోనా ట్రీట్ మెంట్ కు ప్రైవేటు హాస్పిటల్స్ లక్షలు వస్తూలు చేస్తుంటే.. మరోవైపు ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులు ప్లేట్ లెట్స్ ను డబుల్ రేట్లకు అమ్ముతున్నాయి. గ్రేటర్ లో డెంగ్యూ కేసులు నమోదవుతున్నా సర్కార్ పట్టించు కోవడంలేదు. ప్లేట్స్ లెట్స్ పడిపోయి ప్రభుత్వ దవాఖానాల్లో చేరిన పేషెంట్లకు అందుబాటులో ఉండడం లేదు. కొన్ని ఆస్పత్రుల్లో సెల్ సపరేటర్ మెషీన్లు లేకపోవడం, ఉన్న వాటిలో సిబ్బంది కొరత కారణంగా ప్లేట్ లెట్స్ తీయడం లేదు. దీంతో ఎమర్జెన్సీగా కావాలంటే ప్రైవేటు బ్లడ్ బ్యాంకులకు పంపిస్తున్నారు. సాధారణ ప్లేట్ లెట్స్ యూనిట్ కు రూ.600 , ఎస్ డీపీ అయితే రూ.11వేల లోపు తీసుకోవాలి. కానీ రెండితలు వసూలు చేస్తున్నారు. సర్కార్ దవాఖానాల పేషెంట్లకి తక్కువగానే తీసుకోవాల్సి ఉన్నా ఇస్టానుసారంగా అమ్ముతున్నారు. ప్రభుత్వాసు పత్రుల పరిసర ప్రాంతాల్లోని ప్రైవేటు బ్లడ్ బ్యాంకుల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. సిటీలో ప్రతి ఏటా డెంగీ కేసులు కేసులు పెరుగుతున్నప్పటికీ సర్కార్ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం లేదు. గతేడాది వేల సంఖ్యలో డెంగ్యూ కేసులు వచ్చాయి. అప్పట్లో హైకోర్టు సైతం ప్రభుత్వం పై సీరియస్ అయింది. అయినా ఈ ఏడాది ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

జిల్లాల నుంచి వస్తే అదే సీన్ రిపీట్

ప్లేట్ లెట్స్ తీసేందుకు సర్కార్ దవాఖానాలో సెల్ సపరేటర్ మె షీన్ ఉండాలి. ఈ మెషీన్లు జిల్లాల్లో ఎక్కడా అందుబాటులో లేవు. దీంతో సిటీలోని ప్రధాన ప్రభుత్వ దవాఖానాలకు డాక్టర్లు రెఫర్ చేస్తున్నారు. ఇక్కడైనా ఫ్రీ దొరుకుతాయని వచ్చిన పేషెంట్లకు అదే సీన్ ఎదురువుతుం ది. ప్లేట్ లెట్స్ అందుబాటులో లేవని వెం టనే తేవాలని పేషెంట్ బంధువులకు డాక్టర్లు చిటీ రాసిస్తున్నారు. వారు సిటీలోని బ్లడ్ బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. చివరకు ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ వేల రూపాయలు ఇచ్చి కొంటున్నారు. ఆర్థికంగా లేనివారు దేవుడిపై భారం వేసి ఆస్పత్రిలో ఉంటున్నారు. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు పట్టించు కోవడంలేదు.

మెషీన్ ఉన్నా లైసెన్స్ తీసుకోలే..

ఉస్మానియా హాస్పిటల్ కి డైలీ పదుల సంఖ్యలో డెంగ్యూ కేసులు వస్తున్నాయి. సెల్ సపరేటర్ మెషీన్ ఫెసిలిటీ అందుబాటులో ఉంది. దాన్ని ఏర్పాటు చేసి రెండు నెలలు అవుతుంది. కానీ డ్రగ్స్ కంట్రోల్ డిపార్ట్ మెంట్ లైసెన్స్ తీసుకోకపోవడంతో వృథాగానే ఉంది. ఇక్కడికి వచ్చే డెంగ్యూ పేషెంట్లు ప్రైవేటు బ్లడ్ బ్యాంకులకు పోయి ప్లేట్ లెట్స్ కొనుక్కొని వస్తున్నారు. సాధారణ ప్లేట్ లెట్స్ కి రూ.1200 తీసుకుంటున్నారు. నైట్ టైమ్ లో అయితే ఎక్కువగా వసూలు చేస్తున్నారు.

సిబ్బంది లేక రన్ చేయట్లే

నిలోఫర్ లో సెల్ సపరేటర్ మెషీన్ తో పాటు లైసెన్స్ కూడా ఉంది. సెల్ సపరేట్ చేసేందుకు సంబంధించిన కిట్లు ఉన్నాయి. పేషెంట్ల ప్రాబ్లమ్స్ ను మాత్రం తీర్చడం లేదు . ఎస్ డీపీ ప్లేట్ లెట్స్‌ కావాలంటే ప్రైవేటు బ్లడ్ బ్యాంకులకు పంపిస్తున్నారు. అదే ఎస్ డీపీ ప్లేట్ లెట్స్‌ దవాఖానలో తీస్తే పేషెంట్లకు ఫ్రీగా అందుతుంది. కానీ ఇక్కడ లేదని చెప్పడంతో రూ.15వేలు చెల్లించి బయట కొంటున్నారు.సిబ్బంది కొరతతోనే సెల్ సపరేటర్ మెషీన్ ను రన్ చేయలేకపోతున్నామని ఆస్పత్రి అధికారులు చెప్తున్నారు.

ఆస్పత్రి పరిసరాల్లోనే దందా..

ఎంఎన్ జే క్యాన్సర్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే పేషెంట్లకు దాదాపు 40శాతం మందికి ప్లేట్ లెట్స్ కావాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా సెల్ సపరేటర్ మెషీన్ వాడడం లేదు. సాధారణ బ్లడ్ మాత్రమే అందిస్తున్నారు. ప్లేట్ లెట్స్ కావాలంటే బయటకే పంపిస్తున్నారు. ఈ హాస్పిటల్ పరిసరాల్లోని ప్రైవేటు బ్లడ్ బ్యాంకుల్లో ప్లేట్ లెట్స్ దందా కొనసాగుతుంది. ఎస్ డీపీ ప్లేట్ లెట్స్ అయితే యూనిట్ కు రూ.15 నుంచి 20 వేల వరకు తీసుకుంటున్నారు.

అడిగితే బయట తెచ్చుకోమన్నారు

మా ఇంట్లో ఒకరికి డెంగ్యూ వచ్చింది. ప్రభుత్వ దవాఖానాకు వెళ్లి చూపించాం. ప్లేట్ లెట్స్ తగ్గాయని ఉస్మానియాకు రెఫర్ చేశారు. ఇక్కడకు వచ్చిన రోజు సాధారణ ప్లేట్ లెట్స్ రెండు యూనిట్లు తీసుకొచ్చి ఎక్కించాం. అయినా పెరగలేదు. ఎస్పీ ప్లేట్ లెట్స్ తీసుకురావాలని డాక్టర్లు చెప్పారు. ఉస్మానియా బ్లడ్ బ్యాంకులో అడిగితే అందుబాటులో లేవని చెప్పారు. ప్రైవేటులో అడిగితే రూ.15వేలు అడిగారు. తెలిసిన ఫ్రెండ్ ద్వారా ఓ బ్లడ్ బ్యాంకులో రూ.9వేలకు కొన్నాం.

– పులుమద్ది శ్రీనివాస్, పేషెంట్ బంధువు, వికారాబాద్ జిల్లా.