భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: రోడ్డు మంజూరై ఐదేండ్లైనా పూర్తి కాకపోవడంతో 15 గ్రామాల ప్రజలు తిప్పలు పడుతున్నారు. 2017లో 17 కిలోమీటర్ల రోడ్డును డబుల్ రోడ్గా మార్చేందుకు ప్రభుత్వం రూ.19.14 కోట్లు మంజూరు చేసింది. కాంట్రాక్టర్లు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు ప్రజాప్రతినిధులు పట్టించుకోక పోవడంతో ఏండ్ల తరబడి రోడ్డు పనులు జరుగుతూనే ఉన్నాయి. వెహికల్స్ దెబ్బతింటున్నాయని బండ్ల ఓనర్లు వాపోతుంటే కంకర రాళ్లపై నడవలేకపోతున్నామని ప్రజలు అంటున్నారు. కాంట్రాక్టర్లు మారుతున్నా రోడ్డు పనులు మాత్రం ముందుకు పడకపోవడంపై డం మారుమూల ప్రాంత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నాళ్లీ అవస్థలు..
కొత్తగూడెం–పాల్వంచ హైవే నుంచి రేగళ్ల క్రాస్ రోడ్డు, మైలారం మీదుగా బంగారు చెలక వరకు డబుల్ రోడ్ మంజూరైనట్లు ఐదేండ్ల కింద అధికారులు చెప్పడంతో ఆయా గ్రామాల ప్రజలు ఆనందపడ్డారు. బంగారు చెలక, మైలారం, రేగళ్ల, గట్టుమళ్ల, బావోజీ తండా, కొత్తూరు రేగళ్ల పెద్దతండా, దూదితండ, సూర్యాతండ, మునియతండా, పునుకుడు చెలక, బొజ్జలగూడెం, కొత్త చింతకుంట, పాతచింతకుంట, లక్ష్మీపురం తదితర గ్రామాల ప్రజలు ఈ రోడ్డు పూర్తయితే ఇబ్బందులు దూరం అవుతాయని భావించారు. అయితే 2017లో ప్రారంభించిన పనులు తొమ్మిది నెలల్లో పూర్తి కావాల్సి ఉండగా, ఐదేండ్లయినా పూర్తి కావడం లేదు. సగం సగం పనులతో ప్రజలు ఇబ్బందులు పడ్తున్నారు. కంకర పోసి బీటీ వేయకపోవడంతో ఆ రోడ్డుపై నడవలేక పోతున్నామని వాపోతున్నారు. వర్షం పడితే గుంతల్లో నీళ్లు చేరి ఇబ్బందులు పడుతుండగా, మిగిలిన సమయాల్లో దుమ్ముతో తిప్పలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా వేసిన రోడ్డు పలు చోట్ల గుంతలు పడడం, దెబ్బతినడంతో తిరిగి పనులు చేయాల్సి వస్తోంది. నాణ్యత లేకపోవడంతో కొద్ది రోజులకే రోడ్డు దెబ్బతింటుందని ఆరోపిస్తున్నారు. కాంట్రాక్టర్లు మారడం, ఫారెస్ట్ క్లియరెన్స్ సమయానికి రాకపోవడం, తరుచూ వర్షాలు పడుతుండడంతో పనులు ఆలస్యమయ్యాయని ఆర్అండ్బీ అధికారులు అంటున్నారు. ఒకటి రెండు నెలల్లో పనులు పూర్తి చేస్తామని చెబుతున్నారు.
తిప్పలు పడుతున్నాం..
ఏండ్ల తరబడి పనులు చేస్తున్నరు. సగం సగం పనులతో తిప్పలు పడుతున్నాం. రోడ్డు సరిగా లేక బస్సులు నడవడం లేదు. ఆటోలే దిక్కవుతున్నాయి. అవి లేకపోతే నడిచిపోవాలి. వెంటనే పనులు పూర్తి చేయాలి.
- రూప్లాలాల్, పెద్దతండా