
ఢిల్లీ: కార్గో, ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్ల రాకపోకల కోసం కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలోని (చిత్తూరు, తిరుపతి) మీదుగా తమిళనాడు (వెల్లూరు) వరకు వెళ్లే రైల్వే లైన్‌లో మరో అదనపు రైల్వే లైన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం రూ.1,332 కోట్లు ఖర్చు చేయనుంది. ఇవాళ జరిగిన కేబినెట్ సమావేశంలోని నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.
తిరుపతి, -పాకాల, కాట్పడి మధ్య 104 కిలోమీటర్ల రైల్వే లైన్ డబ్లింగ్‌కు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా రైల్వే శాఖ రూ.1,332 కోట్ల ఖర్చుతో డబ్లింగ్ చేయనుంది. తద్వారా 400 గ్రామాలు,14 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. తిరుపతికి కనెక్టివిటీ పెరగనుంది. 4 మిలియన్ టన్నుల సరుకు రవాణా ఏడాదికి పెరిగే అవకాశం ఉంది. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో నేరుగా 35 లక్షల పని దినాలతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలగనున్నాయి’ అని అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.
అలాగే పీఎంకేఎస్‌వైలో కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అండ్ వాటర్ మేనేజ్మెంట్ పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. 2025-, 26 సంవత్సరానికి గాను కమాండ్ ఏరియా అభివృద్ధికి కేంద్రం రూ.1,600 కోట్లు ఖర్చు చేయనుంది. అలాగే పంజాబ్, హర్యానాలలో హైబ్రిడ్ యాన్యుటీ పద్ధతిలో రూ.1,878.31 కోట్ల విలువైన 19.2 కి.మీ పొడవుతో 6 లేన్ల యాక్సెస్ కంట్రోల్డ్ జిరాక్‌పూర్ బైపాస్ నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.