కరోనా సోకినోళ్లకు 3 ఫీట్ల దూరముండాలె
బయట 2 గంటల నుంచి 9 రోజులు వైరస్ బతుకుతది
చర్మం ద్వారా సోకదు.. వేడి చేసినా బతకదు
కరోనా సోకిన వ్యక్తిని గుర్తుపట్టడం కష్టం
కొవిడ్ 19పై ప్రశ్నలకు ఎక్స్‌పర్ట్స్ జవాబులు
మనిషి వెంట్రుక మందంలో 900వ వంతుండే అతి చిన్న కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. దేశాదేశాలకు అతి వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటివరకు 82 దేశాలకు అంటింది. వైరస్ కొత్తది కాబట్టి ఎట్ల వ్యాపిస్తోందో నిపుణులకు ప్రస్తుతానికి కొంతే తెలుసు. ఆ కొంతలోనే అది ఎట్ల వస్తదో, ఎట్ల రాదో కొంతవరకు చెబుతున్నరు.
ఏంటీ వైరల్ డ్రాప్‌లెట్స్?
వైరస్ ఉన్న తుంపర్లే వైరల్ డ్రాప్‌లెట్స్. సింగిల్‌గా ఉండే వైరస్ ఎటూ పోలేదు. దేన్నయినా అంటుకొని పోవాలె. అందుకే లాలాజలం, శ్లేష్మం డ్రాప్స్‌ను అంటుకుంటది. మనం దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, మాట్లాడినప్పుడు బయటకొస్తది. మన శరీరంలోకి పోవాలంటే కచ్చితంగా కండ్లు, ముక్కు, నోరే దారి. పక్కనున్నోళ్లు ఏం తిన్నరో మీరు స్మెల్ చేస్తున్నట్టయితే వాళ్లేం పీల్చుకొని వదులుతున్నరో అది మీరు పీల్చుతున్నరని అర్థం. వైరస్‌తో సహా.
ఓ దుకాణానికి పోయిన.. ఓనర్‌కు కరోనా ఉంది. నాకేమైనా వస్తదా?
కరోనా సోకిన వ్యక్తితో ఎంత సేపు మాట్లాడారు, ఎంత దూరంలో ఉన్నారు, ఆయన మాట్లాడుతన్నపుడు మీమీదేమైనా వైరల్ డ్రాప్‌లెట్స్ (వైరస్ ఉన్న తుంపర్లు) పడ్డాయా, మీ ముఖాన్ని మీరు ఎన్నిసార్లు తాకారు తదితర అంశాలపై ఇది ఆధారపడి ఉంటుంది. మీ వయసు, మీ హెల్త్ కండీషన్ కూడా లెక్కలోకి తీసుకోవాలి.
వ్యాధి ఉన్న వ్యక్తికి ఎంత దగ్గరుంటే ప్రాబ్లమ్?
మూడు ఫీట్ల దూరముండటం బెటరని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. 6 ఫీట్లలోపుంటే ప్రాబ్లమని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ చెప్పింది.
ఇన్ఫెక్టెడ్ పర్సన్ దగ్గర ఎంతసేపుంటే రిస్క్?
ఇప్పటివరకైతే కచ్చితంగా తెలియదు. కానీ ఎంత ఎక్కువసేపుంటే అంత ఎక్కువ రిస్క్.
బ్రాండెడ్ సబ్బునే వాడాలా?
అవసరం లేదు.
మా ఇంటి పక్కనున్నతను దగ్గుతున్నడు. నా పరిస్థితేంటి?
గోడలు, గ్లాసులను దాటి వైరస్ వెళ్లినట్టు ఇప్పటివరకు ఆధారాల్లేవు. బహిరంగ ప్రదేశమైతే భయపడాల్సిన అవసరముంది. ఆయన తుమ్మినప్పుడు రెయిలింగ్ మీద తుంపర్లు పడితే, ఆ రెయిలింగ్‌ను మీరు తాకితే వైరస్ సోకే చాన్స్ ఎక్కువ.
సెక్స్ చేస్తే వస్తదా?
ముద్దిస్తే తప్పనిసరిగా వస్తుంది. సెక్స్ ద్వారా వైరస్ సోకిన దాఖలాలయితే ప్రస్తుతానికి లేవు. దీనిపై డబ్ల్యూహెచ్‌వో క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
వైరస్ సోకిన వ్యక్తి ఫుడ్ సర్వ్ చేస్తే?
వైరస్ సోకిన వ్యక్తి ఫుడ్ సర్వ్ చేస్తుంటే వచ్చే చాన్స్ ఉంది. అతను ఫుడ్ రెడీ చేస్తుంటే వచ్చే చాన్స్ తక్కువ. ఎందుకంటే వేడి చేస్తే వైరస్ బతకలేదు.
బస్ పోల్, టచ్ స్క్రీన్‌లపై వైరస్ ఉంటదా?
కచ్చితంగా. హాంగ్‌కాంగ్‌లోని బుద్ధిస్ట్ టెంపుల్‌కు వెళ్లిన వాళ్లలో చాలా మంది వెంటనే వ్యాధిబారిన పడ్డారు. దీంతో అక్కడ బుద్ధునికి సంబంధించి గ్రంథాలు, రెస్ట్‌రూమ్ గొట్టాలపై చెక్ చేయగా వైరస్ ఉన్నట్టు వెల్లడైంది. మెటల్స్, ప్లాస్టిక్, గ్లాస్‌పై రెండు గంటల నుంచి 9 రోజుల వరకు వైరస్ బతికి ఉన్నట్టు ఓ స్టడీలో తెలిసింది. అది క్లీన్‌గా ఉన్న ప్రాంతమా, డర్టీగా ఉందా సంబంధం లేదు. వైరస్ సోకిన వ్యక్తి తుమ్మినప్పుడు ఏదైనా ఉపరితలంపై వైరస్ డ్రాప్‌లెట్ పడటం.. ఆరోగ్యకరమైన వ్యక్తి దాన్ని తాకడం జరిగితే ఆయనకు వైరస్ అంటినట్టే లెక్క. అతనికి వ్యాధి రావడానికి ఎంత శాతం వైరస్‌లు అవసరమో మాత్రం తెలియదు.
కరోనా సోకిన వ్యక్తిని గుర్తుపట్టొచ్చా?
కష్టమే. ఎందుకంటే వైరస్ సోకిన వ్యక్తి బాగానే ఉన్నట్టు కనిపిస్తుంది. పైకి మామూలు వ్యక్తిలాగానే ఉంటాడు. పైగా వైరస్ ఎవరి నుంచి బాగా వ్యాపిస్తుందో కూడా చెప్పడం కష్టం. ప్రస్తుత పరిస్థితిని చూస్తే వ్యాధి లక్షణాలు బయటకు కనిపించనోళ్లు కూడా వైరస్‌ను ఇతరులకు అంటించినట్టు తెలుస్తోంది. డబ్ల్యూహెచ్‌వో మాత్రం ఇతరులకు వ్యాధి అంటించే టైంలో వైరస్ ఉన్నోళ్లు కచ్చితంగా అనారోగ్యంతోనే ఉండి ఉంటారని చెబుతోంది.
వైరస్‌ను నాశనం చేయొచ్చా?
కరోనా వైరస్‌ను నాశనం చేయడం చాలా ఈజీ. మామూలు క్రిమిసంహారకాలను వాడినా కూడా వైరస్‌పై ఉండే సున్నితమైన పొర నాశనమైపోద్ది. మీ ముఖాన్ని తాకే ముందు శానిటైజర్‌తో చేయి కడుక్కుంటే చాలా వరకు మీకే ప్రాబ్లమ్ ఉండదు. చర్మం నుంచి వైరస్ సోకదు. మీరు ఆర్డర్ చేసిన వస్తువు కవర్‌పై వ్యాధి ఉన్న వ్యక్తి తుమ్మితే మీకు వైరసొస్తదని భయం లేదు. క్రిమిసంహారాకాలు వాడితే చాలా వరకు వైరస్ నాశనమవుతుంది.
For More News..