మైనార్టీలకు లక్ష సాయంపై అస్పష్టత... కొత్త అప్లికేషన్లపై నో క్లారిటీ ?

  • ఓపెన్​ కాని ఓబీఎంఎంఎస్​ పోర్టల్​ 
  • గతేడాది దరఖాస్తుల నుంచి తీసుకుంటామని గైడ్​లైన్స్​
  • కొత్త దరఖాస్తులకు అవకాశమివ్వాలంటున్న ముస్లింలు 

ఖమ్మం, వెలుగు:  రాష్ట్రంలోని మైనార్టీలకు రూ.లక్ష సాయం స్కీమ్​పై లబ్ధిదారులు పలు సందేహాలు, అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మైనార్టీలందరికీ పథకాన్ని వర్తింపజేస్తామని సీఎం, మంత్రులు సహా లీడర్లు మాటల్లో చెబుతున్న దానికి, ఆచరణకు పొంతన కనిపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బీసీల్లోని కొన్ని కులవృత్తుల వారికి రూ.లక్ష సాయం చేసిన తరహాలోనే రాష్ట్రంలోని మైనార్టీలకూ పథకాన్ని వర్తింపజేస్తూ ఈనెల 23న ప్రభుత్వం జీవో నెం.78 రిలీజ్​ చేసింది. కొత్తగా క్రిస్టియన్ల నుంచి దరఖాస్తులను తీసుకొని, వాటిని రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీస్ ​ఫైనాన్స్​కార్పొరేషన్​ద్వారా​పరిశీలిస్తారని స్పష్టతనిచ్చింది. 

ఇతర మైనార్టీల నుంచి 2022, 23 ఆర్థిక సంవత్సరానికి లోన్ల మంజూరు కోసం ఓబీఎంఎంఎస్​ పోర్టల్​ (తెలంగాణ స్టేట్ఆన్​లైన్​బెనిఫిషరీ మేనేజ్​మెంట్ అండ్​మానిటరింగ్ సిస్టమ్) ద్వారా దరఖాస్తులు తీసుకున్నామని, అందులో పెండింగ్ ఉన్న అప్లికేషన్ల నుంచి అర్హులైన లబ్ధిదారులకు 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.లక్ష సాయం పథకాన్ని వర్తింపజేస్తామని గైడ్​ లైన్స్ లో ప్రకటించింది. వాటిని రాష్ట్ర మైనార్టీస్​ఫైనాన్స్​కార్పొరేషన్​ ద్వారా ప్రాసెస్ చేస్తామని వివరించింది. 
మరోవైపు లక్ష సాయం కోసం క్రిస్టియన్లు దరఖాస్తు చేసుకునేందుకు అధికారులు అవకాశం కల్పిస్తున్నారు. ఈ నెల 31 నుంచి ఆగస్టు14 వరకు ఓబీఎంఎంఎస్ పోర్టల్ (www.tsobmms.gov.in) లో దరఖాస్తు చేసుకోవాలని చెబుతున్నారు.

విమర్శిస్తున్న ముస్లిం సంఘాలు

జీవో 78లో ఉన్న గైడ్ లైన్స్​ప్రకారం కేవలం క్రిస్టియన్ల నుంచి మాత్రమే కొత్త దరఖాస్తులు తీసుకుంటామని క్లారిటీ ఉన్నా, ఇతర మైనార్టీలకు సంబంధించి కొత్త అప్లికేషన్ల స్వీకరణపై ఎలాంటి స్పష్టత లేదు. ఓబీఎంఎంఎస్​ ద్వారా 2022–23 సంవత్సరానికి స్వయం ఉపాధి పథకాలకు సంబంధించి మైనార్టీ రుణాల కోసం ఈ ఏడాది జనవరిలో 2.16లక్షల అప్లికేషన్లు వచ్చాయి. దాదాపు మొత్తం అప్లికేషన్లు పెండింగ్ లోనే ఉండడంతోనే అందులోనే అర్హులైన మైనార్టీలకు రూ.లక్ష సాయం అందిస్తామని జీవో నంబర్​78లో పేర్కొన్నారు. కానీ, మైనార్టీల నుంచి కొత్త దరఖాస్తులు తీసుకుంటామని ఎక్కడా చెప్పలేదు. 

దీంతో ముస్లిం మైనార్టీ నేతల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కొత్తగా అప్లై చేసుకోవాలనుకునే వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఎప్పటి నుంచి కొత్త అప్లికేషన్లు తీసుకుంటారని, ఆఖరు తేదీ ఎప్పుడనే విషయంలో జీవోలో స్పష్టత లేదని మండిపడుతున్నారు. జిల్లాలో ఉన్న మైనార్టీ వెల్ఫేర్​ఆఫీసర్ల నుంచి కూడా ఎలాంటి సమాచారం రాకపోవడంతో అసహనానికి గురవుతున్నారు. ఇదిలా ఉండగా ఓబీఎంఎంఎస్ పోర్టల్​లో మైనార్టీస్​ ఫైనాన్స్​ కార్పొరేషన్, క్రిస్టియన్​మైనార్టీస్​ఫైనాన్స్​ కార్పొరేషన్లకు సంబంధించి కొత్త దరఖాస్తుల స్వీకరణ ట్యాబ్ ఓపెన్ ​కావడం లేదు. బీసీ ఫెడరేషన్లకు మాత్రమే అవకాశముంది. 

 గైడ్​లైన్స్​లో ఇలా..

ప్రభుత్వం ప్రస్తుతం ఇచ్చిన గైడ్​లైన్స్​ ప్రకారం రూ.లక్ష సాయం దరఖాస్తుదారుల వ్యక్తిగత వయోపరిమితి ఈ ఏడాది జూన్2 నాటికి 21 నుంచి 55 ఏండ్లలోపు మాత్రమే ఉండాలి. వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లోని వారికైతే రూ.1.50లక్షలు, పట్టణ ప్రాంతాలకు చెందిన వారికి రూ.2లక్షలు ఉండాలి. ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే స్కీమ్​ వర్తింపజేస్తారు. జిల్లా ఇన్​చార్జి మంత్రి ఆమోదంతో, కలెక్టర్​నేతృత్వంలోని జిల్లాస్థాయి మానిటరింగ్​కమిటీ ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని జీవోలో సూచించింది. ఎంపిక జాబితాను టీఎస్ఎంఎఫ్​సీ  వెబ్​సైట్​లో ప్రదర్శించాలని, వన్​టైం గ్రాంట్​గా సబ్సిడీ విడుదల చేయనున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.  

ముస్లింల నుంచి కొత్త అప్లికేషన్లు తీసుకోవాలి

రూ.లక్ష సాయం స్కీమ్ లబ్ధిదారుల ఎంపిక కోసం ముస్లిం మైనార్టీల నుంచి కొత్త దరఖాస్తులు తీసుకోవాలి. కేవలం గతేడాది రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి నుంచి లబ్ధిదారులను ఎంపిక చేస్తామని చెప్పడం దారుణం. రాష్ట్రంలో ఉన్న ముస్లిం మైనార్టీలు అందరికీ రూ.లక్ష స్కీమ్​ వర్తింపజేయాలి.

యాకూబ్ పాషా, మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా