సీఎంఆర్ కుంభకోణంపై అంతా సైలెన్స్!

సీఎంఆర్  కుంభకోణంపై అంతా సైలెన్స్!
  • రూ.20 కోట్లలో ఒక్క రూపాయి వసూలు చేయలే
  • కేసులు పెట్టి చేతులు దులిపేసుకున్న ఆఫీసర్లు

గద్వాల, వెలుగు : సీఎంఆర్  కుంభకోణంపై అంతా సైలెన్స్​గా ఉండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2021–22 ఖరీఫ్ కు సంబంధించి రూ.20 కోట్లకు పైగా సీఎంఆర్  కుంభకోణం జరిగి మూడేండ్లు గడిచింది. అయితే ఈ వ్యవహారంలో ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా రికవరీ చేయలేదు. కేవలం ఆ మిల్లర్లపై ఆఫీసర్లు కేసులు పెట్టి చేతులు దులుపుతున్నారనే విమర్శలున్నాయి. మూడేండ్ల కింద మిల్లర్లు సీఎంఆర్  అప్పగించాల్సి ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఇవ్వలేదు. 2021–-22 ఖరీఫ్  సీజన్ కు సంబంధించి అయిజలోని అన్నపూర్ణ రైస్ మిల్ 17,400 క్వింటాళ్లకు గాను, 580 క్వింటాళ్లు ఇచ్చారు.

గద్వాల మండలం కాకులారంలోని శ్రీ కృష్ణ రైస్ మిల్  8,140 క్వింటాళ్లకు గాను, 580 క్వింటాళ్లు, శాంతినగర్ లోని సూర్య రైస్ మిల్  10,730 క్వింటాళ్లకు గాను, 2,480 క్వింటాళ్లు మాత్రమే ఇచ్చారు. బాయిల్డ్  రైస్  మిల్లు విభాగంలో వెంకటేశ్వర రైస్ మిల్ 33,350 క్వింటాళ్లకు గాను, 7,250 క్వింటాళ్లు మాత్రమే అప్పగించారని,  మిగిలిన వడ్లను అమ్ముకున్నారని అప్పటి డీఎం ప్రసాద్ రావు ఆయా పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్  చేశారు. రికవరీ ఎలాగనే విషయంపై ఇప్పటివరకు ఆఫీసర్లకు క్లారిటీ లేకుండా పోయింది.

రైస్ మిల్లులను సీజ్  చేద్దామంటే ఓనర్లు వేరే వారు కావడం, లీజ్  గడువు తీరిపోవడంతో వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేని పరిస్థితి ఉంది. ఆర్ఆర్  యాక్ట్  ద్వారా ఆస్తులు జప్తు చేసి అమ్మినా సీఎంఆర్ లో సగం డబ్బులు కూడా రావని తెలుస్తోంది.

55 మిల్లులకు వడ్లు..

గద్వాల జిల్లాలో 50 రా రైస్ మిల్లులకు, 5 బాయిల్డ్  రైస్  మిల్లులకు సివిల్  సప్లై ఆఫీసర్లు వడ్లను ఇచ్చారు. 2021–22 యాసంగికి సంబంధించి 19,106 మెట్రిక్  టన్నులకు గాను, 10,491 టన్నులు పెట్టారు. ఇంకా 4 వేల మెట్రిక్ టన్నులు పెట్టాల్సి ఉంది. 2022–23 ఖరీఫ్ కు సంబంధించి 800 మెట్రిక్  టన్నులు సీఎంఆర్ ​మార్చి వరకే ఇవ్వాల్సి ఉండగా, కొన్ని రైస్  మిల్లులు ఇంకా ఇవ్వలేదు. దీంతో వారికి సెప్టెంబర్  వరకు గడువు ఇచ్చారు. గడువు పెంచినా పెండింగ్  సీఎంఆర్​ అప్పజెప్పడం కష్టమేనని అంటున్నారు.

ఆఫీసర్లపై అనుమానాలు..

మూడేండ్లుగా కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడినా, ఎలాంటి రికవరీ చేయకపోవడంపై సివిల్  సప్లై ఆఫీసర్లపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసులు నమోదు చేసి చేతులు దులుపుకున్నారనే విమర్శలు వస్తున్నాయి. పక్క జిల్లాల్లో అక్రమాలకు పాల్పడ్డ మిల్లర్లను అరెస్ట్​ చేయడంతో పాటు ఆర్ఆర్  యాక్ట్  కింద ఆస్తులను జప్తు చేయడం వంటి చర్యలు తీసుకున్నారు. కానీ, జోగులాంబ గద్వాల జిల్లాలో ఇప్పటివరకు ఆ ఊసెత్తకపోవడంతో పోలీస్, రెవెన్యూ, సివిల్  సప్లై  ఆఫీసర్లపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఫిర్యాదు చేసినా పోలీసులు వారిని అరెస్ట్​ చేయకపోవడం, ఆర్ఆర్  యాక్ట్​ అమలు చేయాలని రెవెన్యూ ఆఫీసర్లకు లెటర్ రాసినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు. రైస్  మిల్లులను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి డీటీలు రిపోర్ట్  ఇవ్వాల్సి ఉన్నా పట్టించుకోలేదని అంటున్నారు. మిల్లుల్లో వడ్లు ఉన్నట్లు తప్పుడు రిపోర్ట్  ఇచ్చిన డీటీలపై చర్యలు తీసుకోలేదనే విమర్శలున్నాయి. ఆఫీసర్లు మిల్లర్ల నుంచి ముడుపులు తీసుకొని సహకరించారనే ఆరోపణలున్నాయి.

పక్కా ప్లాన్ తో..

పక్కా ప్లాన్ తో వడ్లను అమ్ముకొని రైస్  మిల్లర్లు రూ.20 కోట్ల కుంభకోణానికి తెరలేపినట్లు తెలుస్తోంది. సివిల్  సప్లై శాఖలో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకొని కొందరు రైస్  మిల్లర్లు, ఆఫీసర్లు రైస్  మిల్లు లేకున్నా, లీజు డాక్యుమెంట్లు పెట్టుకొని రూ. కోట్ల వడ్లకు పర్మిషన్  ఇచ్చారనే ఆరోపణలున్నాయి. తీసుకున్న వడ్లకు సంబంధించిన బియ్యం అప్పగించకుండా, వడ్లను అమ్ముకొని రియల్  ఎస్టేట్  బిజినెస్ లో పెట్టుబడులు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లాలోని  8 రైస్  మిల్లులు రూ.20 కోట్ల బియ్యం బాకీ పడ్డారు.

ప్రాసెస్  ప్రోగ్రెస్ లో ఉంది..

సీఎంఆర్​ బియ్యం పెట్టని రైస్  మిల్లర్లపై త్వరలోనే చర్యలు తీసుకుంటాం. ఆర్ఆర్​ యాక్ట్​ కింద ఆస్తులు గుర్తించాలని తహసీల్దార్లకు లెటర్  రాశాం. ఎన్నికల కోడ్  ముగిసిన వెంటనే ఈ వ్యవహారంపై దృష్టి పెడతాం.
-
 విమల, డీఎం, సివిల్  సప్లై