హక్కుదారులా.. ? ఆక్రమణదారులా..?

  • భూదాన్ భూముల్లో ఇండ్లపై అనుమానాలు
  • భూ ఆక్రమణకు ప్రయత్నమన్న కలెక్టర్
  • కొందరికి డబ్బులిచ్చామంటున్న బాధితులు
  • సెల్ఫ్​డిక్లరేషన్​ ఇవ్వాలన్న పోలీసులు
  • ఇతర ప్రాంతాలవారే ఎక్కువ అంటున్న ఆఫీసర్లు

ఖమ్మం/ఖమ్మం టౌన్, వెలుగు:  ఖమ్మం అర్బన్ మండలంలోని వెలుగుమట్లలో ఉన్న భూదాన్​భూముల్లో ఇండ్లు, గుడిసెలు నిర్మించేందుకు కొందరు ప్రయత్నం చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శనివారం రెవెన్యూ ఆఫీసర్లు, పోలీసుల సపోర్టుతో గుడిసెలను తొలగించినా వాళ్లు పట్టాలున్న బాధితులా, లేక కొందరి మాటలను నమ్మి మోసపోయిన వారా అనే చర్చ మొదలైంది. వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలోని147,148,149 సర్వే నెంబర్ల పరిధిలో 62.7 ఎకరాల భూదాన్​భూమి ఉంది. గుడిసెలు వేసేందుకు దాదాపు300 మంది రాగా, అందులో కొందరి దగ్గర మాత్రమే2014లో భూదాన్ బోర్డు ఇచ్చిన పట్టాలున్నాయని తెలుస్తోంది. మిగిలినవారికి పట్టాలు కాని, ఆధారాలు కాని లేవని రెవెన్యూ ఆఫీసర్లు చెబుతున్నారు. రఘునాథపాలెం, కామేపల్లి మండలాలకు చెందిన కొందరు వ్యక్తులు ఇండ్ల స్థలాలిప్పిస్తామంటూ ఒక్కొక్కరి నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్టు సమాచారం. ప్లాట్లు ఇప్పిస్తామని, కోర్టు ఖర్చులు, ల్యాండ్ చదును చేసేందుకు, డెవలప్ మెంట్ ల పేర అని చెబుతూ ఒక్కొక్కరి నుంచి రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు తీసుకున్నట్టు తెలుస్తోంది. డబ్బులిచ్చినవారు ఒత్తిడి చేస్తుండడం, భూదాన్ పట్టాల ఇష్యూ కోర్టులో ఉండడంతో ఇండ్ల పేరుతో కావాలనే హడావుడి చేశారని పోలీసులు, రెవెన్యూ ఆఫీసర్లు అనుమానిస్తున్నారు.

ఆక్రమణలను సహించేది లేదన్న కలెక్టర్​ 

వెలుగుమట్ల భూదాన్ భూముల ఆక్రమణలు సహించేది లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్​వీపీ గౌతమ్ శనివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. సర్వే నెంబర్147,148,149లలో భూదాన్ భూములు ఉన్నాయని, ఒకరిద్దరు దళారులు అమాయక పేద ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి, వారిని భూదాన్, పరిసర పట్టా భూముల ఆక్రమణకు ఉసిగోల్పుతున్నట్లు గుర్తించినట్లు కలెక్టర్ వెల్లడించారు. దళారులు ఒక్కొక్కరి నుంచి రూ.40 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. ఖమ్మం నుంచే కాక సూర్యాపేట, తల్లాడ తదితర ప్రాంతాలకు చెందిన ప్రజలతో భూఆక్రమణలు చేయిస్తున్నట్లు ఆయన తెలిపారు. శనివారం భూ ఆక్రమణ చేసి, 300 షెడ్లు వేయగా, అన్నింటిని కూల్చివేసినట్లు తెలిపారు. ప్రజలెవ్వరు దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని, భూ ఆక్రమణలపై కఠిన చర్యలు ఉంటాయని, భూ ఆక్రమణదారులు, ప్రోత్సహించిన వారిపై భూ ఆక్రమణ, క్రిమినల్ కేసులతో పాటు పీడీ యాక్ట్ నమోదు చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు.

బాధితులు, వ్యాపారులు కూడా..

వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలో 2వేల మందికి 2014లోనే భూదాన్​బోర్డు పట్టాలు ఇచ్చిందని బాధితుల తరపున కొందరు చెబుతున్నారు. వారిలో కొందరు146 సర్వే నెంబర్ పరిధిలో దాదాపు 6 ఎకరాల్లో పక్కా ఇండ్లు నిర్మించుకుని ఉంటున్నారని, మిగిలినవారు అప్పట్లో భూమి స్వాధీనం చేసుకోకపోవడంతో ఇప్పుడు ఇండ్లు కట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. అయితే విషయం కోర్టులో పెండింగ్ ఉందని పోలీస్, రెవెన్యూ ఆఫీసర్లు అంటున్నారు. ఈ జాగాల కోసం తాము కొందరికి డబ్బులిచ్చినట్టు పలువురు గుడిసెలు తొలగించేందుకు వచ్చిన పోలీసులకు చెప్పారు. ఎవరెవరికి ఎంత ముట్టజెప్పారో సెల్ఫ్​డిక్లరేషన్ ఇస్తే మీ డబ్బులు మీకిప్పిస్తామని అడిషనల్​ డీసీపీ సుభాష్ చంద్రబోస్​ తెలిపారు. శనివారం వచ్చిన వారిలో స్థానికులు కొందరే ఉన్నారని, తిమ్మరావుపేట, జూలూరుపాడు, మద్దులపల్లి, బురదరాఘవపురం, ఇల్లందు, కోదాడ నుంచి కూడా చాలా మంది వచ్చారని పోలీసులు చెబుతున్నారు. ఈ భూమిలో తమ ప్లాట్లు ఉన్నాయంటూ కొందరు ప్రైవేట్ వ్యక్తులు, ఖమ్మం నగరానికి చెందిన బడా వ్యాపారులు కూడా శనివారం అక్కడికి వచ్చారు.1996లోనే ప్రైవేట్ వెంచర్ లో తాము ప్లాట్లు కొన్నామని వారు చెబుతున్నారు. ఇండ్ల తొలగింపు సమయంలో ప్రైవేట్ వ్యక్తులు కూడా అత్యుత్సాహం చూపించారు. తమ ప్లాట్లు అంటూ కొందరు కర్రలతో ఓవరాక్షన్​చేశారు.