పట్టణాల్లో కుల గణన సర్వేపై అనుమానాలు

పట్టణాల్లో కుల గణన సర్వేపై అనుమానాలు

హైదరాబాద్: 2021లో జనాభా లెక్కలు నిర్వహించాల్సి ఉన్నా.. కరోనా కారణంగా చేయలేదు. దీంతో ప్రభుత్వం దగ్గర పూర్తిస్థాయి జనాభా లెక్కలుగానీ, కులాలవారీ వివరాలుగానీ అందుబాటులో లేవు. తెలంగాణ ఏర్పడిన కొత్తలో అప్పటి బీఆర్ఎస్​ సర్కారు సమగ్ర కుటుంబ సర్వే చేపట్టినప్పటికీ.. ఆ వివరాలు​ బయటపెట్టలేదు. దీంతో తాము అధికారంలోకి వస్తే సమగ్ర కులగణన చేసి, లోకల్​బాడీల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతామని 2023 ఎన్నికల ముందు కాంగ్రెస్​హామీ ఇచ్చింది. ఈ క్రమంలోనే నిరుడు సెప్టెంబర్ 6న​నిరంజన్​చైర్మన్‏గా నలుగురు సభ్యులతో రాష్ట్ర ప్రభుత్వం బీసీ కమిషన్‎ను ఏర్పాటుచేసింది.

తర్వాత హైకోర్టు జోక్యంతో నవంబర్ 3న రిటైర్డ్ ఐఏఎస్ బూసాని వెంకటేశ్వర్ రావు చైర్మన్‎గా, బీసీ గురుకుల సెక్రటరీ సైదులును సెక్రటరీగా బీసీ డెడికేటెడ్​ కమిషన్‎ను నియమించింది. నవంబర్​ 6 నుంచి డిసెంబర్​10 వరకు ప్లానింగ్​ కమిషన్ ఆధ్వర్యంలో  ‘సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే-2024’ పేరుతో సమగ్ర కులగణన సర్వే నిర్వహించారు. గ్రామీణ ప్రజలు ఈ సర్వేలో  ఉత్సాహంగా పాల్గొన్నప్పటికీ పట్టణాల్లో, ముఖ్యంగా జీహెచ్​ఎంసీలో పబ్లిక్​ సహకరించలేదని, చాలా మంది వివరాలు ఇవ్వలేదని, ఎన్యూమరేటర్లపైకి కుక్కలను ఉసిగొల్పారని స్వయంగా పలువురు ఉన్నతాధికారులు, మంత్రులు చెప్పారు. 

సీఎం రేవంత్​ రెడ్డి సైతం సర్వేలో పాల్గొనని పలువురు ప్రముఖులపై అసహనం వ్యక్తంచేశారు. అదీగాక జీవనోపాధి కోసం పల్లెల నుంచి నగరాలకు వచ్చి, అద్దె ఇండ్లలో ఉంటున్నవారిని సర్వే టీమ్‎లు కనీసం పలకరించలేదనే విమర్శలు వచ్చాయి. ఇందుకు తగ్గట్లే అసలు కులగణన సిబ్బంది తమ ఇండ్ల వైపు కన్నెత్తిచూడలేదని పలుచోట్ల పబ్లిక్​ఆరోపించారు. పోనీ ఇలాంటి వారు తమ గ్రామాలకైనా వెళ్లి కుటుంబ వివరాలు ఇచ్చారా? అంటే అదీ లేదు. ఇలా ఏరకంగా చూసినా సర్వే అసమగ్రంగా జరిగిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.