- మాయం చేసిన గన్నీ బ్యాగుల లెక్క తప్పించేందుకేనా?
వనపర్తి/పెబ్బేరు, వెలుగు : పెబ్బేరు మార్కెట్ యార్డ్ గోదామ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంపై అనుమానాలు ఇంకా వీడడం లేదు. 60 గంటలు గడిచినా అంటుకున్న అగ్గి పూర్తిగా చల్లారలేదు. ఘటనపై రోజుకో విషయం తెరపైకి వస్తోంది. ధాన్యం లెక్కలు ప్రభుత్వానికి చెప్పాల్సి వస్తుందనే ఉద్దేశంతో ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని ఒకవైపు, ధాన్యం పాడై ఉంటే ఇన్సూరెన్స్ వస్తుందనే ఆశతో ఈ నాటకానికి తెర లేపారేమోననే అనుమానాలు మరోవైపు వ్యక్తమవుతున్నాయి. లేదంటే ఎవరైనా సిగరెట్, బీడీ తాగి వీటిపై విసిరేసి ప్రమాదానికి కారణమయ్యారా? అనే అనుమానాలున్నాయి.
కొద్ది రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన వడ్ల కొనుగోళ్ల విషయంలో రైస్ మిల్లర్లపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈ ఘటన జరగడం అనుమానాలకు బలం చేకూర్చుతోంది. నిజానిజాలు బయటకు రాకుండా ఉండేందుకు అగ్గి రాజేసి ఉంటారనే సందేహాలు వస్తున్నాయి. ఈ ప్రమాదంతో పెబ్బేరు మార్కెట్ గోదామ్ పూర్తిగా ధ్వంసం కాగా, ఈ గోదామ్ నిర్మించేందుకు రూ.5 కోట్ల వరకు ఖర్చవుతుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు.
మాయం చేసిన గన్నీ బ్యాగుల లెక్క దొరకొద్దనా?
జిల్లాలో యాసంగిలో పండించిన వడ్లను కొనుగోలు చేసేందుకు పెబ్బేరు మార్కెట్ యార్డులోని గోదామ్‌లో 12.85 లక్షల గన్నీ బ్యాగులు ఉంచారు. అయితే స్థానికంగా ఉన్న కొందరు మిల్లర్లు, సివిల్ సప్లై అధికారులతో కుమ్మక్కై వాటిలో 7 లక్షల(వాటి విలువ దాదాపు రూ.5.60 కోట్లు) బ్యాగులను పక్కదారి పట్టించినట్లు తెలుస్తోంది. దీంతో నిల్వ ఉన్న సంచులకు నిప్పు పెట్టి ఉండవచ్చనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే వీటికి సివిల్ సప్లై ఆఫీసర్లు ఇన్సూరెన్స్ చేయించారు. పక్కదారి పట్టించిన వాటికి కూడా లెక్కలు చూపి 100 శాతం బీమా వచ్చేలా ప్రయత్నించి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పనికిరాకుండా పోయిన గోదామ్..
అగ్నిప్రమాద తీవ్రతకు గోదామ్ పూర్తిగా పనికిరాకుండా పోయింది. మంటలు ఎగిసి పడడంతో గోదామ్ పైకప్పు రెయిలింగ్ కుంగిపోయింది. తిరిగి రిపేర్ చేద్దామన్నా అయ్యే పరిస్థితి కనిపించడంలేదు. మంటలను ఆర్పేందుకు గోదాం గోడలను పడగొట్టారు. గోదామ్ నిర్మాణానికి అప్పట్లో రూ.3 కోట్లు ఖర్చు చేశారు. ఇప్పుడు గోదామ్ కట్టాలంటే పెరిగిన అంచనాల ప్రకారం రూ.5 కోట్లకు పైగానే ఖర్చు కావచ్చని అంటున్నారు.
అద్దె కూడా చెల్లించలే..
ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం, గన్నీ బ్యాగులు, పంటలను నిల్వ చేసుకునేందుకు గోదామ్‌లను ప్రభుత్వం కట్టించింది. ఈ గోదామ్‌లో 3 కంపార్ట్మెంట్లలో వడ్లు నిల్వ చేసుకునేందుకు ఇద్దరు మిల్లర్లకు మార్కెట్ యార్డ్ అధికారులు అద్దెకు ఇవ్వగా, మధ్యలో ఉన్న కంపార్ట్ మెంట్‌ను సివిల్ సప్లై శాఖకు అద్దెకు ఇచ్చారు. సివిల్ సప్లై శాఖకు ఇచ్చిన కంపార్ట్మెంట్ అద్దె రూ.21,900 కాగా, మిగతా వాటికి ఒక్కో దానికి రూ.96,448గా నిర్ణయించారు. అయితే అందులో ఓ మిల్లర్ డిసెంబర్ 2022 నుంచి అద్దె చెల్లించలేదు. ఆ అద్దె బకాయి రూ.15,43,168 కాగా, మరో మిల్లర్ ఏప్రిల్ 2023 నుంచి రూ.11,57,376 అద్దె చెల్లించలేదు.
వీరికి 8 సార్లు నోటీసులు ఇచ్చినా అద్దె చెల్లించడంలేదని మార్కెట్ యార్డ్ అధికారులు చెబుతున్నారు. నిబంధనల ప్రకారం నోటీసులు ఇచ్చిన 3 నెలల తరువాత అద్దెలు చెల్లించని వారిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో తాము ఏమీ చేయలేకపోయామని మార్కెట్ ఆఫీసర్లు చెబుతున్నారు.