హనీమూన్ కోసం గోవా వెళ్లిన కొత్త జంట: ఆ రాత్రి భర్త చేసిన పనికి భార్య షాక్

హనీమూన్ కోసం గోవా వెళ్లిన కొత్త జంట: ఆ రాత్రి భర్త చేసిన పనికి భార్య షాక్

కొత్తగా పెళ్లైంది.. ఏకాంతంగా గడుపుదామని నవ దంపతులు టూరిస్ట్ స్పాట్ గోవా వెళ్లారు. కానీ అక్కడే నవ వధువుకు భర్త అసలు రూపం తెలిసింది. భర్త తనను గోవా తీసుకొచ్చింది ఎంజాయ్ చేయడానికి కాదు హత్య చేయడానికి తెలుసుకుని షాక్‎కు గురైంది. ఎలాగోలా భర్త చెర నుంచి తప్పించుకుని కుటుంబ సభ్యుల దగ్గరకు చేరుకుంది. అనంతరం భర్తతో పాటు అతడి కుటుంబ సభ్యులపై వరకట్న వేధింపులు, శారీరక వేధింపులకు పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో బాధితురాలి భర్త గౌరవప్రదమైన వైద్య వృత్తిలో డాక్టర్ కావడం గమనార్హం. 

బాధితురాలి వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్‌కు చెందిన డాక్టర్ రత్నేష్ గుప్తాతో 2025, ఫిబ్రవరి 12వ తేదీన తనకు వివాహం జరిగింది. అత్తగారింటికి వెళ్లిన వారం రోజుల వ్యవధిలోనే వరకట్న వేధింపులు, శారీరక వేధింపులు ఎదురయ్యాయి. సమస్య పరిష్కరించేందుకు తన కుటుంబ సభ్యులు ఎంత ప్రయత్నించిన అత్త తరుఫు వారు వినలేదు. ఇంతలోనే తన భర్త హనీమూన్ అంటూ 2025, ఫిబ్రవరి 19న గోవా తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్లిన తర్వాత రాత్రి శారీరకంగా దాడి చేసి.. తన గొంతు కోయడానికి భర్త ప్రయత్నించాడని ఆరోపించింది. 

విషయం మా కుటుంబ సభ్యులకు చెప్పడంతో వెంటనే అక్కడి నుంచి తీసుకొచ్చారని బాధితురాలు వాంగ్మూలంలో పేర్కొంది. ఈ మేరకు భర్తతో పాటు అతడి కుటుంబ సభ్యులపై సదర్ కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా ఆమె భర్తతో పాటు అతడి కుటుంబ సభ్యులపై దాడి, వరకట్న వేధింపులు వంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసు సూపరింటెండెంట్ సోమేంద్ర మీనా తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోందని.. చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.