
డిజిటల్ వ్యక్తిగత డేటా పరిరక్షణ చట్టం (డీపీడీపీ చట్టం)2023, సుప్రీంకోర్టు 9 మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ‘జస్టిస్ కె.ఎస్ పుట్టస్వామి’ తీర్పు (2017)లో గుర్తించిన ‘ప్రాథమిక వ్యక్తిగత గోప్యతా హక్కు’ను పరిరక్షించడంలో ఒక ముఖ్యమైన ముందడుగు. త్వరలో అమల్లోకి వస్తుందని ఆశించే ఈ చట్టంలో ఆందోళన కలిగించే అంశాలు కూడా ఉన్నాయి.
డీపీడీపీ చట్టం, సమాచార హక్కు (సహ) చట్టానికి ఒక కీలక సవరణను ప్రతిపాదిస్తోంది. ప్రస్తుతం, సహ చట్టంలోని సెక్షన్ 8(1)(జె) ప్రకారం వ్యక్తిగత సమాచారమైనప్పటికీ, ఆ సమాచార వెల్లడి ప్రజా ప్రయోజనానికి ఉపయోగపడితే లేదా పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభకు నిరాకరించలేని పక్షంలో పౌర సమాచార అధికారి తన విచక్షణతో దానిని బహిర్గతం చేయవచ్చని పేర్కొంది.
అయితే, డీపీడీపీ చట్టంలోని సెక్షన్ 44(3) ఈ నిబంధనకు ప్రతిపాదించిన సవరణ పౌర సమాచార అధికారికి గల విచక్షణాధికారాన్ని తొలగిస్తుంది. ఈ మార్పు సహ చట్టాన్ని రెండు విధాలుగా బలహీనపరచవచ్చు. మొదటిది, ప్రజా ప్రయోజనంతో సంబంధం లేకుండా ‘వ్యక్తిగత సమాచారం’ ఏదైనా సమాచార వెల్లడి నుంచి మినహాయించవచ్చు. రెండోది, విస్తృత ప్రజా ప్రయోజనాలను చేకూరుస్తుందని భావించినప్పటికీ, సమాచార అధికారి ఏ వ్యక్తిగత సమాచారాన్నీ పౌరులకు వెల్లడించలేరు.
అదృష్టవశాత్తూ, ఈ సవరణ జరిగినప్పటికీ, సహ చట్టంలోని సెక్షన్ 8(2) మాత్రం చెక్కు చెదరలేదు. ఇతర ప్రయోజనాలకు జరిగే హానికంటే ప్రజా ప్రయోజనమే ఎక్కువగా ఉంటే.. సెక్షన్ 8(1)(జె) కింద మినహాయించిన సమాచారాన్ని కూడా బహిర్గతం చేయడానికి సెక్షన్ 8(2) అనుమతిస్తుంది. ‘సమాచార వెల్లడి నుంచి మినహాయించిన సమాచారాన్ని కూడా కోరే హక్కును పౌరులకు సెక్షన్ 8(2) కల్పిస్తుందని ‘రఫేల్ సమీక్ష’ తీర్పులో (యశ్వంత్ సిన్హా వర్సెస్ సీబీఐ 2019) జస్టిస్ కె.ఎం జోసెఫ్ పేర్కొన్నారు.
డీపీడీపీ చట్టం ప్రకారం జరిమానా
నోటీసు ఇచ్చి, సమ్మతి పొందకుండా ఏ వ్యక్తిపై వార్త రాసినా ఆ పత్రికా సంస్థపై రూ.50 కోట్ల నుంచి రూ.250 కోట్ల వరకు జరిమానా డీపీడీపీ చట్టం ప్రకారం విధించే అవకాశం ఉంది. ఇది ఏ వ్యక్తి చేసిన తప్పులపైనా వార్తలు రాయకుండా విలేకరులను నిరుత్సాహపరచవచ్చు. పెద్ద మీడియా సంస్థలు సెక్షన్ 10 కింద ‘ప్రాముఖ్య డేటా ఫీడ్యుషరీ’గా వర్గీకరించితే, మరి కొన్ని బాధ్యతలు కూడా నెరవేర్చాలి. ‘డేటా ప్రొటెక్షన్ అధికారిని నియమించాలి.
తరచుగా ‘డేటా ఆడిట్’, ‘డేటా ప్రొటెక్షన్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్’ నిర్వహిస్తుండాలి. అంతర్జాతీయ డేటా పరిరక్షణ చట్టాలు పాత్రికేయ కార్యకలాపాల కోసం నిర్దిష్ట మినహాయింపులను అందిస్తున్నాయి. ఉదాహరణకు యూరోపియన్ యూనియన్ ‘జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్’(GDPR)లోని ఆర్టికల్ 85, వార్తల రిపోర్టింగ్ కోసం వ్యక్తిగత డేటాను ప్రాసెస్ చేయడానికి మినహాయింపులను ఇవ్వడానికి సభ్యదేశాలను అనుమతిస్తుంది. యూకే ‘డేటా పరిరక్షణ చట్టం 2018’ జర్నలిస్టులకు సంపూర్ణ మినహాయింపును అందించదు. కానీ, ప్రజా ప్రయోజనాల కోసం సమాచారాన్ని సేకరించి, ప్రచురించడం కోసం చాలా వరకు డేటా పరిరక్షణ చట్ట బాధ్యతల నుంచి విలేకరులను మినహాయిస్తుంది.
ప్రజాస్వామ్యం బలహీనపడే అవకాశం
ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా గత సంవత్సరం పరిశోధనాత్మక జర్నలిజానికి ఆటంకం కలిగించే ‘సమ్మతి’ బాధ్యత నుంచి మీడియా సంస్థలను మినహాయించాలని, అందుకు డీపీడీపీ చట్టంలోని సెక్షన్ 17(5) కింద ఒక నోటిఫికేషన్ జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. అయితే, అటువంటి నోటిఫికేషన్ నిర్దేశించిన కాలానికి మాత్రమే జారీ చేయవచ్చు. అది తాత్కాలిక రక్షణను మాత్రమే అందిస్తుంది.-
పత్రికా స్వేచ్ఛపై వేలాడుతున్న కత్తి అలానే కొనసాగుతుంది. దీనికి శాశ్వత పరిష్కారం ఏమిటంటే ముసాయిదా డిజిటల్ వ్యక్తిగత డేటా పరిరక్షణ నియమాలు 2025లోని రూల్ 15ను సవరించి, కొన్ని ‘సమ్మతి’ అవసరాల నుంచి జర్నలిజంను స్పష్టంగా మినహాయించాలి. ఇది జరగాలంటే డీపీడీపీ చట్టంలోని సెక్షన్ 17(2)(బి)ను పార్లమెంటు సవరించాల్సిన అవసరం ఉంది. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ‘జర్నలిస్టిక్ ప్రవర్తనా నియమావళి 2022, వ్యక్తిగత సమాచార గోప్యతను రక్షించడానికి తగిన రక్షణలను కలిగి ఉంది.
ఈ నియమాలు నిజమైన అత్యవసర ప్రజా ప్రయోజనం ఉంటే తప్ప, వ్యక్తుల గోప్యతలో పాత్రికేయులు చొరబడకూడదని పేర్కొంటున్నాయి. డీపీడీపీ చట్టం నిబంధనలను ఈ జర్నలిస్టిక్ ప్రమాణాలతో సమన్వయించడం ద్వారా వ్యక్తిగత డేటాను రక్షించడం, పత్రికా స్వేచ్ఛను నిలబెట్టడం అనే రెండు ప్రాథమిక హక్కుల మధ్య సమతుల్యతను సాధించవచ్చు. ప్రతిపాదిత డిజిటల్ డేటా పరిరక్షణ చట్టం నిబంధనలు మొదట్లో పత్రికా స్వేచ్ఛను అణచివేయవచ్చు. ఫలితంగా పౌరుల సమాచార హక్కును పరిమితం చేయవచ్చు. అంతిమంగా ప్రజాస్వామ్యాన్నే బలహీనపరచవచ్చు.
పత్రికా స్వేచ్ఛపై ప్రభావం
పెద్ద సవాలు ఏమిటంటే.. పాత్రికేయ కార్యకలాపాలకు డీపీడీపీ చట్టం నుంచి స్పష్టమైన మినహాయింపు లేకపోవడం. ఇది పత్రికా స్వేచ్ఛ, పరిశోధనాత్మక జర్నలిజం భవిష్యత్తుపై తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది. సెక్షన్ 17(2)(బి) విద్యా పరిశోధన, ఆర్కైవింగ్ కోసం వ్యక్తిగత డేటాను ప్రాసెస్ చేయడానికి చట్టం నుంచి మినహాయింపులను అందిస్తుంది. విలేకరులకు ఎటువంటి వెసులుబాటు ఈ చట్టంలో లేదు. ఈ లోపం అనుకోకుండా జరిగినప్పటికీ పత్రికా స్వేచ్ఛపై తీవ్ర ప్రభావాన్ని చూపించవచ్చు.
విలేకరులు, వార్తా సంస్థలు ‘డేటా ఫీడ్యుషరీ’గా ఏ వ్యక్తి (డేటా ప్రిన్సిపాల్) వ్యవహారాలపై వార్త రాయబోతున్నారో ఆ వ్యక్తి ‘సమ్మతి’తో మాత్రమే వ్యక్తిగత డేటాను ఉపయోగించాల్సి ఉంటుంది. ఏ వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని సేకరించాలన్నా, ప్రచురించాలన్నా - తమ ఉద్దేశం గురించి అదే వ్యక్తికి స్పష్టమైన నోటీసు ఇవ్వాలి. ఆ వ్యక్తి నుంచి బేషరతుగా నిర్దిష్ట సమ్మతిని పొందడం పరిశోధనాత్మక జర్నలిజంలో, ముఖ్యంగా అవినీతి, నేరం, పరిపాలన వైఫల్యాలకు సంబంధించిన కేసులలో ఆచరణ సాధ్యం కానే కాదు.
- శ్రీనివాస్ మాధవ్,
సమాచార హక్కు పరిశోధకుడు