గద్వాలలోని డీపీఓ ఆఫీసుకు నిప్పు!

గద్వాలలోని డీపీఓ ఆఫీసుకు నిప్పు!
  • గద్వాలలోని డీపీఓ ఆఫీసుకు నిప్పు!
  • డీపీఓ చాంబర్, 3 కంప్యూటర్లు, ప్రింటర్, కొన్ని ఫైల్స్ దగ్ధం
  • విలువైన ఫైల్స్ మాయం చేసేందుకు తగలబెట్టారని ఆరోపణలు


గద్వాల, వెలుగు: గద్వాల జిల్లా కేంద్రంలోని డీపీఓ ఆఫీసుకు సోమవారం గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. అటెండర్​సురేశ్​శనివారం రాత్రి ఆఫీసుకు తాళం వేసి వెళ్లగా, సోమవారం ఉదయం వచ్చి ఓపెన్​చేశాడు. అప్పటికే లోపల మంటలు అంటుకుని ఫైల్స్, కంప్యూటర్లు, ఫర్నిచర్​కాలిపోవడం గమనించాడు. వెంటనే డీపీఓ శ్యామ్ సుందర్​కు, ఫైర్​స్టేషన్​కు కాల్​చేసి చెప్పాడు. ఫైర్​సిబ్బంది వచ్చి మంటలను ఆర్పారు. డీపీఓ చాంబర్, మూడు కంప్యూటర్లు, ప్రింటర్, కొన్ని విలువైన ఫైల్స్, ఫర్నిచర్​కాలి బూడిదయ్యాయి. డీపీఓ ఆఫీసును ఆనుకుని ఉన్న డీఎల్ పీఓ ఆఫీసులోని ఒక గది మంటలకు కుప్పకూలింది. ఫర్నిచర్ ధ్వంసమైంది. అయితే డీపీఓ ఆఫీసు తలుపులు తెరిచి ఉండడం, ఇనుపతలుపుల గడియ విరిగి ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. డీపీఓ, డీఎల్ పీఓ ఆఫీసులను జిల్లా కేంద్రంలోని తాత్కాలిక పంచాయతీరాజ్ బిల్డింగులో నిర్వహిస్తున్నారు. మంటలు అంటుకున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ అపూర్వ్ చౌహాన్, టౌన్​ఎస్సై ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

కుట్ర కోణం దాగి ఉందా?

డీపీఓ ఆఫీసు తగలబడడం వెనుక కుట్ర దాగి ఉందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ముగ్గురు లోకల్ బాడీ ఆఫీసర్లకు మధ్య కోల్డ్ వార్​నడుస్తోందని, కొన్ని విలువైన ఫైల్స్ మాయం చేసేందుకే నిప్పు పెట్టారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 10 రోజుల కిందట జిల్లా ఆఫీసర్(జిల్లా అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ) స్వయంగా తానే ఓ ఫైలు తయారు చేస్తున్నానని, ఎవరొచ్చినా కలిసేందుకు వీలు లేదని చెప్పినట్లు కలెక్టరేట్​లోని సిబ్బంది చర్చించుకుంటున్నారు. 

పూర్తిస్థాయి ఎంక్వైరీ చేయిస్తాం
డీపీఓ ఆఫీసు తగలబడడంపై పూర్తిస్థాయి ఎంక్వైరీ చేయిస్తాం. దీని వెనుక ఎవరున్నా వదిలిపెట్టం. జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశాం. సమగ్ర విచారణ చేయాలని కోరాం. 
- అపూర్వ్ చౌహాన్, అడిషనల్ కలెక్టర్ గద్వాల

కావాలనే నిప్పు పెట్టారు

ఈ ఘటన షాక్ సర్క్యూట్ వల్ల జరిగింది కాదు. పక్కా ప్లాన్​ప్రకారం నిప్పు పెట్టినట్లు తెలుస్తోంది. ఆఫీసుకు ఉన్న డోర్ల కొండిలు విరగగొట్టడం, డోర్లు ఓపెన్ చేసి ఉండడం చూస్తుంటే అనుమానాలకు బలం చేకూరుతోంది.                      - 
శ్యాంసుందర్, డీపీఓ, గద్వాల