వికారాబాద్–కృష్ణా కొత్త లైన్ డీపీఆర్​కు ఓకే

వికారాబాద్–కృష్ణా కొత్త లైన్ డీపీఆర్​కు ఓకే
  • ఎంపీ చామల ప్రశ్నకు  రైల్వే మంత్రి సమాధానం

న్యూఢిల్లీ, వెలుగు: వికారాబాద్‌‌– కృష్ణా స్టేషన్ల మధ్య 121.70 కి.మీ కొత్త లైన్‌‌ ఫైనల్ లొకేషన్‌‌ సర్వే కోసం డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్‌‌) తయారీకి ఒకే చెప్పినట్టు  కేంద్రం వెల్లడించింది. చిట్లపల్లె, పరిగి, కొడంగల్, టేకల్‌‌కోడ్, రావులపల్లె, మాటూరు, దౌలతాబాద్, దామరగిద్ద, నారాయణపేట, మక్తల్‌‌లను కలుపుతూ ఈ కొత్త రైల్వే లైన్‌‌ ప్రతిపాదన ఉందని పేర్కొంది. 

అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఫిజికల్‌‌ సర్వే పనులు పూర్తయినట్లు బుధవారం లోక్ సభలో ఎంపీ చామల కిరణ్‌‌ కుమార్‌‌ రెడ్డి అడిగిన ప్రశ్నకు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌‌ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఈ ప్రాజెక్టును 100 శాతం రైల్వే ఖర్చుతో మంజూరు చేయాలని తెలంగాణ ప్రభుత్వం అభ్యర్థించినట్లు వెల్లడించారు. అయితే ప్రాజెక్ట్‌‌ మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వంతో సహా వివిధ వాటాదారులతో సంప్రదింపులతో పాటు నీతి ఆయోగ్, ఆర్థిక మంత్రిత్వ శాఖ మొదలైన వాటి అంచనాలు, కావాల్సిన అనుమతులు అవసరమన్నారు.