విజయవాడ: డాక్టర్ బీ ఆర్ అంబేడ్కర్ స్మృతివనానికి తుదిరూపం ఇచ్చే పనులు వేగంగా జరుగుతున్నాయి. స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేయనున్న భారీ కాంస్య విగ్రహం .. స్మృతి వనం నిర్మాణంపై సంబంధిత అధికారులతో సీఎం జగన్ సమీక్షించారు. దేశంలోని వివిధ ప్రాంతాలను పరిశీలించి అధికారులు తీసుకొచ్చిన ప్రాజెక్టు నమూనా ఫోటోలను సీఎం జగన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చూశారు. నాగపూర్‌లో ఉన్న అంబేడ్కర్ దీక్ష భూమి, ముంబైలో ఉన్న చైత్య భూమి, లఖ్‌నవూలోని అంబేడ్కర్ మెమోరియల్, నోయిడాలోని ప్రేరణాస్థల్‌ను సీఎం జగన్‌కు అధికారులు చూపించారు. గ్యాలరీ, ఆడిటోరియమ్ ఎలా ఉంటుందన్న దానిపైనా అధికారులు ముఖ్యమంత్రికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. వచ్చే ఏడాది అంబేడ్కర్ జయంతి నాటికే విగ్రహాన్ని ఆవిష్కరించాలని సీఎం జగన్ సూచించగా.. కాంస్య విగ్రహం తయారీకి 14 నెలలు పడుతుందని అధికారులు వివరించారు.
కాంస్య విగ్రహం, స్మృతివనం పనులను ఈ ఏడాది డిసెంబరులో మొదలు పెడితే.. 14 నెలల్లో పూర్తి చేయగలమని వివరించారు. 2022 ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి రోజున విగ్రహావిష్కరణ, స్మృతివనం ప్రారంభించేందుకు సిద్ధం చేయగలమని అధికారులు వివరించారు.
స్మృతివనం వద్ద లైబ్రరీ, మ్యూజియమ్, గ్యాలరీ ఏర్పాటుతో పాటు, ఆయన జీవిత విశేషాలు ప్రదర్శించాలని సీఎం జగన్ అధికారులకు నిర్దేశించారు. అంబేడ్కర్ స్మృతివనంలో ఏర్పాటు చేసే విగ్రహం దీర్ఘకాలం నాణ్యంగా ఉండాలని, స్ట్రక్చర్‌లో మెరుపు, కళ తగ్గకుండా ఉండాలని ఈ సందర్భంగా సీఎ జగన్ అధికారులకు స్పష్టం చేశారు. ల్యాండ్‌స్కేప్‌లో గ్రీనరీ బాగా ఉండాలని, అది ఏ మాత్రం చెడిపోకుండా చూడాలని ఆదేశించారు.