మౌలిక వసతులతోనే ప్రాంతాల అభివృద్ధి : డాక్టర్ బి.కేశవులు

మౌలిక వసతులతోనే ప్రాంతాల అభివృద్ధి : డాక్టర్ బి.కేశవులు
  • ఉపాధి, మౌలిక సదుపాయాల్లో ఉత్తర తెలంగాణ వెనుకంజ
  • వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి ఇస్తే అభివృద్ధికి అండ

ఆదిలాబాద్, వెలుగు: మౌలిక వసతులతోనే ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందుతుందని, ఆ దిశగా ప్రభుత్వం కృషి చేయాలని ఉత్తర తెలంగాణ అభివృద్ధి ఫోరం చైర్మన్ డాక్టర్ బి.కేశవులు అన్నారు. ఆదివారం ఆదిలాబాద్​లోని మున్నూరు కాపు భవనంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. సహజ వనరులు, మానవ వనరులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇంతకాలం ఉత్తర తెలంగాణ జిల్లాలపై నిర్లక్ష్యం కొనసాగిందని, ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో వనరులు పుష్కలంగా ఉన్నా అభివృద్ధి జరగలేదన్నారు.

 వందలాది గ్రామాలు, గిరిజన తండాలు, గోండు గూడేలకు సరైన దారుల్లేవన్నారు. రైల్వే లైన్ల అభివృద్ధి, విస్తరణ జరగలేదని, విమానరంగంలో నిర్లక్ష్యం కనిపిస్తోందన్నారు. ఉత్తర తెలంగాణకు మంత్రి పదవులు పెంచాలన్నారు. కాంగ్రెస్ కు ఎంతో సేవ చేసిన కాకా కుటుంబం నుంచి చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి, నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవులు ఇవ్వాలని, దానివల్ల ఈ ప్రాంత అభివృద్ధికి అవకాశం ఉంటుందన్నారు. 

సమావేశంలో రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షుడు సంగెపు బొర్రన్న, ప్రోగ్రాం కన్వీనర్లు తాళ్ల రవీందర్, విఠల్ మాధవ్, ప్రోగ్రాం కోఆర్డినేటర్ డీఎల్ఎన్ చారి, సితార్ల సురేశ్, డి. గోపాల్ రెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పార్టీల లీడర్లు, రిటైర్డ్ ఉద్యోగులు, విద్యార్ధి సంఘాలు పాల్గొన్నాయి.