సామాజిక న్యాయం సచ్చిపోయిందా?

భారత రాజ్యాంగ ప్రవేశిక ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందాలని ప్రవచిస్తోంది. డా. బీఆర్​ అంబేద్కర్​రాజ్యాంగంలోని అనేక ఆర్టికల్స్​లో సామాజిక న్యాయ స్ఫూర్తిని అంతర్లీనం చేశారు. రాజ్యాంగంలోని 38(1)వ అధికరణం రాజ్యం ప్రజలందరి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని న్యాయబద్ధమైన సామాజిక, ఆర్థిక, రాజకీయ వ్యవస్థలను నెల కొల్పాలని చెబుతోంది. సామాజికంగా అందరూ సమానం అని చెబుతూ..17వ అధికరణతో అంటరానితనాన్ని నిషేధించింది. ఆర్థిక న్యాయం అందాలనే 24వ అధికరణతో వెట్టి చాకిరిని నిషేధించింది. రాజకీయాల్లో ప్రజలు స్వేచ్ఛగా పాల్గొంటేనే రాజకీయ న్యాయం సాధించినట్లు. అందుకే ఏ వ్యక్తి రాజకీయ హక్కుల వినియోగంలో ఎలాంటి మత, జాతి, లింగ వివక్షకు గురికాకూడదని325వ అధికరణాన్ని పొందుపరిచారు. కానీ దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏండ్లు కావొస్తున్నా.. సామాజిక న్యాయం అందని ద్రాక్షగానే మిగిలింది. సామాజిక న్యాయ స్ఫూర్తితో రూపుదిద్దుకున్న రాజ్యాంగంపై ప్రమాణం చేస్తూ.. అధికారంలోకి వస్తున్న పాలకులు.. ఆ స్ఫూర్తిని మరుస్తున్నారు. దేశంలో ఉన్న ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక రంగాల్లో సమన్యాయం జరగడం, దేశ వనరులు, సంపదపై ప్రజలందరికీ సమాన వాటాలు దక్కడమే సామాజిక న్యాయం.

900 మంది లక్షా 30 వేల కోట్ల ఎగవేత!
కోటి రూపాయల విలాసవంతమైన కార్లు కొనుక్కోవడానికి కోట్ల రూపాయల రుణాలు ఇచ్చే బ్యాంకులు.. ఒక ఎకరం భూమి ఉండి.. తన రక్తాన్ని చెమటగా మార్చి పంట పండించి పదిమంది కడుపు నింపే రైతన్నకు లక్షరూపాయల రుణం ఇయ్యని దుర్మార్గ పరిస్థితి ఉంది. హైదరాబాద్​ పరిధిలో ఉన్న బ్యాంకుల్లో కేవలం 900 మందే లక్షా 30 వేల కోట్ల రూపాయల రుణాలు ఎగ్గొట్టినట్లు అంచనా. సమాజంలో ఉన్న సంపదంతా ఆదిపత్య వర్గాలకు, బడా బాబులకు వడ్డించిన విస్తరిలా పంచుతున్నారు. పేదోడు మాత్రం పేదోడిగానే ఉండిపోతున్నాడు. మొన్నటి కరోనా సమయంలో లక్షల కుటుంబాలు కఠిక పేదరికంలోకి వెళ్లగా.. ధనవంతుల సంపద మాత్రం రెండు మూడు రెట్లు పెరిగింది. పాలించేవారు వేరు.. పాలించబడే వారు వేరు అన్నట్లుగా తయారైంది. కొన్ని వర్గాలు మాత్రమే దైవాంశ సంభూతులు, వాళ్లు మాత్రమే రాజ్యాధికారం అనుభవించాలి, వాళ్లు మాత్రమే బ్యాంకుల్లో లోన్లు తీసుకోవాలి, వాళ్లు మాత్రమే కంపెనీలు నడపాలి, వాళ్లు మాత్రమే పెద్దోళ్లు కావాలి తప్ప.. మిగతా చిన్న చిన్న సామాజిక వర్గాల వాళ్లు ఇంకా పేదలుగానే, బిచ్చగాళ్లగానే కటిక పేదరికంలో మగ్గాలి. ప్రస్తుతం ఇదే 
జరుగుతోంది. 


పేదోడికి పెన్షన్లు.. పెద్దోడికి కమీషన్లు
రాష్ట్రంలో నిమ్నవర్గాలకు, పేదవారికి పెన్షన్లు, షాదీముభారక్​లు, కల్యాణలక్ష్మీలు ఇస్తున్న ఆధిపత్య వర్గాల పాలకులు.. పెద్దోడికి మాత్రం కాంట్రాక్టులు, కమీషన్లు ముట్టజెప్పుతున్నాయి. సరైన విద్య, వైద్యం అందించకుండా పేదవారిని మరింత పేదలుగా, బానిసలుగా మార్చే కుట్ర జరుగుతోంది. తెలంగాణ ఎందుకు వచ్చిందిరా? అన్నట్లుగా అయిపోయింది పరిస్థితి. ఒక ఆధిపత్య వర్గం నుంచి మరో ఆధిపత్య వర్గానికి పాలన మారింది తప్పితే.. సామాజిక న్యాయం అమలు చేసే పాలన రాలేదు. ఉద్యమం సమయంలో ప్రొ. కంచె అయిలయ్యతో ఓ టీవీ డిబేట్​లో తెలంగాణ ఏర్పాటు గురించి చర్చ జరిగింది. నాతోపాటు ఆనాడు ఉద్యోగ సంఘాల నాయకుడిగా ఉన్న విఠల్​కూడా ఉన్నాడు. కంచె అయిలయ్య నెత్తినోరు మొత్తుకున్నాడు. “మీరంతా పిచ్చి పని చేస్తున్నరు. యూనివర్సిటీల్లో చదువుకున్నోళ్లు మీరు ఇట్ల చేస్తే ఎట్ల.. తెలంగాణ వస్తే ఇంకా ఆగమైపోతరు.. సామాజిక న్యాయం జరగదు. ఒక రకమైన ఫ్యూడల్​వ్యవస్థ పెరిగిపోతుంది” అని ఆయన గట్టిగా వాదించారు. మేమ ఆరోజు ఆయన వాదనను బలంగా వ్యతిరేకించి, రాష్ట్ర ఏర్పాటుతోనే అందరి బతుకులు బాగుపడతయని తేల్చి చెప్పాం. కానీ ఇయ్యాల వెనక్కి తిరిగి చూసుకుంటే.. కంచె అయిలయ్య ఆనాడు అన్న మాటలే నిజమవుతున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రమంతా.. ఒకటి రెండు సామాజిక వర్గాల ఆధిపత్య, రాజకీయ క్రీడలకు వేదికగా మారింది తప్ప.. ప్రజా ప్రాతినిథ్య ప్రజాస్వామ్య స్ఫూర్తి ఎక్కడా కనిపించడం లేదు.
 

కొన్ని వర్గాలకే రాజ్యాధికారమా?
1955 నుంచి 2009 దాకా జరిగిన 12 ఎన్నికల్లో సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతం కలిపి ఏపీలో 3,518 మంది ఎమ్మెల్యేలు ఎన్నికైతే.. అన్ ​రిజర్వుడ్​సీట్లలో 2321(82 %) మంది అగ్రకులాల వారే. కేవలం 428(14.9 %) బీసీలకు, 113(3.9 %) మైనారిటీలకు దక్కాయి. జనాభా దామాషా ప్రకారం చూస్తే 50 శాతం ఉన్న బీసీలకు కేవలం15 శాతం సీట్లే వచ్చాయి. బీసీలకు, మైనార్టీలకు రావాల్సిన 40 శాతంకు పైగా సీట్లు 20 శాతం ఉన్న అగ్రకులాలు లాక్కొని అధికారం చెలాయించాయి. తెలంగాణ వచ్చినా  పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 20 లక్షల జనాభా ఉన్న రెడ్డీల నుంచి 40 మంది ఎమ్మెల్యేలు అయ్యారు.10 లక్షలు ఉన్న వెలమల్లో 10 మంది, 14 లక్షల మంది ఉన్న మున్నూరుకాపుల్లో 9 మంది, 30 లక్షలు ఉన్న యాదవుల్లో 5 మంది, 20 లక్షలు ఉన్న గౌడ్స్​లో నలుగురు, 16 లక్షలు ఉన్న కమ్మల్లో 5 మంది, 40 లక్షలు ఉన్న ఎస్సీ మాదిగల్లో 9 మంది, 35 లక్షల మంది ఉన్న ఎస్సీ మాలల్లో 9 మంది, 50 లక్షల మంది ఉన్న ఎస్టీల్లో 12 మంది, 60 లక్షలు ఉన్న ముస్లింలలో 8 మంది, 52 లక్షల మంది ఉన్న ముదిరాజుల్లో ఒక్కరు ఎమ్మెల్యే అవగా, 16 లక్షల జనాభా ఉన్న పద్మశాలీల్లో, 13 లక్షలు విశ్వకర్మలు ఉన్న జనాభా నుంచి ఒక్కరు కూడా ఎమ్మెల్యే లేరు. స్వపరిపాలన అంటే ఎవరిని వారు పరిపాలించుకోవడమే. ప్రజా ప్రాతినిథ్య ప్రజాస్వామ్య సూత్రాలకు అనుగుణంగా ఆయా సామాజిక వర్గాలు ఎంత శాతం ఉంటే ఆ మేరకు వాళ్లకు చట్టసభల్లో ప్రాతినిధ్యం దక్కాలి. అప్పుడే వాళ్లు యాచించే వాళ్లుగా ఉండక.. శాసించే స్థాయికి ఎదుగుతారు. అదే నిజమైన సామాజిక న్యాయం. పాలకులు సామాజిక న్యాయ స్ఫూర్తికి విరుద్ధంగా రాజకీయాల్ని పెట్టుబడి వ్యాపారులుగా మార్చేశారు. ప్రజలను డబ్బు, మద్యానికి బానిసలను చేసి, ఓట్లేసే యంత్రాలుగా మారుస్తున్నారు. రాజకీయాలను పేదవాడికి అందనంత దూరంగా తీసుకు వెళ్లారు. ఏపూరి సోమన్న అన్నట్లు ‘ఎవడి పాలైందిరో తెలంగాణ.. ఎవడేలుతున్నాడురో’ అనేది నిజమైనట్లుగా కనిపిస్తోంది. విద్య, వైద్యం, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ఎవరి వాటా వాళ్లకు దక్కడం లేదు. అందుకే..రాష్ట్రంలో సామాజిక న్యాయం సచ్చిపోయిందా అనిపిస్తోంది. కానీ సామాజికి న్యాయాన్ని సచ్చిపోనీయొద్దు. మేధావులు, రాజకీయ పార్టీలు అంతా కలిసి బతికించుకోవాలి. అప్పుడే ప్రజాస్వామ్యానికి, అంబేద్కర్​ ఆశయాలకు నిజమైన సార్థకత.
 

బడుగుల బతుకులు మారలేదు
నీళ్లు, నిధులు, నియామకాల కోసం మొదలైన తెలంగాణ ఉద్యమం.. క్రమంగా అస్తిత్వ పోరాటంగా, ఆత్మ గౌరవ ఉద్యమంగా మారింది. సకల జనులు స్వపరిపాలన కోరుకున్నారు. స్వపరిపాలన అంటే ఒక ఆధిపత్య వర్గం పోయి.. ఇంకో ఆధిపత్య వర్గం రావడం కాదు. రాష్ట్రం ఏర్పడితే మాకు కూడా పరిపాలనలో వాటా వస్తుందని చిన్న చిన్న సామాజిక వర్గాలు కూడా జేఏసీలు ఏర్పాటు చేసుకొని ఉద్యమించాయి. చిన్న రాష్ట్రాల ద్వారానే సామాజిక న్యాయం అందుతుందని డా. బీఆర్​ అంబేద్కర్​ అన్నారు. దాన్ని నమ్మి రాష్ట్ర ఉద్యమంలో బలంగా కొట్లాడిన వాళ్లలో నేనూ ఒకడిని. లక్షల జీతం వచ్చే కార్పొరేట్​కొలువు వదులుకొని 42 ఏండ్ల వయసులో నేను రాజకీయాల్లోకి రావడానికి ప్రధాన కారణం.. ఆనాడు చిరంజీవి సామాజిక న్యాయం అనే నినాదంతో ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. సమాజ పరివర్తనకు, విప్లవాత్మకమైన మార్పునకు ఇంతకంటే గొప్ప అవకాశం మరొకటి ఉండదని భావించి సామాజిక న్యాయ యుద్ధంలో భాగంగా అందులో చేరాను. తదనంతరం తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు.. ముందుండి కొట్లాడిన. దురదృష్టమేమిటంటే.. పెనంలోంచి పొయ్యిలో పడినట్లుగా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా బడుగుల బతుకులు మారలేదు. నిమ్నవర్గాలు ఇంకా అణిచివేతకు గురవుతున్నాయి. దైవాంశ సంభూతులమన్నట్లు కొంత మంది మాత్రమే.. రాజ్యాధికారం అనుభవిస్తున్నారు. వారు లేనిదే ప్రభుత్వాలు నడువయన్నంతగా.. రాజకీయాలను దిగజార్చారు.

-దాసోజు శ్రవణ్, ఏఐసీసీ అధికార ప్రతినిధి