
మంచిర్యాల, వెలుగు : దివ్యాంగుల కోసం ప్రతి వారం సదరం క్యాంప్ నిర్వహించి సర్టిఫికెట్లు జారీ చేయాలని వివిధ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. దివ్యాంగుల సమస్యలపై హీల్ స్వచ్ఛంద సంస్థ, మంచిర్యాల నియోజకవర్గ బీసీ రాజ్యాధికార సాధన ఐక్యవేదిక అధ్యక్షుడు డాక్టర్ చుంచు రాజ్‌కిరణ్ ఆధ్వర్యంలో శనివారం మంచిర్యాల ఐబీ చౌరస్తాలో ఒకరోజు నిరసన తెలిపారు.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి దివ్యాంగులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సర్టిఫికెట్ల కోసం తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరువు పెట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గతంలో ఏరియా హాస్పిటల్లో డాక్టర్ల కొరత ఉన్నప్పటికీ నెలకు 2వేల మందిని చూసేవారన్నారు. ప్రస్తుతం జీజీహెచ్‌లో సరిపడా డాక్టర్లు ఉన్నా కూడా నెలకు 200 మందికి మాత్రమే స్లాట్లు ఇస్తున్నారని పేర్కొన్నారు.
దీంతో చాలామంది దివ్యాంగులు సర్టిఫికెట్ల కోసం హాస్పిటల్చుట్టూ తిరుగుతూ అవస్థలు పడుతున్నారని చెప్పారు. దివ్యాంగులకు లోన్లు ఇవ్వాలని, హాస్పిటల్లో సౌలత్లు కల్పించాలని, శాశ్వత అంగవైకల్యం ఉన్నవారికి పర్మినెంట్ సర్టిఫికెట్లు జారీ చేయాలని, కీళ్లవాతం బాధితులకు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గాజుల ముఖేశ్‌గౌడ్, డాక్టర్ పి.రమణ, నీలి శ్రీనివాస్, కర్రె లచ్చన్న, నరెడ్ల శ్రీనివాస్, రంగు రాజేశం, తుల మధుసూదన్‌రావు, బండి రాజలింగం, భవాని పాల్గొన్నారు.