సాంస్కృతిక సారథి హెడ్గేవార్

సంస్కృతి దేశానికి గుండె చప్పుడు లాంటిదని, హిందుస్తాన్‌‌‌‌‌‌‌‌ను పరిరక్షించుకోవాలంటే.. హిందూ సంస్కృతిని కాపాడుకోవాలని చాటిన వ్యక్తి డాక్టర్​ హెడ్గేవార్. సమాజం సంఘటితం కావడం వల్లే శక్తి వస్తుందని నమ్మిన ఆయన రాష్ట్రీయ స్వయం సేవక్​ సంఘ్​ను స్థాపించారు. సాంస్కృతిక చైతన్యం కోసం పని చేయడంతోపాటు, ధర్మం, దేశం కోసం పాటుపడేందుకు లక్షలాది మంది స్వయం సేవక్​లను ఆయన తయారు చేశారు. మన తెలంగాణ మూలాలు ఉన్న 
హెడ్గేవార్ ​పుట్టింది ఇయ్యాల్నే.

తెలంగాణలోని ఇందూరు జిల్లాలో గోదావరి, మంజీరా, హరిద్ర నదుల సంగమ స్థానం కందకుర్తి గ్రామానికి చెందిన హెడ్గేవార్ కుటుంబం శతాబ్దాల క్రితం నాగ్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌కు వెళ్లి స్థిరపడింది. 1889 ఏప్రిల్1న హెడ్గేవార్ నాగ్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌లో జన్మించారు. ఆయనకు13 ఏళ్ల వయసులో తల్లిదండ్రులు ప్లేగు వ్యాధితో మరణించారు. సమాజ హితం కోసమే జీవించిన ఆయన గురించి తెలుసుకోవాలంటే స్వాతంత్ర్యానికి ముందుకు వెళ్లాలి.1857 స్వాతంత్ర్య సంగ్రామం తర్వాత తమ పాలనను కొనసాగించేందుకు ఏం చేయాలని ఆలోచించిన ఆంగ్లేయులు అభూత కల్పనలు దేశంమీదకి వదిలారు. భారత్ ఒక ఉపఖండం అని, ఇది ఒక దేశం కాదు, జాతి కాదనే సిద్ధాంతం తీసుకొచ్చారు. ఈ దేశం మీద మొదట ఆర్యులు దండయాత్ర చేశారని, ఆ తర్వాత దాడులుపరంపర కొనసాగిందని, ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఎప్పుడో ఒకప్పుడు బయట నుంచి వచ్చిన వారే అని సూత్రీకరించారు. దాని ప్రభావం ఈ దేశంలోని మేధావులుపై పడటం మొదలైంది. 

సాంస్కృతిక పనరుజ్జీవనం..

మరోపక్క దేశంలో స్వాతంత్ర్య పోరాటం గురించి అనేక ఆలోచనలు బయలుదేరాయి. ప్రారంభంలో అనేక విప్లవ సంస్థలు పుట్టుకొచ్చాయి. ఒక ప్రయత్నం విఫలమైతే మరో ప్రయత్నం చేస్తూ వచ్చారు. దాని సమన్వయం కోసం గదర్ సంస్థ ఆవిర్భవించింది. అలా ఒకరి తర్వాత ఒకరు ప్రయత్నాలు చేస్తూ నేతాజీ వరకు కొనసాగించారు. ఆయన తర్వాత ఆ ప్రయత్నం ముందుకు సాగలేదు. ఆ సమయంలో అనేకమంది మహా పురుషులు ఈ దేశం కోసం ప్రాణాలర్పించారు. విప్లవ మార్గం వైఫల్యంతో దేశంలో మేధావులు ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకురావాలని భావించారు. సామాన్య ప్రజలు స్వాతంత్ర్యం కోసం రోడ్డెక్కారు. కానీ దాంతో సామాజిక చైతన్యానికి బదులు రాజకీయ స్వార్థం తెరపైకి వచ్చింది. మరోపక్క సామాజిక దురాచారాలను తొలగించేందుకు సంస్కరణ వాదులు బయలుదేరారు. కొద్ది మార్పు సాధించగలిగారు కానీ ఆశించిన ఫలితాలు రాలేదు. స్వామి దయానంద సరస్వతి, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద,  అరవింద, బంకించంద్ర తదితరులు ఆధ్యాత్మిక చైతన్యం కోసం పనిచేశారు. ఆ ప్రయత్నాలతో సాంస్కృతిక పునరుజ్జీవనానికి పునాదులు పడ్డాయి. ఎంతో వైవిధ్యభరితమైన ఈ దేశాన్ని ఏకాత్మతా భావంతో నడిపించగల నాయకత్వం వికసించాలని రవీంద్రనాథ్ ఠాగూర్ భావించారు. భారత రాజ్యాంగాన్ని అమలు చేసుకునే రోజు డాక్టర్ అంబేద్కర్ ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ‘‘సామాజిక ప్రజాస్వామ్యం’’ అనే అంశాన్ని ప్రస్తావించారు. ఈ దేశ చరిత్ర గమనిస్తే సాంస్కృతిక చైతన్యంతోనే సామాజిక ప్రజాస్వామ్యం సాధించినట్లు స్పష్టమవుతుంది. సాంస్కృతిక చైతన్య పరంపరను డాక్టర్ హెడ్గేవార్​కొనసాగిస్తూ వచ్చారు. 

సంఘ్​ స్థాపన..

పుణేలో చదువుకునేప్పుడు బ్రిటిష్ వారి ఆదేశాలను ఉల్లంఘించి, వందేమాతరం పాడినందుకు ఆయనను పాఠశాల నుంచి బహిష్కరించారని చెబుతారు. మెట్రిక్యులేషన్ అనంతరం వైద్య విద్య కోసం ఆయన కలకత్తాకు వెళ్లారు. 1915లో వైద్య విద్య పూర్తి చేసుకుని నాగ్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌కు తిరిగి వచ్చారు. హెడ్గేవార్ తన జీవితంలో విప్లవ కార్యకలాపాలు, స్వాతంత్ర్య ఉద్యమాల్లోనే ఎక్కువ పని చేశారు. అలా చేస్తూనే1925లో విజయదశమి రోజున నాగ్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌లో రాష్ట్రీయ స్వయం సేవక్​సంఘ్‌‌‌‌‌‌‌‌ను స్థాపించారు. 1936లో సంఘ్ మహిళా విభాగం ప్రారంభమైంది. హిందూ సమాజం అనేక కారణాలతో చెల్లాచెదురైందని, హిందూ సమాజ సంఘటన ద్వారా దేశాన్ని శక్తిమంతంగా నిలబెట్టాలని ఆయన భావించారు. సామాజిక వ్యవస్థ నిర్మాణానికే ఆయన ఆర్ఎస్ఎస్​ను ప్రారంభించారు. ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకు రావడానికి భారతదేశంలో బ్రిటీష్ పార్లమెంటరీ పరిపాలనకు అనుగుణంగానే 1885లో కాంగ్రెస్ సంస్థ ప్రారంభమైంది.1906లో ముస్లిం లీగ్,1920లో  కమ్యూనిస్టు పార్టీ ప్రారంభమయ్యాయి. అదే సమయంలో హిందూ మహాసభ స్టార్ట్​అయింది. ఈ సంస్థలన్నీ  ఒక పక్క దేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేస్తూనే.. ఎన్నికల్లో పాల్గొని పరిపాలనలో భాగస్వామ్యం అవుతుండేవి. 

హిందూ దేశమని ప్రకటన

ముస్లింల దండయాత్రలతో ఈ దేశంలోకి ఇస్లాం ప్రవేశించింది. ముస్లిం రాజులు ఒక పక్క ఈ దేశ రాజ్యాధికారాన్ని చేజిక్కించుకుంటూనే మరో పక్క పెద్ద ఎత్తున మతమార్పిడులకు పాల్పడ్డారు. తర్వాతి కాలంలో బ్రిటీష్ వారి ప్రవేశంతో ఈ దేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. 1920 సంవత్సరంలో ప్రారంభమైన కమ్యూనిజం ద్వారా నక్సలిజం పుట్టుకొచ్చింది.  మరోపక్క బ్రిటీష్ వారు సృష్టించిన ఆర్య ద్రావిడ సిద్ధాంతం, భారత్ ఒక ఉపఖండం అనే సిద్ధాంతాల ప్రభావాలకు లోనైన ఉదారవాద మేధావి వర్గం కొత్తగా పుట్టుకొచ్చి.. దేశ సమగ్రతకు సవాళ్లు విసిరారు. వాటిని అధిగమించేందుకు డాక్టర్​జీ ఈ దేశం హిందూ దేశమని ప్రకటించారు. వాటిని అరికట్టేందుకే హెడ్గేవార్​ హిందూ సమాజ సంఘటనకు పూనుకున్నారు. సంఘ స్వయంసేవక్​లలో అనుశాసనం, దేశభక్తి సమాజంలోని అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అది కాంగ్రెస్ నాయకులకు నచ్చకపోయేది. ఇటు కాంగ్రెస్, హిందూ మహాసభ వారి అసంతృప్తిని కాదని సంఘ్ ను నిలబెట్టడంలో డాక్టర్​జీ సఫలీకృతమయ్యారు.  కాంగ్రెస్, స్వాతంత్ర్యం తర్వాత పుట్టు కొచ్చిన రాజకీయ సంస్థలన్నీ ఆర్ఎస్ఎస్​ను ప్రత్యర్థిగానే భావిస్తున్నాయి. ఇదొక సామాజిక జాతీయ సంస్థగా దేశహితం కోసం పనిచేస్తున్నదని గుర్తించడం లేదు.

సమాజ హితం కోసం..

సంఘ కార్యం ద్వారా సమాజ హితం గురించి ఆలోచించే వ్యక్తులు చిన్న చిన్న గ్రామాల నుంచి దేశమంతటా తయారు కావాలనేది హెడ్గేవార్​లక్ష్యం. దేశమంతటా దేశ హితం గురించి ఆలోచించే వ్యవస్థ నిర్మాణం కావాలని ఆయన ఆకాంక్షించారు. ప్రస్తుతం దేశమంతటా వారి ఆలోచనలు కనిపిస్తున్నాయి. మనందరం ఒకే జాతి అనే భావం నిర్మితమవుతోంది. అలాంటి ఆలోచనలు మనకు కలిగించిన డాక్టర్​జీ ఒక యుగ ద్రష్ట.  దేశంలో సాంస్కృతిక పునరుజ్జీవనం వేగంగా జరుగుతున్నది. దాన్ని  మరింత వేగంగా ముందుకు తీసుకు వెళ్లేందుకు ప్రయత్నం చేద్దాం. 2018లో ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఎస్ కార్యక్రమంలో పాల్గొనబోయే ముందు హెడ్గేవార్ నివాసాన్ని ప్రణబ్ ముఖర్జీ సందర్శించారు. అక్కడున్న సందర్శకుల పుస్తకంలో ‘‘భరతమాత మహోన్నత పుత్రుడు డాక్టర్ కేబీ హెడ్గేవార్‌‌‌‌‌‌‌‌కు నివాళులు అర్పించడానికి వచ్చాను’’ అని రాశారు. ప్రణబ్​ముఖర్జీ రాసిన ఆ మాటల ద్వారా డాక్టర్​జీ వ్యక్తిత్వం అర్థం చేసుకోవచ్చు.

:: రాంపల్లి మల్లికార్జున, సోషల్​ ఎనలిస్ట్​