తెలంగాణ పల్లె బతుకులకు ఆయన చిత్రరూపమిచ్చారు. మట్టి మనుషుల శ్రమైక జీవన సౌందర్యాన్ని అందంగా చిత్రీకరిస్తూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటారు. చిత్రకళ విశిష్టతను రెపరెపలాడించిన ఘనత ఆయన సొంతం. యువ చిత్రకారులకు ఆయన దిక్సూచి. తెలంగాణ జానపద కళా వైభవాన్ని దశదిశలా చాటిన డాక్టర్ కాపు రాజయ్య జయంతి ఇయ్యాల. ఆయనను స్మరించుకోవడమంటే తెలంగాణ సంస్కృతిని, భారతీయ చిత్రకళను యాదికి తెచ్చుకోవడమే.
బడుగు జీవుల శ్రమైక జీవన సౌందర్యాన్ని రాజయ్య తన చిత్రాల్లో అద్భుతంగా ఆవిష్కరించారు. బతుకమ్మ, బోనాలు, పీర్ల పండుగ, గ్రామ దేవతల పండుగల్లో శివసత్తులు, వీధి నాటికం, బుర్రకథ, శారదా గాళ్లు, కుమ్మరులు, జాలర్లు, రజకులు, పాలు అమ్మే వాళ్లు, సోది చెప్పే వారు, కోయలు, పశువుల కాపరులు, గొర్ల కాపరులు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, రాళ్లు కొట్టే వారు, వడ్డెరలు, చెప్పులు కుట్టే వారు, జాతరలు, పట్నాలకు సంబంధించి రాజయ్య అద్భుత చిత్రాలు వేశారు. వాటిని పరిశీలిస్తే తెలంగాణ పల్లెల్లోకి తొంగిచూసిన అనుభూతి కలుగుతుంది. తెలంగాణ పల్లె పడుచుల ప్రత్యేక అలంకరణలో భాగమైన ముక్కెరలు, మట్టెలు, పూసల పేర్లు, కొనికి పోగులు, నానులు, కంటెలు, మాటీలు, కమ్మలు, పట్ట గొలుసులు, పాపిట హారాలు, కాళ్ల, చేతుల కడియాలు, రవికెలు, చీరలను కూడా రాజయ్య కళ్లకు కట్టేలా తన చిత్రాల్లో ప్రతిబింబించారు.
ఆధ్యాత్మిక పరిమళాలు
తెలంగాణ మట్టి మనుషుల శ్రమైక జీవన సౌందర్యాన్ని చిత్రీకరించడంతోపాటు రాజయ్య రామాయణ, మహా భారత, భాగవతంలోని అంపశయ్య, రామదూత, కాలింగ మర్దిని, వటపత్రశాయి, కామధేనువు, గోపి కృష్ణ శాశ్వత ప్రేమ తదితర ఘట్టాలను జానపద శైలిలో ఆవిష్కరించారు. వెంకటేశ్వరుడి వైభవాలను, శివ తత్వాలను వైవిధ్యంగా చిత్రీకరించారు. ఇలా భారతీయ సంస్కృతి విశిష్టతను పాశ్చాత్యులకు హృద్యంగా పరిచయం చేశారు. కాపురాజయ్య1925 ఏప్రిల్ 7న సిద్దిపేటలో పుట్టారు. బాల్యంలో నకాషీ చిత్రాలు చూసి చిత్రకళ వైపు ఆకర్షితులయ్యారు. గురువులైన కుబేరుడు, లింబగిరిల ప్రోత్సాహంతో కుంచెకు పదును పెట్టారు. పట్టుదలగా సాధన చేసి చిత్రకళలో ఆరితేరారు. అంచెలంచెలుగా ఎదుగుతూ తనదైన శైలిలో వైవిధ్యభరిత చిత్రాలను ఆవిష్కరించారు. నిరాడంబర జీవనం, ఆత్మీయంగా మాట్లాడటం ఆయన ప్రత్యేకత. రాజయ్య చిత్రకళ విశేషాలు విభిన్న భాషల్లో దిన, వార, మాస పత్రికల్లో ప్రచురితమయ్యాయి. జాతీయ, అంతర్జాతీయ మ్యాగ్జైన్లలో రాజయ్య జీవనం, చిత్రాలకు చోటు దక్కింది. ఆయన ‘కుంచె పదాలు’ అనే కవితా సంపుటిని వెలువరించారు.
రంగుల చిత్రాలపై కురిసిన పురస్కారాలు
కాపు రాజయ్య కుంచె నుంచి జాలువారిన కల్లుగీత కార్మికుల ‘రిస్కీ లైఫ్’ కళాఖండానికి1990లో జాతీయ పురస్కారం లభించింది. 1975లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘చిత్ర కళా ప్రపూర్ణ’ బిరుదు ప్రకటించింది. భారత ప్రభుత్వం సీనియర్ ఫెలోషిప్, హైదరాబాద్ జేఎన్ టీయూ ‘కళా ప్రవీణ’ బిరుదులు అందించాయి. ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలుగు విశ్వవిద్యాలయం నుంచి అనేక అవార్డులు అందుకున్నారు. భారతీయ ఆర్ట్స్ అకాడమీ ‘కళారత్న’ బిరుదుతో సత్కరించింది. రాజయ్య 2010లో రాజీవ్ ప్రతిభా పురస్కారం అందుకున్నారు. హైదరాబాద్ ఆర్ట్స్ సొసైటీ , ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ 2010లో జీవన సాఫల్య పురస్కారాలు అందజేశాయి.
ప్రపంచ దేశాల్లో ప్రదర్శనలు
1956 నుంచి1988 వరకు హంగేరి, బల్గేరియా, రొమేనియా, హవానా, జర్మనీ, చెకోస్లోవేకియా, ఆస్ట్రేలియా, క్యూబా, మెక్సికో, రష్యా, ఇటలీ, బ్రిటన్ తదితర దేశాల్లో రాజయ్య చిత్రాల ప్రదర్శనలు జరిగాయి. ఢిల్లీ , త్రివేంద్రం, ముంబై, కలకత్తా, మద్రాసు, అహ్మదాబాద్, అలహాబాద్, జైపూర్, భోపాల్, తిరుపతి, బెంగుళూరు, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో జరిగిన ప్రదర్శనల్లో రాజయ్య చిత్రాలు కళా ప్రేమికులను ఆలోచింపజేశాయి. కేంద్ర లలిత కళా అకాడమీ, రాష్ట్ర లలిత కళా అకాడమీలతోపాటు రాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖలు, అఖిలభారత సాంప్రదాయ పెయింటింగ్ వర్క్స్, దక్షిణ ప్రాంత సాంస్కృతిక కేంద్రం, విభిన్న సంస్థలు హైదరాబాద్, గుల్బర్గా, నిర్మల్, కోణార్క్, మద్రాస్, విజయవాడ, నాగపూర్, భీమవరం, సిద్దిపేట మొదలగు ప్రాంతాల్లో జరిగిన విభిన్న చిత్రకళా శిబిరాల్లో ఆయన పాల్గొన్నారు.
వివిధ బాధ్యతలు చేపట్టి..
జాతీయ లలిత కళా అకాడమీ సభ్యులుగా, ఆల్ ఇండియా లలిత కళా సొసైటీ సభ్యుడిగా, న్యూ ఢిల్లీ సెంట్రల్ కౌన్సిల్ సభ్యుడిగా, హైదరాబాద్ ఆర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, ఆంధ్ర ప్రదేశ్ కౌన్సిల్ సభ్యుడిగా, ఉస్మానియా యూనివర్సిటీ సభ్యుడిగా రాజయ్య అనేక బాధ్యతలు చేపట్టారు. పొందిన పదవులకు వన్నె తేవడంతో పాటు జాతీయ అంతర్జాతీయ చిత్రకారులతో సంబంధాలు పెంచుకుని జానపద చిత్ర కళావైభవాన్ని విస్తరించారు. రాజయ్యను స్మరించుకోవడం అంటే తెలంగాణ సంస్కృతిని, భారతీయ చిత్రకళను యాదికి తెచ్చుకోవడమే.
దేశవిదేశాల్లో రాజయ్య చిత్రాలు
భారతీయ చిత్రకళను సుసంపన్నం చేసిన రాజయ్య చిత్రాలు నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడ్రన్ ఆర్ట్స్, కేంద్ర లలిత కళా అకాడమీ, సాలార్ జంగ్ మ్యూజియం, త్రివేండ్రం శ్రీ చిత్రాలయ, మైసూర్ స్టేట్ మ్యూజియం, తిరుమల తిరుపతి దేవస్థానం, బెంగళూరు మ్యూజియం, మాస్కోలోని సాంస్కృతిక శాఖ మ్యూజియం, పార్లమెంట్ హౌస్, ఐటీసీ భద్రాచలం పేపర్ బోర్డు, న్యూఢిల్లీలోని ఫైన్ ఆర్ట్స్ కాలేజ్, కేరళలోని కొచ్చిన్ రీసెర్చ్ యూనివర్సిటీ, మద్రాస్ లోని నేషనల్ ఆర్ట్ గ్యాలరీ తదితర చోట్ల రాజయ్య చిత్రాలను పదిల పరిచారు. ఆ చిత్రాలు యువ చిత్రకారులకు స్ఫూర్తినిస్తున్నాయి.
:: తోట అశోక్, తెలంగాణ రచయితల సంఘం సిద్దిపేట జిల్లా గౌరవ అధ్యక్షులు