- అడ్వైజర్లుగా మరో 14 మంది ప్రమాణ స్వీకారం
- బంగ్లాకు ఇది రెండో స్వాతంత్ర్యం: యూనస్
- హింస, మైనార్టీలపై దాడులను కట్టడి చేస్తామని ప్రకటన
ఢాకా: బంగ్లాదేశ్ లో తాత్కాలిక ప్రభుత్వం కొలువు దీరింది. ప్రభుత్వానికి అధినేత(చీఫ్ అడ్వైజర్)గా నోబెల్ గ్రహీత, ప్రఖ్యాత ఆర్థికవేత్త డాక్టర్ మహమ్మద్ యూనస్ గురువారం ప్రమాణం చేశారు. ఢాకాలోని బంగభవన్ లో జరిగిన కార్యక్రమంలో యూనస్ తో పాటు మరో 14 మంది అడ్వైజర్ల చేత ప్రమాణం ప్రెసిడెంట్ మహమ్మద్ షహబుద్దీన్ చేయించారు. 400 మంది అతిథులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా యూనస్ మాట్లాడుతూ ప్రజలు ప్రశాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. దేశ నిర్మాణానికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు.
ఆందోళనలకు నాయకత్వం వహించిన స్టూడెంట్ లీడర్లు నహీద్ ఇస్లాం, ఆసిఫ్ మహమూద్ కూడా తాత్కాలిక ప్రభుత్వంలో చేరనున్నారు. బంగ్లాదేశ్ బ్యాంక్ మాజీ గవర్నర్ సలేహ్ ఉద్దీన్ అహ్మద్, ఢాకా యూనివర్సిటీ టీచర్ డాక్టర్.ఆసిఫ్ నజ్ రుల్, మాజీ అటార్నీ జనరల్ ఏఎఫ్ హసన్ ఆరిఫ్, విదేశాంగ మాజీ కార్యదర్శి తౌహిద్ హుస్సేన్, ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ బ్రిగేడియర్ జనరల్ (రిటైర్డ్) షెకావత్ హుస్సేన్ తదితరులు ప్రమాణం చేశారు. భద్రత కల్పించే సర్కారును నడుపుతాం
బంగ్లాదేశ్ పౌరులందరికి భద్రత కల్పించే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్ప్రతిజ్ఞ చేశారు. అలాగే దెబ్బతిన్న దేశాన్ని పునర్నిర్మించేందుకు తనకు సహకరించాలని కోరారు. తాత్కాలిక ప్రభుత్వ అధిపతిగా ప్రమాణం చేసేందుకు గురువారం మధ్యాహ్నం పారిస్ నుంచి బంగ్లాదేశ్చేరకున్న ఆయనకు హజ్రత్ షాజలాల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్-ఉజ్-జమాన్, సీనియర్ అధికారులు, విద్యార్థి నాయకులు, పౌర సమాజ సభ్యులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
బంగ్లాదేశ్ కు రెండో సారి స్వాత్యంత్ర్యం వచ్చిందని.. దాన్ని మనం కాపాడుకోవాలని అన్నారు. షేక్‌హసీనాకు వ్యతిరేకంగా జరిపిన పోరాటంలో విజయం సాధించిన యువతకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే పోరాటంలో మరణించిన విద్యార్థులకు నివాళి అర్పించారు. ‘‘దేశం ఇప్పుడు మీ చేతుల్లో ఉంది. మీ ఆకాంక్షల మేరకు దాన్ని పునర్ నిర్మించాలి. ఇందుకు మీ సృజనాత్మకతను ఉపయోగించాలి.
మీరు దేశానికి స్వాతంత్ర్యం సంపాదించారు’’ అని అన్నారు. ‘‘దేశంలో హింసాత్మకఘటనలు, దాడులు ఒక కుట్ర.. జరుగుతున్న అరాచకాలు, మైనారిటీలపై దాడులను నియంత్రించడం, శాంతిభద్రతలను స్థాపించడం నా ఫస్ట్డ్యూటీ. అన్ని వర్గాల ప్రజలు నా మాట వినాలి. ఈ గందరగోళం నుంచి దేశాన్ని రక్షించాలి” అని ఆయన కోరారు. ఆర్మీ చీఫ్ మాట్లాడుతూ దేశంలో పరిస్థితులు చాలా వేగంగా మెరుగుపడుతున్నాయని.. మూడు, నాలుగు రోజుల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని తెలిపారు.
దాడులు, లూటీలతో.. ప్రజలకు నిద్రలేని రాత్రులు
దాడులు, లూటీల భయంతో దేశవ్యాప్తంగా ప్రజలు కొన్ని రోజులుగా నిద్రలేని రాత్రులు గడుపుడుతన్నారు. ప్రజలు, స్థానిక యువకులు గుంపులు గుంపులుగా రాత్రుళ్లు వీధుల్లో కాపలా ఉంటున్నారు. పోలీస్ స్టేషన్లపై పెద్ద ఎత్తున దాడులు, ఠాణాలు తగలపెట్టడంతో పోలీసులు, భద్రతా సిబ్బంది ఎవరూ విధులకు హాజరవడం లేదు.
నేరగాళ్ల ముఠాలు, హింసాత్మక శక్తులు దోపిడీలు, లూటీలు, హత్యలు, అత్యాచారాలకు పాల్పడుతున్నాయి. దీంతో రక్షణ కరువై సాధారణ ప్రజల్లో విపరీతమైన భయం నెలకొంది. రాజధాని ఢాకాలో పరిస్థితులు మరింత ఆందోళనకరంగా ఉన్నాయి. దోపిడీ ముఠాలు, మరణాయుధాలతో సంచరించే గుంపులపై మసీదులు లౌడ్ స్పీకర్ల ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలను అలెర్ట్ చేస్తున్నాయి. ప్రజలు కూడా సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా ఇలాంటి ముఠాలపై తమ చుట్టుపక్కల వారికి హెచ్చరికలు చేస్తున్నారు.
బంగ్లాలో అశాంతి వెనక ఐఎస్ఐ కుట్ర: సాజీబ్ వాజెద్
బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న అశాంతి వెనక పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ హస్తం ఉందని ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా కొడుకు సజీబ్ వాజెద్ జాయ్ ఆరోపించారు. దీనిపై తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయన్నారు. సోషల్ మీడియా, మీడియా ద్వారా రెచ్చగొట్టినట్టు సాక్ష్యాలు ఉన్నాయని చెప్పారు. బంగ్లాదేశ్ విడిచి వెళ్లి పోయిన తన తల్లి హసీనా దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ తర్వత తిరిగి వస్తారని తెలిపారు.
గురువారం ఫోన్ ద్వారా పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ‘‘బంగబంధు” షేక్ ముజిబుర్ రెహమాన్ కుటుంబ సభ్యులు తమ ప్రజలను విడిచిపెట్టరని, ఇబ్బందుల్లో ఉన్న అవామీ లీగ్‌ను వదిలేయరని చెప్పారు. ‘‘హసీనా బంగ్లాదేశ్‌కు తిరిగి రాదని గతంలో నేను చెప్పింది నిజమే. కానీ రెండు రోజులుగా దేశవ్యాప్తంగా మా నాయకులు, పార్టీ కార్యకర్తలపై దాడుల తర్వాత మార్పు వచ్చింది. మా ప్రజలను కాపడాల్సి ఉంది. అవామీ లీగ్ బంగ్లాదేశ్‌లో అతిపెద్ద, పురాతన రాజకీయ పార్టీ కనుక మేం మా ప్రజల నుంచి దూరంగా వెళ్లలేం. దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ తర్వాత ఆమె కచ్చితంగా బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తారు”అని అన్నారు.