
ఆమె ఇండియాలోని టాప్ సైకాలజిస్ట్‌ల్లో ఒకరు. రోజూ ఎంతోమంది ఎన్నో సందేహాలు, సమస్యలతో ఆమె దగ్గరికి వెళ్తుంటారు.వాళ్లలో సమస్య ముదిరి రకరకాల ఆందోళనలతో వెళ్లేవాళ్లే ఎక్కువ. కానీ.. మానసిక సమస్యలు ఆ స్టేజీకి వెళ్లకముందే గుర్తించాలి అంటోందిడాక్టర్ నేహా మెహతా. అందుకే మెంటల్ హెల్త్ మీద రకరకాల కౌన్సెలింగ్ వీడియోలు చేసి.. యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తుంటుంది.
డాక్టర్ నేహా మెహతా భారతదేశంలో ప్రఖ్యాత సెక్సాలజిస్ట్, క్లినికల్ సైకాలజిస్టు. 10 సంవత్సరాలుగా ఈ రంగంలో ప్రాక్టీస్ చేస్తోంది. ఇప్పటివరకు 7 జాతీయ అవార్డులు అందుకుంది. ముఖ్యంగా సెక్స్, పెళ్లి, పిల్లల మానసిక ఆరోగ్యం, ప్రేమ విషయాల్లో సమస్యలు ఉన్నవాళ్లకు కౌన్సెలింగ్ ఇస్తుంటుంది. డ్రగ్స్‌కు బానిసైన, యాంగ్జైటీ లాంటి సమస్యలతో బాధపడుతున్న రోగులకు కూడా చికిత్స అందిస్తోంది. సరైన సెక్స్ కౌన్సెలింగ్ గురించి ప్రజలకు అవగాహన కల్పించాలనే లక్ష్యంతో కొన్నేండ్లుగా ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. ఆ ప్రయత్నాల్లో భాగంగానే సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్‌గా మారింది. ప్రజలకు అర్థమయ్యే విధంగా వీడియోలు చేసి ప్రొఫెషన్‌లోనే కాదు.. కంటెంట్ క్రియేటర్‌గా కూడా సక్సెస్ అయ్యింది.
మరో రెండు చానెళ్లు
నేహా మెహతా కరోనా టైంలో 2020 ఫిబ్రవరి 12న తన పేరుతోనే యూట్యూబ్ చానెల్ పెట్టింది. నాలుగేండ్ల నుంచి రెగ్యులర్‌గా వీడియోలు అప్లోడ్ చేస్తోంది. ఇప్పటివరకు 1,300 వీడియోలు పోస్ట్ చేసింది. వాటిలో పది మిలియన్లు దాటిన వీడియోలు ఎన్నో ఉన్నాయి. ప్రస్తుతం చానెల్‌కు 5.69 మిలియన్ల సబ్స్క్రయిబర్లు ఉన్నారు. ఆమె మెయిన్ చానెల్‌తోపాటు లవాలజీ సీకో, సైకాలజీ సీకో పేర్లతో మరో రెండు చానెళ్లు నడుపుతోంది. వాటిలో ‘లవాలజీ సీకో’ చానెల్లో ఇప్పటివరకు 806 వీడియోలు అప్లోడ్ చేసింది. ఈ చానెల్‌కు 3.61 మిలియన్ల సబ్‌స్క్రయిబర్స్ ఉన్నారు. మరో చానెల్ ‘సైకాలజీ సీకో’కు ఏడున్నర లక్షలకు పైగా సబ్‌స్క్రయిర్స్ ఉన్నారు. అందులో ఇప్పటివరకు 1,194 వీడియోలు అప్లోడ్ చేసింది. ఒకవైపు డాక్టర్‌గా, మరోవైపు కంటెంట్ క్రియేటర్‌గా బిజీగా ఉన్నా బ్రాండ్ ప్రమోషన్లు లాంటివి కూడా చేస్తూ... అనేక రకాలుగా సంపాదిస్తోంది.
డాక్టర్ నేహా మెహతా 1992లో న్యూఢిల్లీలో పుట్టింది. శివపురిలోని నవీన్ హింద్ సీనియర్ సెకండరీ స్కూల్లో ప్రైమరీ ఎడ్యుకేషన్ పూర్తి చేసింది. ఇంటర్ పూర్తి చేసిన తర్వాత అమర్ జ్యోతి కాలేజీలో చేరింది. ప్రస్తుతం హర్యానాలోని హిసార్‌లో ఉంటోంది. ప్రెసిడియం, ఫస్ట్ క్రై, రేడియో సిటీ, దైనిక్ భాస్కర్, మామ్ జంక్షన్ లాంటి వేదికలతో కలిసి పనిచేస్తోంది. ఆమె రాసిన ఆర్టికల్స్ ఎన్నో ప్రముఖ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. నేషనల్ మీడియా సంస్థలు ఆమెని ఇంటర్వ్యూలు చేశాయి.
ఎన్నో విషయాలు
ఒక్క మానసిక సమస్యల మీదే కాదు.. ఆరోగ్యం విషయంలో ప్రజలకు తెలియని ఎన్నో విషయాలపై యూట్యూబ్ ద్వారా అవగాహన కల్పిస్తోంది నేహా మెహతా. ఆమె ఏ విషయం చెప్పాలనుకున్నా అంతకుముందు చాలా రీసెర్చ్ చేస్తుంది. శాస్త్రీయంగా అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాతే సబ్‌స్క్రయిబర్స్‌తో పంచుకుంటుంది. గైనికోమాస్టియా నుంచి గైనిక్ సమస్యల వరకు అన్నింటికీ పరిష్కారాలు చెప్తుంది. డైట్, ఎక్సర్సైజ్, హెల్దీ హ్యాబిట్స్ గురించి కూడా తన వీడియోల్లో చెప్తుంటుంది.